‘దేశం’లో 1200లోక్ సభ సీట్లు...!?
కేంద్ర ప్రభుత్వం లోక్ సభ సీట్లను భారీగా పెంచబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. లోక్ సభలో ప్రస్తుతం 543 సీట్లు ఉండగా వాటిని 1200కు పెంచాలని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఈ విధంగా చేస్తున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత మనోజ్ తివారి వ్యాఖ్యానించారు. బిజెపిలోని తన సన్నిహితుల ద్వారా ఈ విషయం తనకు తెలిసిందని ఆయన పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు రాజకీయ, జర్నలిస్టు వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుత ప్రభుత్వం నూతనంగా పార్లమెంట్ భవనాన్ని నిర్మిస్తోంది. దీనిలో దాదాపు వెయ్యి సీట్లను ఏర్పాటు చేస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుంటే బిజెపి ప్రభుత్వం లోక్ సభ సీట్లను పెంచడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 1977 నుంచి లోక్ సభ సీట్లు పెరగలేదు. 2009లో లోక్ సభ సీట్ల పునర్విభజన జరిగినా సీట్ల సంఖ్య మాత్రం పెరగలేదు. 1977లో భారత దేశ జనాభా దాదాపు 55కోట్లు ఉంటే ఇప్పుడు దేశ జనాభా 135కోట్లు. పెరిగిన జనాభాకు అనుగుణంగా లోక్ సభ సీట్లను పెంచాలనే డిమాండ్ ఎప్పటి నుంచే ఉంది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా దీన్ని సమర్థించారు. ఆయన రాజ్యసభ స్థానాలను కూడా పెంచాలన్నారు. తక్కువ జనాభా ఉన్న బ్రిటన్ లో 650, కెనడాలో 443, అమెరికాలో 535 మంది ఎంపీలు ఉంటే మన దేశంలో వెయ్యి మంది ఎంపీలు ఉండాలని ఆయన అన్నారు.
ఆంధ్రాలో 52, తెలంగాణలో 39...!
పైన పేర్కొన్నట్లుగా లోక్ సభ స్థానాలు పెరిగితే ఆంధ్రప్రదేశ్ లో 52 లోక్‌సభ సీట్లు ఏర్పాటు అవుతాయి. తెలంగాణలో 39 సీట్లు వస్తాయి. ప్రస్తుతం ఆంధ్రాలో 25, తెలంగాణలో 17 సీట్లు ఉన్నాయి. లోక్ సభ సీట్లు 1200కు పెరిగితే దేశంలో అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో 193 సీట్లు ఉంటాయి. అదే విధంగా, మహారాష్ట్రలో 117, పశ్చిమ బెంగాల్ లో 92, బీహార్ లో 94, తమిళనాడు 77, రాజస్థాన్ లో 65, మధ్యప్రదేశ్ లో 68, కర్ణాటకలో 67, గుజరాత్ లో 60 సీట్లు పెరుగుతున్నాయి. దేశంలో లోక్ సభ సీట్లు 1200 పెరిగితే ఎవరికి లాభం అన్నదానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దేశంలోనే ఎక్కువ సీట్లు ఉన్న ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ల వల్ల బిజెపికి లాభం కలుగుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. లోక్ సభ సీట్లు పెరిగితే రాజకీయపార్టీలకు, నాయకులకు లాభం ఉంటుందోమే కానీ, వారి ఖర్చుల రూపేణా ప్రజలపై మరింత భారం పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతోంది.