లేటెస్ట్

ప్ర‌జల దృష్టి మ‌ర‌ల్చేందుకేనా..‘పోతిరెడ్డిపాడు’వివాదం..!

తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో హఠాత్తుగా ‘పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌’ జొరబడింది. ప్రపంచ దేశాల్లో, మన దేశంలోనూ ‘కరోనా’ మహమ్మారి నివారణ గురించి, వస్తోన్న కేసుల‌ను తగ్గించేందుకు, రోగుల‌కు సహాయం చేసేందుకు, లాక్‌డౌన్‌ ఎత్తేయాలా...? కొనసాగించాలా..? అనే విషయాల‌పై ఆయా ప్రభుత్వాలు  తీరక లేకుండా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం నదీ జలాల వివాదాల‌పై ప్రభుత్వాలు దృష్టిని పెట్టాయి. నిన్నటి దాకా బతికి ఉంటే బలుసాకు తినవచ్చు..కరోనా బారిన పడకుండా ప్రజల‌ను కాపాడడమే తన ధ్యేయమన్న తెలంగాణ ముఖ్యమంత్రి ‘కె.చంద్రశేఖర్‌రావు’ ఉన్నట్టుండి ‘పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌’ వివాదాన్ని ఎందుకు ఎత్తుకున్నారు...? ‘కరోనా’ సహాయక చర్యలు, ఫించన్లు, ఎల్జీ కంపెనీ నుంచి విడుదలైన విషవాయువులు, మూడు రాజధానులు, మద్యం, ఇళ్ల స్థలా పంపిణీ తదితర విషయాల‌పై సమీక్షలు నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రికి  నదీ జలాల‌ వివాదం ఎందుకు ప్రాధాన్యతా అంశం అయింది. 

వాస్తవానికి నదీ జలాల‌ విషయంలో ఈ రెండు రాష్ట్రాల‌ ముఖ్యమంత్రులు నిన్నటి వరకు ఏక మాటపై నిలిచారు. ఇరు రాష్ట్రాల‌ ప్రయోజనాల‌ను కాపాడుకుంటూ ప్రాజెక్టుల‌ను నిర్మించాల‌ని, కృష్ణా, గోదావరి నదుల‌తో తెలుగు రాష్ట్రాల‌ భూముల‌ను సశ్యశ్యామలం చేయాల‌ని ఇరువురు హైదరాబాద్‌లో కూర్చుని గంటలు గంటలు చర్చించుకున్నారు. వారు చర్చించుకోవడమే కాదు..దీనిలో ఇరు రాష్ట్రాల‌కు చెందిన ఉన్నతాధికారుల‌ను కూడా భాగస్వాములు చేశారు. తెంగాణ, ఆంధ్రాలు కల‌సి సాగునీటి ప్రాజెక్టులు చేపడతాయని, దీని కోసం 10ల‌క్ష కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని, దీన్ని సమంగా భరిస్తామని మీడియా ముందుకు వచ్చి చెప్పారు. పైగా వెనుకబడిన ‘రాయల‌సీమ’పై తాను ప్రత్యేక దృష్టి పెట్టానని, ఆ ప్రాంతానికి సాగునీరు, తాగునీరు అందిస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఇవన్నీ నిన్న మొన్నటి దాకా..ఇప్పుడు మాత్రం ఎవరూ ఊహించని విధంగా ‘పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌’పై ఆయన కస్సు మంటున్నారు. రాయల‌సీమకు మేలు చేస్తానన్న ‘కెసిఆర్‌’ ఇప్పుడు ఆ ప్రాంతానికి న్యాయం జరిగే ‘పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌’ను ఎందుకు వివాదాస్పదం చేస్తున్నారు....? ఎప్పుడో   ‘పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌’ సామర్ధ్యాన్ని పెంచాల‌ని ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి జీవో ఇస్తే..ఇప్పుడు దానిని పట్టుకుని యాగీ చేయడం వెనుక ఉన్న రాజకీయం ఏమిటి..? ఒక్కసారిగా ప్రాధాన్యాలు మారి...జల‌ వివాదాలు తెరపైకి తేవడం వెనుక ఏమైనా రాజకీయాలు ఉన్నాయా..? ‘కరోనా’ను కట్టడి చేయడంలో విఫల‌మై దాన్ని నుంచి ప్రజల‌ దృష్టిని మళ్లించేందుకే ఇప్పుడు ఈ వివాదాన్ని తెల‌కెత్తుకున్నారనే మాట వినిపిస్తోంది. 

వాస్తవానికి ‘పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌’ విషయం ఇప్పటిది కాదు..‘జగన్‌’ తండ్రి వై.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచే ఈ వివాదం రగులుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో ‘పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌’ సామర్ధ్యం పెంచడంపై అప్పట్లో తెంగాణ సంఘాలు మండిపడ్డాయి. అప్పట్లో దీనిపై ‘కెసిఆర్‌’ స్పందిస్తూ ‘రాజశేఖర్‌రెడ్డి’ ‘నీళ్ల దొంగ’ అని తెంగాణ జలాల‌ను అక్రమంగా రాయల‌సీమకు తరలించుకుపోతున్నారని దూషించారు. ఆ తరువాత తెంగాణ ఉద్యమం జరిగినన్నాళ్లూ దీనిపై ఆయన యాగీ చేస్తూనే ఉన్నారు. తాను ముఖ్యమంత్రి అయ్యే వరకు ఈ విషయాన్ని ప్రతిసారి వాడుకుంటూనే ఉన్నారు. అయితే ఆయన ముఖ్యమంత్రి అయిన తరువాత...దీని గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఏడాది క్రితం ఆంధ్రప్రదేశ్‌లో అధికారం ‘జగన్‌’ చేతికి వచ్చిన తరువాత రెండు రాష్ట్రాలు కల‌సి జల‌యజ్ఞం చేస్తాయని ప్రకటించడం, దానికి అనుగుణంగా ఇద్దరూ ఏకాంతంగా చర్చించుకోవడం జరిగింది. ఇదే విషయంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ‘జగన్మోహన్‌రెడ్డి’ కూడా అసెంబ్లీలో ‘కెసిఆర్‌’ ప్రశంసించారు. ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకుని, ఏక జల‌విధానాన్ని  రూపొందించుకుని ముందుపోతున్న ఈ సహాదరుల‌కు ఇప్పుడు ఆకస్మికంగా ‘పోతిరెడ్డిపాడు’ ఎందుకు గుర్తుకు వచ్చిందో ఎవరికీ అర్థం కావడం లేదు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇబ్బందికరమైన విషయాల‌ను పక్క దారి పట్టించేందుకే దీన్ని ఎంచుకున్నారా..? అనే అనుమానాలు పలువురిలో వ్యక్తం అవుతున్నాయి. మొత్తం మీద..‘కరోనా’ను కట్టడి చేయడంలో, ఇతర ప్రజా సమస్యల‌ను పరిష్కరించడంలో విఫల‌మయ్యే..ఇప్పుడు ‘పోతిరెడ్డిపాడు’పై పడ్డారనే మాట సర్వత్రా వినిపిస్తోంది.

(4689)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ