WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'ఆన్‌లైన్‌' బదిలీలతో అన్ని వర్గాల్లో సంతృప్తి...!

ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల ఉత్తర్వులు జారీ చేయడం వెనుక ఉన్న అధికారి ఎవరా? ఎవరా అని టెన్షన్‌ పడుతున్న వారికి ఇప్పటి వరకు వారి పేరు ఎవరికీ తెలియదు. కానీ 'జనం ప్రతినిధి' ఆ పేరును తెలుసుకున్నారు. ఆయన ఎవరో కాదు..ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న 'ప్రద్యుమ్న'. బదిలీల వెనుక మరో యువ ఐఎఎస్‌కు కూడా ఇందులో కీలక పాత్ర ఉంది. ఆయన ఒక జిల్లాకు యువ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరిద్దరి సలహాలు, సూచనలను అమలు చేసి సిఎం విమర్శకుల నోరు మూయించారు. అధికార పార్టీ వర్గాలు ఆవేశపడ్డా, ఆవేదనపడ్డా, ప్రభుత్వానికి ఈ బదిలీల విషయంలో పాలకులు కూడా ఊహించని విధంగా పేరు ప్రతిష్టలు పెరిగాయి. ఆన్‌లైన్‌ బదిలీల విధానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేయగా, ఆ విధానాన్ని పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అమలు చేసేందుకు వివరాలను తెలుసుకొని రమ్మని తమకు ఇష్టమైన కొందరు అధికారులను రహస్యంగా పంపించారట. విపక్షాలు కూడా ఈ బదిలీ విధానం అమలు చేయడంపై బాహాటంగా పొగడకపోయినా ఆఫ్‌ ది రికార్డుగా అభినందిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఎవరెవరు ఎన్ని విమర్శలు చేసినప్పటికీ తన కార్యాలయ అధికారి 'ప్రద్యుమ్న'తో పాటు ఒక జిల్లా కలెక్టర్‌ చేసిన సూచనలను అమలు చేసినందుకు ప్రభుత్వ ప్రతిష్ట రెట్టింపు పెరిగిందని సిఎం సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయం తెలియని మంత్రులు, అధికారపార్టీ ప్రజా ప్రతినిధులు నిన్నటి వరకు వారిద్దరినీ తిట్టిపోసినప్పటికీ తాజాగా ప్రభుత్వ ప్రతిష్ట పెరగడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మీకు కావాల్సిన పనులేమైనా ఉంటే తరువాత చూద్దాం..అప్పటి వరకూ ఎలాంటి ఒత్తిడిలు, సిఫార్సులు చేయవద్దని సిఎం చంద్రబాబు చెప్పిన మాటలను నిన్నటి వరకు బాధను కల్గించినా తాజాగా ఆయన ఆలోచనను అర్థం చేసుకున్నారట.'వాహనదారులకు...నయా బెదిరింపులు...!

ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా బెదిరింపు వసూలు కార్యక్రమాన్ని కొంత మంది ఇటీవలే ప్రారంభించారట. ఆ బెదిరింపులతో ఆర్థికంగా నష్టపోయిన కొందరు తమ అనుభవాలను 'జనం ప్రతినిధి'కి తెలిపారు. ముఖ్యంగా రాజకీయ చైతన్యం కల గుంటూరు నగరాన్ని నుండి అటు వైపు ఇటు వైపు వెళ్లే ప్రాంతాల్లో ఊరిబయట కొందరు ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని తిష్టవేసి గృహాలను నిర్మించుకోవడం కాకుండా కరెంట్‌ సౌకర్యం తెచ్చుకున్నారు.అప్పటి వరకూ అణిగి మణిగి ఉన్న వీరు ఇటీవల కాలంలో అతి తెలివితేటలను ప్రదర్శిస్తున్నారట. ద్విచక్రవాహనాలపై వెళ్లేవారు ఏదైనా చిన్న తప్పు అంటే 'జంతువులకు ప్రమాదం కల్గించినా దారికి అడ్డంగా వచ్చిన వారికి ప్రమాదం కల్గి స్వల్పగాయాలు అయినా అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్న వారందరూ గుమి కూడి వాహదారులపై దాడి చేస్తున్నారు. వాద ప్రతివాదనలు జరిగాక వారిలో కొందరు మధ్యవర్తుల అవతారం ఎత్తి ఇంత సొమ్ము ఇవ్వాలని డిమాండ్‌ చేస్తారు. పరస్పర చర్చలు జరిగాక ఆ డిమాండ్‌కు తగ్గ సొమ్ము కాకపోయినా కొంత సొమ్మును ముట్టచెబితేనే వాహనదారులు వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నారు. ఇటీవలే ఒక పోలీసు అధికారి మఫ్టీలో వెళుతున్నప్పుడు ఒక కోడి పుంజు అడ్డు రావడంతో ఆయన సడన్‌బ్రేక్‌ వేసి వాహనాన్ని నిలిపివేసినా ఆ పుంజును తాకింది. కానీ దానికి ఎలాంటి గాయాలు కాలేదు. చుట్టుపక్కల ఉన్నవారు కర్రలతో పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పోలీసు అధికారిపై దాడి చేయబోయారు. అసలు విషయం తెలియని ఆ పోలీసు అధికారి తాను చేసిన తప్పేమిటంటూ వారు అడిగారు. మీరు మా కోడి పుంజుకు యాక్సిడెంట్‌ చేశారు.అది బతికే అవకాశం లేదు..మనుషులకు ప్రమాదం జరిగినా కేసులు సీరియస్‌గా ఉండదు. అదే కోడి పుంజులకైతే కేసులు సీరియస్‌గా ఉంటాయని బెదిరించారు. ఇంతకు మీకేం కావాలి అని అడగగా కొన్ని వేలు డిమాండ్‌ చేశారు. ఒక గంట ఎదురు చూడండి..ఇస్తాను..అని పక్కకు వెళ్లి దగ్గరలోని పోలీసు స్టేషన్‌ అధికారికి ఫోన్‌ చేసి తాను ఎవరో చెప్పి సిబ్బందితో రమ్మని కోరారు. దీంతో కథ అడ్డం తిరిగింది. పోలీసు వచ్చే సరికి అప్పటి వరకూ దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నవారందరూ పారిపోయారు. వారిలో కొందరి ఫోటోలు తీసిన ఆ పోలీసు అధికారి వారిపై కేసు నమోదు చేయాలని ఆ ఫోటొలను పోలీసు అధికారి సెల్‌ఫోన్‌ ద్వారా పంపించారు. పోలీసు అధికారి కాబట్టి ఆయన తట్టుకున్నారు. సామాన్య వాహదారుల పరిస్థితి ఏమిటి? ఇటీవల కాలంలో ఈ బెదిరింపు వసూళ్లు ఎక్కువయ్యాయని పోలీసు అధికారులు కూడా చెబుతున్నారు. ఊరి బయట ఉండే వారిని అక్కడ నుండి ఖాళీ చేయిస్తేనే అటు ట్రాఫిక్‌కు ఇబ్బంది ఉండవని, ఇటు బెదిరింపు వసూళ్లు ఉండవని జిల్లా స్థాయి అధికారికి తెలిపారు.

(174)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ