లేటెస్ట్

ఎన్నికల అంశంగా ‘వివేకా’ హత్య...!

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ రేపు రాబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం రేపు సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ను ఇవ్వబోతున్నట్లు నిన్ననే తెలియచేసింది. రేపు మధ్యాహ్నం తరువాత ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తుంది. దీంతో సార్వత్రిక ఎన్నికల కార్యక్రమం మొదలవుతుంది. లోక్‌సభ ఎన్నికలతోపాటు ‘ఆంధ్రప్రదేశ్‌’ అసెంబ్లీ ఎన్నికలకు కూడా నోటిఫికేషన్‌ రానుంది. రేపటితో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అధికారక పాలన ముగిసిపోతుంది. ఎన్నికల షెడ్యూల్‌ వెంటనే అమలులోకి వస్తుంది..కనుక ‘జగన్‌’ రేపటి నుండి ఆపధర్మ ముఖ్యమంత్రే. బహుశా ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్‌ చివరి వారంలో జరగవచ్చు. ఆ తరువాత మే మూడోవారంలో కానీ, నాలుగోవారంలో కానీ ఎన్నికల ఫలితాలు రావచ్చు. అంటే..ఈ రెండు నెలలు పాటు ‘జగన్‌’ ఆపధర్మ ముఖ్యమంత్రే. అధికారయంత్రాంగం మొత్తం..ఎన్నికల కమీషన్‌ పరిధిలోకి వెళ్లిపోతోంది. అంటే..రేపటి వరకే..అధికారికంగా ‘జగన్‌’ ముఖ్యమంత్రి. ప్రతిపక్ష కూటమి ఆశిస్తున్నట్లు..ఆయన మళ్లీ గెలవరని..ఆయనకు ముఖ్యమంత్రిగా ఇవే చివరి రోజులని వారు..చెబుతున్నారు. తాము అధికారంలోకి వస్తామనే భావన టిడిపి, జనసేన, బిజెపి కూటమిలో ఉంది. వాస్తవానికి రాష్ట్ర ప్రజల మానసిక పరిస్థితి కూడా అంతే ఉందని వివిధ సర్వేలు చెబుతున్నాయి. జాతీయ సర్వేలన్నీ..ప్రతిపక్ష కూటమి బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారంలోకి వస్తుందని తేల్చిచెబుతున్నాయి.


మరోపక్క అధికార వైకాపాలో నిర్వేదం నెలకొంది. ఎన్నికలకు ముందే..ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు కాడి కిందేస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా..ఓటమి తప్పదనే భావన పార్టీ పెద్దల నుంచి..దిగువస్థాయి వరకూ..ప్రాకిపోయింది. అయితే..‘జగన్‌’ తాను అనుభవిస్తోన్న అధికారాన్ని అంత తేలిగ్గా వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. ఆఖరిగా రకరకాల ప్రయత్నాలను చేస్తున్నారు. కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని రకరకాల వ్యూహాలను ఆయన అమలు చేస్తున్నారు. రాబోయే ఎన్నికలు పెత్తందార్లకు, పేదలకు మధ్య పోరాటంగా చిత్రించడానికి ఆయన ఎంతో కష్టపడుతున్నారు. తాను పేదల ప్రతినిధినని, టిడిపి కూటమి పెత్తందార్లకు ప్రతినిధులని చెబుతూ..పేదలను తనవైపు ఉండే విధంగా, ఇదే అంశాన్ని ఎన్నికల అంశంగా చేయడానికి ఆయన శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే..దీనికి ప్రతిపక్ష కూటమి విరుగుడును కనిపెట్టింది. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో జరిగిన ‘వై.ఎస్‌.వివేకానందరెడ్డి’ హత్యను ఎన్నికల అంశంగా చేయడానికి ఈ కూటమి ప్రయత్నాలను మొదలుపెట్టింది. గత ఎన్నికలకు ముందు తన బాబాయి ‘వివేకానందరెడ్డి’ని ‘చంద్రబాబు’ చంపించారని ప్రచారం చేసి, భారీగా ఓట్లను ‘జగన్‌’ కొల్లగొట్టారు. వాస్తవానికి ‘వివేకా’ను హత్య చేయించింది..‘జగన్‌’ కుటుంబసభ్యులేనని ‘సీబీఐ’ తేల్చింది. దీనిలో ఇప్పటికే ‘జగన్‌’ తమ్ముడు ‘అవినాష్‌రెడ్డి’ని ‘సీబీఐ’ అరెస్టు చేసింది. ఆ తరువాత ‘వివేకా’ హత్య విషయంలో పలు సంచలన విషయాలు బయటకు వచ్చాయి. తొలుత ‘వివేకా’ గుండెపోటుతో చనిపోయాడని ‘జగన్‌’ స్వంత మీడియాలో ప్రచారం జరిగింది. అయితే..తరువాత ‘చంద్రబాబు’ హత్చ చేయించారని వారు ఆరోపించారు. అయితే..‘వివేకా’ హత్య విషయం ‘జగన్‌’కు ముందే తెలుసునని, హత్య జరిగిన విషయం తెలిసిన తరువాత కూడా ఆయన నింపాదిగా సాయంత్రానికి ‘కడప’కు వచ్చారని తేలింది. గత ఐదేళ్లుగా ఈ హత్య విషయంలో ‘జగన్‌’ నానా అగచాట్లు పడుతున్నారు.


‘వివేకా’ హంతకులను ఆయన కాపాడుతున్నారనే భావన రాష్ట్ర ప్రజల్లో నెలకొంది. అంతే కాకుండా ‘జగన్‌’కు తెలిసే ‘బాబాయి’ హత్య జరిగిందనే విషయం కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు ‘వివేకా’ సతీమణి ‘సౌభాగ్యమ్మ’, ఆయన కుమార్తె ‘సునీత’, ‘జగన్‌’ సోదరి ‘షర్మిల’ ఈ హత్య వెనుక ‘జగన్‌’ ఉన్నారని, స్వంత మనుషులే..‘వివేకా’ను హత్య చేశారని, హత్యచేసిన వారికి శిక్ష పడాలని, దీని కోసం ప్రజాక్షేత్రంలో పోరాడతామని ప్రకటించి, ఆ మేరకు ఆచరణ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి ప్రారంభించారు. నిన్నటి వరకు ‘జగన్‌’ అరాచకపాలన, ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం, ఇసుక దోపిడీ, అవినీతి, అక్రమాలు, రాజధాని, ప్రత్యేకహోదా, పోలవరం, ఉద్యోగుల సమస్యలు, సిపిఎస్‌ వంటి అంశాలు ఎన్నికల అంశాలు అవుతాయని భావించగా, ఇప్పుడు అవన్నీ పక్కకు పోయి కేవలం ‘వివేకానందరెడ్డి’ హత్య ఉదంతమే ఎన్నికల అంశంగా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.


‘వివేకా’ హత్యను ‘జగన్‌’ చేయించార‌ని, గత ఎన్నికల సమయంలో లబ్ది పొందేందుకు ‘వివేకా’ హత్యను ఉపయోగించుకున్నారనే అంశాన్ని ‘టిడిపి కూటమి’ విస్తృతంగా ప్రచారం చేయబోతోంది. ‘వివేకా’ హంతకులు ‘జగన్‌’ కుటుంబీకులేనని ‘వివేకా’  భార్య ‘సౌభాగ్యమ్మ’ ఆయన కుమార్తె ‘సునీత’లు ప్రజలకు చెప్పబోతున్నారు. ‘వివేకా’ హత్య విషయంలో ఇప్పటికే ‘జగన్‌’ బృందం రక్షణాత్మకధోరణిని అవలంభిస్తోంది. తన పత్రిక ద్వారా..‘వివేకా’ కుమార్తె, అల్లుడిపై నేరాన్ని నెట్టాలని ప్రయత్నిస్తోన్నా...అదిపెద్దగా ఫలితాలను ఇవ్వడం లేదు. తన ‘బాబాయి’ని ‘చంద్రబాబు’హత్య చేశారని, గత ఎన్నికల్లో ఎలుగెత్తి చాటిన ‘జగన్‌’ ఇప్పుడు ‘వివేకా’ కుటుంబసభ్యులు ‘వివేకా’న్ని చంపించింది ‘జగనే’నని నేరుగా చెబుతుండడంతో..దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక ‘జగన్‌’ కిందామీదా అవుతున్నాడు. ఇప్పుడు ‘టిడిపి కూటమి’తో ‘వివేకా’ కుటుంబసభ్యులు కలిసి ‘వివేకా’ హత్య విషయాన్ని ఎన్నికల అంశంగా మారిస్తే..అది ‘జగన్‌’కు శరాఘాతమే అవుతుంది. మాట్లాడితే విశ్వసనీయత, అక్కాచెల్లెమ్మళ్లు..అంటూ హోరెత్తించే ‘జగన్‌’ స్వంత చెళ్లెళ్లకు ఎంత అన్యాయం చేశారో అనే విషయం రాష్ట్ర ప్రజల దృష్టికి పూర్తిగా వెళితే..‘జగన్‌’కు ఘోరమైన దెబ్బ తగులుతుంది. మొత్తంగా..గత ఎన్నికలకు ముందు జరిగిన ‘వివేకా’ హత్య ఇప్పుడు మరోసారి ఎన్నికల అంశంగా మారిపోయే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అప్పుడు ‘వివేకా’ హత్య ‘జగన్‌’కు లబ్ది చేకూరిస్తే..ఇప్పుడు కూటమికి లబ్దికలుగుతుందా..అనే భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ