లేటెస్ట్

‘దత్తపుత్రుడి’ పాలనపై ‘మోడీ’ ఏమంటారో...!?

‘చంద్రబాబు’ను బెదిరించి, ఆదరించి, కాళ్ల బేరానికి తెచ్చుకుని పొత్తుకుదుర్చుకున్న బిజెపి నిజస్వరూపం 17న చిలకలూరిపేటలో జరగనున్న సభతో బయటపడనుంది. రాష్ట్రంలో నోటా కంటే తక్కువ ఓట్లు ఉన్న ‘బిజెపి’కి 6 ఎంపీ సీట్లు, 10 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన టిడిపి, జనసేనకు వారు ఆశించిన సహకారం ఇప్పుడైనా అందుతుందా...? అనేది ఈ సభతో తేలిపోనుంది. చిలకలూరిపేట వద్ద నున్న ‘బొప్పూడి’లో జరగనున్న కూటమి బహిరంగ సభకు ప్రధాని మోడీ హాజరుకానున్నారు.రాష్ట్రంలో ఎటువంటి బలం లేకపోయినా..కేంద్రంలో అధికారంలో ఉన్నదన్న ఏకైక కారణంతో, బిజెపి గొంతెమ్మ కోర్కెలను తీర్చిన చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ల కోరికను ‘మోడీ’ ఎంత వరకు నెరవేరుస్తారో..వారి నిజస్వరూపం ఏమిటో ఆ రోజుతో తేలిపోనుంది. వాస్తవానికి టిడిపి, జనసేనతో కలవడం ప్రధాని మోడీకి ఇష్టం లేదని, అయితే ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలు, బిజెపిలోని ఓ వర్గం పదే పదే ఒత్తిడి చేయడంతో ఆయన ఈ పొత్తుకు ఆమోద ముద్రవేశారని ప్రచారం సాగుతోంది. మొత్తానికి పొత్తు కుదిరిన తరువాత జరుగుతున్న సభలో తన ‘దత్తపుత్రుడి’ పాలన గురించి ఏమంటారో..అనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా సాగుతోంది. 

గత ఎన్నికల్లో తమతో విభేదించిన ‘చంద్రబాబు’ను ఓడిరచడానికి ‘జగన్‌’కు అన్ని విధాలుగా సహకరించి, ఆయన గెలిచిన తరువాత స్వంత పుత్రుడికంటే ఎక్కువ వాత్సల్యంతో ప్రోత్సహించిన ‘మోడీ’ ఇప్పుడు ‘జగన్‌’కు వ్యతిరేకంగా మాట్లాడతారా..? లేక నామమాత్రంగా విమర్శలు చేసి, ‘జగన్‌’పై ఉన్న ప్రేమను మరోసారి చాటతారా..? అనే చర్చ రాజకీయపార్టీలతోపాటు ప్రజల్లోనూ సాగుతోంది. వాస్తవానికి గత ఐదేళ్ల నుంచి రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలినా, అలిమాలిన అప్పులు చేసినా, వికృత రాజకీయచేష్టలు చేసినా, టిడిపి కార్యకర్తలు, సానుభూతిపరులు గొంతులు కోసినా, విచ్చల విడిగా దోపిడీకి పాల్పడినా, రాష్ట్రంలో రూల్‌ ఆఫ్‌ లా లేకపోయినా..అన్ని విధాలుగా రాష్ట్రం సర్వనాశనం అయిపోయినా..ప్రధాని ‘మోడీ’ తన ‘దత్తపుత్రుడి’ని చిన్నమాట అన్న పాపాన పోలేదు. పైగా ఆయనను అన్ని విధాలుగా ప్రోత్సహించారు. అడ్డగోలు అప్పులకు, అడ్డగోలు నిర్ణయాలకు తలూపి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయించారు. అయితే..ఇప్పుడు..టిడిపి,జనసేన పొత్తులో ఉన్నారు కాబట్టి..గత ఐదేళ్ల ‘జగన్‌’ పాలనపై ‘మోడీ’ ఏమంటారో..అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముందుగా ‘జగన్‌’ తీసుకున్న అతి పెద్ద ప్రజావ్యతిరేక నిర్ణయం ‘మూడు రాజధానులు’. తాను శంఖుస్థాపన చేసిన ‘అమరావతి’ని ‘జగన్‌’ నాశనం చేస్తుంటే..ఇన్నాళ్లూ ‘మోడీ’ దాని గురించి కనీసం చిన్న మాట కూడా మాట్లాడలేదు. కూటమి ఎన్నికల సభలో ఆయన దీని గురించి ప్రస్తావిస్తారా..? అదే విధంగా గత టిడిపి హయాంలో దాదాపు 70శాతం ‘పోలవరం’ పూర్తి చేసినా..నాడు ‘మోడీ’ అది ‘చంద్రబాబు’కు ‘ఏటీఎం’లా పనికివచ్చిందని విమర్శలు గుప్పించారు. ‘జగన్‌’ అధికారంలోకి వచ్చిన తరువాత..‘పోలవరం’లో రివర్స్‌ టెండరింగ్‌ అంటూ తనకు కావాల్సిన ‘మెఘా’ కృష్ణారెడ్డికి దానిని కట్టబెట్టి చోద్యం చూస్తున్నారు. దీనిపై ‘మోడీ’ ఏమంటారో చూడాలి. అదే విధంగా..రైల్వేజోన్‌కు భూములు ఇవ్వనివైనం, ఇసుక దోపిడీ, మద్యం అమ్మకాల్లో డిజిటలైజేషన్‌ లేకపోవడం, నాసిరకం మద్యాన్ని అమ్మి దోచుకోవడం, విచ్చలవిడి అప్పులు, ఆదాయ మార్గాలు లేకపోవడం, నిరుద్యోగం, పెట్టుబడులు లేకపోవడం, మహిళలపై దాడులు, ఎస్సీ,ఎస్టీలపై అరాచకాలు, రైతులను మోసగించిన వైనాలు వంటి మరెన్నో సమస్యలను సృష్టించిన‘జగన్‌’పై ‘మోడీ’ ఏమంటారో చూడాలని రాష్ట్రం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ‘జగన్‌’పై ఆయన స్పందించే తీరునుబట్టే కూటమి విజయావకాశాలు ఉంటాయి. గత ఐదేళ్లలో ‘జగన్‌’ ఎన్నో అరాచకాలు చేసినా..నోరెత్తని ఆయన..ఇప్పుడు నోరెత్తుతారా..?? అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. చూద్దాం..17న తన ‘దత్తపుత్రుడి’పై ఆయనేమంటారో...? 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ