జగన్ రాష్ర్టాన్ని దివాలా తీయించారుః జయప్రకాష్ నారాయణ
సంక్షేమపథకాలంటూ ఆంధ్రప్రదేశ్‌ను ముఖ్యమంత్రి జగన్ దివాలా తీయించారని మాజీ ఐఏఎస్, జనసత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ ఆరోపించారు. ఇబ్బముడిగా సంక్షేమపథకాలను అమలు చేసిన దేశాలు దివాలా తీశాయని వెనుజులా, పాకిస్తాన్, శ్రీలంక,జింబాబ్వేల పరిస్థితులను రాష్ట్రంలో జగన్ తెచ్చారని, రేపన్నదే లేదన్నట్లుగా వ్యవహరించి, రాష్ర్టాన్ని జగన్ దివాలా తీయించారని ఆయన ఆరోపించారు. ఉన్న ఆర్థిక వనరులను విచ్చలవిడిగా వినియోగించి సంక్షేమం పేరిట దోచుకున్నారని ఆయన విమర్శించారు. పేద రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమం పేరిట దోపిడీ జరిగిందని, దీనికి అడ్డుకట్ట వేయాలని ఆయన సూచించారు.
జగన్ పరిపాలన అంటే పంచడమే...!
ప్రస్తుత పాలకుడైన జగన్‌కు పరిపాలన అంటే పంచడమేనని భావిస్తున్నారని, సంక్షేమపథకాలు అమలు చేస్తే చాలని, ప్రజలను పేదరికంలో ఉండడమే ఆయనకు కావాలని, ఆయన అదే చేస్తున్నారని ఆయన విమర్శించారు. సరైన పాలకులు పేద ప్రజలను పేదరికంలో నుంచి బయటకు తేవడానికి ప్రయత్నిస్తారని, కానీ జగన్ పేదలను దానిలోనే మగ్గిపోయేలా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పేదలకు రోజుకు ఇంత అని పంచుతున్నామని ప్రతిరోజూ మీడియాలో ప్రకటనలు ఇచ్చుకుంటున్నారని, అది తప్ప మరో దానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆయన అన్నారు. ఆర్థికాభివృద్ధి గురించి కానీ, కొత్త పరిశ్రమల స్థాపన గురించి కానీ, నిరుద్యోగుల సమస్యల గురించి కానీ, రోడ్ల గురించి కానీ, శాంతిభద్రత విషయం గురించి కానీ, ప్రజలకు కల్పించాల్సిన మౌళిక సదుపాయాల గురించి కానీ పాలకులు ఆలోచించడం లేదని, పేదలను ఓట్ల వేసే యంత్రాలుగా ముఖ్యమంత్రి జగన్ తయారు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రజల నుంచి పన్నుల రూపంలో వచ్చే సొమ్ముల్లో సగం పంచుతాను..మిగతాది తినేస్తానన్నట్లు ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. లక్షల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారని, ప్రభుత్వ ఆస్తులను తనఖా పెడుతున్నారని, చివరకు సచివాలయాన్ని కూడా తనఖా పెట్టారని ఇంతకంటే సిగ్గు చేటైన వ్యవహారాలు మరేమీ లేవని ఆయన దుయ్యబట్టారు. తీరప్రాంత రాష్ట్రం అభివృద్ధిలో ఎంతో ముందుండాలని కాని ఇప్పుడా పరిస్థితి లేదని ఆయన విమర్శించారు.
చంద్రబాబుకు క్రెడిబులిటీ ఉంది...!
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షనాయకునికి క్రెడిబులిటీ ఉందని, మౌళిక సదుపాయాలను కల్పించగలుగుతారని, అభివృద్ధి చేస్తారని, గతంలో చేసిన చరిత్ర ఆయనకు ఉందని, ఆయనను నమ్మవచ్చని,ఆయన ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటారని, సంపద సృష్టిస్తారనే భరోసా ఉందని జయప్రకాష్ నారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన జరిగి, రాష్ట్రం సంక్షోభంలో ఉన్న సమయమైన 2014-19 కాలంలో అప్పటి ప్రభుత్వం అద్భుతంగా పనిచేసిందని, మౌలిక వసతులు, అభివృద్ధికి కృషి చేసిందని, పెట్టుబడులను ప్రోత్సహించిందని, పోలవరం ప్రాజెక్టును దాదాపు పూర్తి చేసిందని, రాష్ట్ర వ్యాప్తంగా సీసీ రోడ్లను నిర్మించిందని, కియా వంటి అంతర్జాతీయ కంపెనీలను తీసుకువచ్చారని, పెట్టుబడులకు ఊతం ఇచ్చే స్థితిని అప్పటి ప్రభుత్వం తీసుకువచ్చిందని ఆయన అన్నారు. చంద్రబాబు మళ్లీ వస్తే రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తారనే నమ్మకం ప్రజలకు ఉందని, అందుకే మెజార్టీ ప్రజలు వారివైపు చూస్తున్నారని జయప్రకాష్ నారాయణ అన్నారు.
క్లాస్‌వార్ తప్పుడు ప్రచారం...!
జగన్ చేస్తోన్న క్లాస్‌వార్ ప్రకటనలను ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటి తప్పుడు విధానాలను తీసుకురావడం తప్పని, ఒకరిపై ఒకరిని ఉసిగొల్పడం మంచి పద్దతి కాదని ఆయన విమర్శించారు. పేదలకు తాను పంచి పెడుతున్నానని, మిగతావారంతా పేదవారికి శత్రువులంటూ ప్రచారం చేయడం దుర్మార్గమని, ఇది పేదలను మరింత పేదలుగా మార్చే కుట్రగా ఆయన అభివర్ణించారు. అసమానతలను తొలగించకుండా డ్రామాలు ఆడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కుల రాజకీయాలు చేయడం దురదృష్టకరమని, పేదరికాన్ని నిర్మూలించడానికి సరైన చర్యలను తీసుకోవాలి కానీ, ఒకరిపై ఒకరిని ఉసిగొల్పడం సరికాదన్నారు.
ప్రత్యేకహోదానా...గొంగూరా
ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన ప్రత్యేక హోదాపై మాజీ ఐఏఎస్, జనసత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేకహోదా..గొంగూరా..అంటూ ఆయన ప్రత్యేకహోదాను ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు..దీనిపై నాటకాలు ఆడుతున్నాయని,గత ఎన్నికల సమయంలో వైకాపా హోదా గురించి యాగీ చేసిందని, ఇప్పుడు వీళ్లు కూడా అదే చేస్తారని, దాని గురించి ఎవరికి శ్రద్ధ లేదని ఆయన వ్యాఖ్యానించారు.