లేటెస్ట్

దమ్ముంటే రాజీనామాలు చేసి గెల‌వండి

వైకాపా ఎమ్మెల్యేల‌కు ‘రఘురామకృష్ణంరాజు’ సవాల్‌..!

తనపై ఆరోపణలు చేస్తోన్న వైకాపా ఎమ్మెల్యేల‌కు దమ్ముంటే రాజీనామాలు చేసి మళ్లీ గెల‌వాల‌ని వైకాపా నర్సాపురం ఎంపీ ‘రఘురామకృష్ణంరాజు’ సవాల్‌ విసిరారు. తన పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని ఐదుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ‘జగన్‌’ బొమ్మ పెట్టుకుని గెల‌వాల‌ని ఆయన సవాల్‌ చేశారు. వారు రాజీనామా చేస్తే తాను కూడా రాజీనామా చేస్తానని ఆయన సవాల్‌ చేశారు. ‘సింహం సింగిల్‌గానే వస్తుంది...పందులే గుంపుగా వస్తాయన్న చందంగా అసెంబ్లీ లాబీలో నాపై పడ్డారు..అంటూ ఆయన ధ్వజమెత్తారు. వైకాపాలోకి తాను వస్తానని బతిమాల‌డం ఏంటని, గత ఏడాది రిషీ అనే వ్యక్తి ప్రశాంత్‌ కిశోర్‌ ద్వారా తనను కలిశారని, పార్టీలో చేరాల‌ని తనకు పన్నో ప్రలోభాలు పెట్టారని రఘురామకృష్ణంరాజు తెలిపారు. తనను వైకాపా పెద్దలు ఏ విధంగా ప్రలోభపెట్టారో అక్కడే ఉన్న ‘విజయసాయిరెడ్డి, రాజిరెడ్డి’ల‌ను అడగాల‌ని, తాను ఇప్పటి వరకు ‘జగన్‌’ ఇంటికి వెళ్లలేదని, ఎయిర్‌పోర్టులో ఒకసారి మాత్రమే ఆయన తనను కలిశారని అన్నారు. వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేల‌ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ‘ఎవరండీ వీళ్లు, అఫ్ట్రాల్‌ గాళ్లు..ఈ జోకర్లు ఎప్పుడైనా  నా గురించి జగన్‌కు చెప్పారా..? ‘జగన్‌’ను అడగండి...ఆయన అబద్దం చెప్పరు..వాళ్లంతా దొంగలు, ప్రజల‌ నుంచి డబ్బు, చెక్కులు వసూలు చేశారని ఆయన ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు. 

‘కొట్టు’ ఇసుక దొంగ

తాడేపల్లి ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ఇసుక దొంగ, స్థలాల‌ పేరు మీద ఇసుకను దోచేశాడని ‘రఘురామ’ ఆరోపించారు. ‘ఎన్నిసార్లు నువ్వు నా కొంప చుట్టూ తిరిగావో...దేని కోసం తిరిగావో నీకు తెలియదా అంటూ’ ఎమ్మెల్యే కొట్టుపై ఆయన మండిపడ్డారు. ‘ఆ దొంగ సంగతి ఆయన మేక‌ల్లుడిని అడిగితే వివరంగా చెబుతాడు’..అంటూ విరుచుకుపడ్డారు. మరో ఎమ్మెల్యే ‘కారుమూరి నాగేశ్వరరావు’ను గురించి తాను చెప్పక్కర్లేదన్నారు. ఇళ్ల స్థలాల‌ సేకరణ, ఇళ్ల పట్టాల‌కు సంబంధించి 70శాతం ఫిర్యాదులు ఆయనపైనే వచ్చాయని ‘రఘురామకృష్ణంరాజు’ వ్యాఖ్యానించారు. భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ సౌమ్యుడు, నిజాయితీపరుడు అని, జగన్‌ అపాయింట్‌మెంట్‌ దొరకడం లేదని బాధపడేవారన్నారు. అలాంటి వ్యక్తి తనపై ఎందుకు అలా మాట్లాడారో తెలియదని, మంత్రి శ్రీరంగనాధరాజు అవినీతి, దుర్మార్గం గురించి చెప్పక్కర్లేదన్నారు. కలెక్టర్‌కు వచ్చే ఫిర్యాదుల్లో సగం ఆయనపైనే ఉంటాయని రఘురామకృష్ణంరాజు ఆరోపించారు. మొత్తం మీద ఎమ్మెల్యేలు, ఎంపీ మధ్య రేగిన చిచ్చు చిలికి చిలికి గాలివానగా మారిందని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

(467)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ