కాళ్ల బేరానికి కీలక అధికారులు...!
నిన్నమొన్నటిదాకా అధికారపార్టీ అడుగులకు మడుగులొత్తిన కొందరు అధికారులు ఇప్పుడిప్పుడే వాస్తవంలోకి వస్తున్నారు. వైకాపా అధికారం శాశ్వతమని, వాళ్లే అధికారంలో ఉంటారని, వారు ఆడమన్నట్లు ఇష్టారాజ్యంగా ఆడిన అధికారులు, ఇప్పుడు వైకాపా ఓటమికోరల్లో ఉండడంతో..ప్రతిపక్ష తెలుగుదేశం నేతలను ఆశ్రయిస్తున్నారు. గతంలో తాము చేసిన తప్పులను చూసీ చూడనట్లు వదిలేయాలని అధికారంలో ఉన్న వైకాపా నేతల ప్రోద్భలంతోనే తాము విచ్చలవిడిగా ప్రవర్తించామని, తాము చేసిన తప్పులను తెలుసుకున్నామని, తమకు టిడిపిపై ధ్వేషం లేదని, తమను మన్నించాలని కీలక అధికారులు టిడిపికి చెందిన కీలకనాయకులకు వర్తమానం పంపుతున్నారు. ఇలా వర్తమానాలు పంపుతున్నవారిలో ఐఏఎస్, ఐపిఎస్, శాఖాధిపతులు, ఇతర రాష్ట్రాల్లో పనిచేసి ఇక్కడ డిప్యూటేషన్‌పై పనిచేస్తోన్న అధికారులు కూడా ఇందులో ఉన్నారు. కొందరు ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు నేరుగా చంద్రబాబును కలసి తామేమీ తప్పు చేయలేదని, వ్యక్తిగతంగా తమకు టిడిపిపై కానీ, పార్టీ నాయకులపై కానీ ధ్వేషం, కోపం లేదని, అధికారంలో ఉన్నవారు చెప్పిన విధంగానే చేశామని, ఇప్పుడు వాటిని మనస్సులో పెట్టుకుని తమపై కక్ష సాధించవద్దని వారు కోరుకున్నారని ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా కొందరు శాఖాధిపతులు, ఐపిఎస్ అధికారులు ఇందులో ఉన్నారు. రూల్స్‌ను పక్కనపెట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వారు..ఇప్పుడు ప్రభుత్వం మారితే తమ గతేమిటనే భావనతో ముందుగానే ‘చంద్రబాబు’ చుట్టూ తిరుగుతున్నారు. కొంత మంది ‘చంద్రబాబు’ను కలుస్తుండగా, మరికొందరు ఆయన కుమారుడు ‘లోకేష్’ను కలిసి కాళ్ల బేరానికి వస్తున్నారు. అడ్డగోలుగా వ్యవహరించిన వారే ఇందులో ఎక్కువగా ఉన్నారు. కొందరు అధికారపార్టీకి కట్టుబానిసల్లా వ్యవహరించారని, తాము అధికారంలోకి వస్తే వారిని వదలబోమని ఇప్పటికే ‘లోకేష్’ ప్రకటించి ఉన్నారు. దీంతో..గతంలోవలే..టిడిపి ఈసారి వదిలిపెట్టదని, ప్రజలను, పార్టీని ఇబ్బంది పెట్టిన వారి అంతు చూస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.దీంతో వీరంతా అప్పుడే కాళ్లబేరానికి వచ్చారని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. ఇలా కాళ్ల బేరానికి వచ్చిన వారిలో ముఖ్యమంత్రి జగన్‌కు సన్నిహితంగా ఉన్న కీలక అధికారులు కూడా ఉన్నారని తెలుస్తోంది. ‘జగన్’ నిర్ణయాల్లో కీలకమైన వారు కూడా ఇప్పుడు తమకేమీ తెలియదని, అంతా ఆయన చెప్పినట్లే చేశామని, తమను వదిలేయాలని కోరుతున్నారట. మొత్తం మీద ఐదేళ్లపాటు విచ్చలవిడిగా అధికారాన్ని అనుభవించి, దానితో వందలకోట్లు కూడబెట్టిన అధికారులు, ఇప్పుడు అధికారం తమ చేతి నుంచి జారీపోతుందని గ్రహించి వెంటనే జెండా మార్చేయడానికి ‘సిద్ధం’ అవుతున్నారని, వీరిని టిడిపి అధినేత దగ్గరకు రానీయకుండా చూడాలని టిడిపి నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు కోరుకుంటున్నారు.