లేటెస్ట్

ప్రస్తుతానికి రాజధాని తరలింపు లేదు:మంత్రి పెద్దిరెడ్డి

రాష్ట్రంలో ‘కరోనా’ కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో రాజధాని తరలింపును ప్రస్తుతానికి వాయిదా వేసుకుంటున్నామని రాష్ట్ర పంచాయితీ రాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ‘అమరావతి’ నుంచి ‘విశాఖ’కు రాజధాని తరలింపు అయ్యే పనికాదని, ‘కరోనా’ కేసులు పెరుగుతుండడం, ఇతర సమస్యలు రావడంతో ప్రస్తుతానికి ఆ ఆలోచనను విరమించుకున్నట్లు ఆయన చెప్పారు. జూలై మాసంలో ‘కరోనా’ కేసులు రెట్టింపు అయ్యే పరిస్థితి ఉందని, ఇటువంటి పరిస్థితుల్లో రాజధాని తరలింపు సాధ్యం కాదని ఆయన అన్నారు. రెండు రోజుల‌ క్రితం జరిగిన రాష్ట్ర అసెంబ్లీసమావేశాల‌ సందర్భంగా ఉభయసభల‌నుద్దేశించి ప్రసంగించిన రాష్ట్ర గవర్నర్‌ తన ప్రసంగంలో మూడు రాజధానుల‌ గురించి ప్రస్తావించారు. పైగా రాష్ట్ర బడ్జెట్‌లో నూతన రాజధాని కోసం రూ.500కోట్లు కేటాయించారు. ఈ పరిస్థితుల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రాజధాని తరలింపుపై ఇప్పటికే రాజధాని రైతులు హైకోర్టును ఆశ్రయించి ఉన్నారు. మరో వైపు రాజధాని బిల్లు శాసనమండలిలో పెండింగ్‌లో ఉంది. మూడు రాజధానుల బిల్లును శాసనమండలి సెలెక్ట్‌ కమిటీకి పంపించగా, దాన్ని శాసనమండలి కార్యదర్శి నిర్ధారించలేదు. దీనిపై టిడిపి హైకోర్టులో కేసు వేసింది. కాగా రాజధాని తరలింపు పక్రియ ఇంకా చేపట్టలేదని, బిల్లు ఇంకా పెండింగ్‌లో ఉందని ప్రభుత్వం హైకోర్టుకు ఇటీవలే తెలిపింది. ‘కరోనా’ సమస్యలు, రైతు నుంచి ఎదురవుతున్న ప్రతిఘటన, కోర్టు కేసులు తదితర సమస్యల వ‌ల్ల‌ ప్రస్తుతానికి తరలింపును వాయిదా వేసుకోవాల‌ని ప్రభుత్వం భావించినట్లు మంత్రి తెలిపారు. కాగా గత కొంత కాలంగా కార్యనిర్వహక రాజధాని విశాఖ‌కు సచివాల‌యం తరులుతుందని ప్రచారం జరిగింది. తాజా మంత్రి ప్రకటనతో ప్రస్తుతానికి రాజధాని తరలింపు ప్రక్రియ నెమ్మదించినట్లుగా భావించవచ్చు. ఇది ఇలా ఉంటే రాజధాని అమరావతికి వెళ్లే కరకట్ట రోడ్డును విస్తరించాల‌ని నిర్ణయించినట్లు రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి ‘బొత్స సత్యనారాయణ’ తెలిపారు. సిఆర్‌డిఎ కమీషనర్‌తో కల‌సి ఆయన రాజధానిలో సుధీర్ఘంగా పర్యటించడం,వివిధ అభివృద్ధి పనుల‌పై సమీక్షు నిర్వహించడంతో...రాజధాని తరలింపు కొన్నాళ్లు ఆగిపోతుందనే మాట సర్వత్రా వినిపిస్తోంది.

(715)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ