WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

దీక్ష విరమించిన 'ముద్రగడ'...!

ఎట్టకేలకు కాపు ఉద్యమనాయకుడు 'ముద్రగడ పద్మనాభం' తన ఆమరణ దీక్షను బుధవారం నాడు సొంత ఇంటిలో విరమించారు. ఆయనకు కాపు జేఎసి నాయకులు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేశారు. ఆయనతో పాటు ఆయన సతీమణి పద్మావతి కూడా దీక్ష విరమించారు. రాజమండ్రి ప్రభుత్వ హాస్పటల్‌ నుండి ఉదయం క్లిరంపూడికి చేరుకున్న 'ముద్రగడ' దంపతులు చాలా నీరసించిపోయారు. దాదాపు 13రోజుల దీక్షను వారు ఈ రోజు విరమించారు.మొదట ఆయన సొంత ఇంటిలోనే దీక్షను మొదలు పెట్టారు. అయితే పోలీసులు ఆయన ఇంటికి వెళ్లి ఆయనను ఆయన కుటుంబ సభ్యులను ప్రభుత్వ హాస్పటల్‌కు తరలించారు. దాంతో ఆయన హాస్పటల్‌లోనే దీక్ష చేశారు. కాగా 'తుని' విధ్వంస ఘటనలో అరెస్టు చేసిన 13మందిని విడుదల చేయాలన్న తన డిమాండ్‌కు ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడంతో 'ముద్రగడ' ఇన్ని రోజులు దీక్ష చేశారు. అయితే 13మంది నిందితులకు బెయిల్‌ రావడానికి ప్రభుత్వం సహాయం చేసింది. వారి బెయిల్‌కు ప్రభుత్వం వైపు నుండి ఎటువంటి అభ్యంతరం చెప్పకపోవడం వారికి సులువుగా బెయిల్‌ లభించింది. వాస్తవానికి నిన్ననే 'ముద్రగడ' దీక్ష విరమిస్తారని భావించినా అరెస్టు అయి జైలు నుంచి మరో ఇద్దరు విడుదల కాకపోవడంతో ఆయన నిన్న దీక్ష విరమించలేదు. ఈ రోజు రాజమండ్రి జైలు నుంచి వారు విడుదల అయిన తరువాతే 'ముద్రగడ' దీక్షను విరమించారు. ఈ సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ ప్రభుత్వం తనపై కక్ష కట్టిందని, తనను తన కుటుంబ సభ్యులను దూషించారని, కొట్టారని ఆయన విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం అంతం చూసే వరకు తన కుటుంబం పండుగలు చేసుకోదని ప్రకటించారు.

(151)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ