లేటెస్ట్

62శాతం సంతృప్తి నిజమేనా...!?

ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ఏడాది పాల‌న పూర్తి అయిన సందర్భంగా సీపీఎస్‌ అనే సంస్థ ఓ సర్వేను నిర్వహించింది. ఏడాది ‘జగన్‌’ పాల‌న ఎలా ఉంది...? ఏ ప్రాంతంలో ప్రజలు ఏ పార్టీకి మద్దతు ఇస్తున్నారు...? ప్రస్తుతం ఎన్నికలు జరిగితే...ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వస్తాయి..? రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ప్రజలు జ‌గ‌న్ పాల‌నపై ఏమనుకుంటున్నారు..? అనే దానిపై సర్వే నిర్వహించి ఫలితాల‌ను విడుదల‌ చేసింది. ఆ సర్వే ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్ పాల‌నపై 62.6శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారని, 36.1శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారని, 1.4శాతం మంది ఏమీ చెప్పలేమని చెప్పారని సదరు సంస్థ ప్రకటించింది. ఉత్తర కోస్తా ప్రాంతంలో 58.8శాతం మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తుండగా, 40శాతం మంది బాగాలేదని చెప్పారు. 1.2శాతం మంది ఏమీ చెప్పలేమని చెప్పారట. గోదావరి జిల్లాల్లో 55.8శాతం మంది ‘జగన్‌’ పాల‌న బాగుందని చెప్పగా, 43.8శాతం మంది బాగాలేదని చెప్పారు. 0.4శాతం మంది ఏమీ చెప్పలేమని చెప్పారు. అమరావతి ప్రాంతంలో 54.9శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయగా, 42.1శాతం అసంతృప్తితో ఉన్నారని, 3శాతం మంది ఏమీ చెప్పలేమని అన్నారట. దక్షిణ కోస్తా ఆంధ్రాలో 74శాతం మంది బాగా ఉందని చెప్పగా, 24.3శాతం మంది బాగా లేదని, 1.7శాతం ఏమీ చెప్పలేదు. రాయల‌సీమ ప్రాంతంలో 67.1శాతం మంది ‘జగన్‌’ పాల‌నపై సంతృప్తి వ్యక్తం చేయగా, 31.9శాతం మంది బాగాలేదని, ఒకశాతం మంది ఏమీ చెప్పలేదని చెప్పారు. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే అధికార వైకాపాకు 55.8శాతం ఓట్లు వస్తాయని ఆ సర్వే తెలిపింది. అంటే గత సార్వత్రిక ఎన్నికల‌ కన్నా అధికంగా వైకాపాకు సీట్లు వస్తాయన్నమాట. ప్రతిపక్ష టిడిపికి 38.3శాతం, బిజెపి-జనసేనకు 5.3శాతం, ఇతరుల‌కు 0.7శాతం ఓట్లు వస్తాయని సర్వే సంస్థ తేల్చింది.

సర్వేను నమ్మవచ్చా...!?

ముఖ్యమంత్రిగా వై.ఎస్‌.జగన్‌ అధికారం చేపట్టి ఏడాది దాటిపోయిన సందర్భంగా సీపీఎస్‌ చేసిన సర్వేపై పలువురు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల‌ కన్నా వైకాపా గ్రాఫ్‌ పెరగడానికి...ఈ ఏడాదిలో ‘జగన్‌’ గొప్పగా చేసిందేముందన్న ప్రశ్నను పలువురు రాజకీయ పరిశీకులు వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది కాలంలో ‘జగన్‌’ సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. వివిధ వర్గాల‌కు అప్పులు చేసి సొమ్ముల‌ను పంచిపెడుతున్నారు. దీని వల్లే ప్రజల్లో సంతృప్తి పెరిగిందా..? రైతుల‌కు, పెన్షన్‌దారుల‌కు, ఆటోవాలాల‌కు, న్యాయవాదుల‌కు, చేనేత కార్మికుల‌కు, అమ్మఒడి, ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ పేరుతో విద్యార్థుల‌కు సొమ్ముల‌ను ఇచ్చారు. వాలంటీర్లతో ఇంటింటికి తిరిగి సొమ్ములు పంచిపెట్టడం, దాన్ని అందుకున్న వర్గాల‌కు సంతృప్తి ల‌భించవచ్చునేమో కానీ...అవి అందని, దానితో సంబంధం లేని మధ్యతరగతి, పైతరగతి వర్గాల్లో తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. తనకు ఓటు వేసిన వర్గాల‌ను సంతృప్తి పరచడంలో ‘జగన్‌’ కొంత వరకు సఫల‌మయ్యారేమో..కానీ తటస్థ ఓటర్లు, ఒకసారి ఓటు వేచి చూద్దామని ఓటు వేసిన వారిలో మాత్రం సంతృప్తి వ్యక్తం కావడం లేదని వారు చెబుతున్నారు. ఒక వైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే మరో వైపు విద్యుత్‌ ఛార్జీలు పెంపు, మద్యం ధర పెంపుల‌తో ఇచ్చిన సొమ్మును మళ్లీ పిండేస్తున్నారనే భావన అధిక‌శాతం ప్రజల్లో ఉంది. ఏడాదిలో ఒక్క పరిశ్రమ రాక, ఉపాధి లేక యువత ల‌బోదిబోమంటోంది. అదే విధంగా రైతు ఆత్మహత్యలు, రియల్‌ఎస్టేట్‌రంగం కుదేల‌వడం, దానిపై ఆధారపడ్డ కార్మికులు రోడ్డున పడడం, చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించే వారి వ్యాపారాలు మూతపడడం, ఉద్యోగుల‌ సమస్యలు పరిష్కరించకపోవడంతో ఎంతో ఆశ‌గా ఓటు వేసిన వారిలో అసంతృప్తి, పారిశ్రామిక రంగం కుదేల‌వడం, మూడు రాజధానుల‌ వంటి వివాదాస్పద నిర్ణయంతో దెబ్బతిన్న వ‌ర్గాల అభిప్రాయాల‌ను స‌ర్వే సంస్థ ప‌రిగ‌ణ‌లోకి తీసుకుందా..?  అస‌లు ఈ సంస్థ ఎంత మందితో స‌ర్వే చేసింది..అనేది చెప్ప‌లేదు. ప్రస్తుతం కరోనా వ‌ల్ల‌ ఏ వర్గం కూడా రోడ్డెక్కడం లేదు. అధికారంలోకి వచ్చి ఏడాదే కావడం, మరో నాలుగేళ్ల పాటు అధికారంలో ఉంటారనే భావన అసంతృప్తితో ఉన్న వారు బయటకు రావడం లేదు. ఎవ‌రూ బ‌య‌ట‌కు రావ‌డం లేదు క‌నుక‌..  అంతా బాగున్నట్లు ‘జగన్‌’ పాల‌న సూపర్‌ అని సర్టిఫికెట్లు ఇచ్చుకోవడం వ‌ల్ల‌ ‘జగన్‌’కే నష్టమని రాజకీయ పరిశీల‌కుల‌ అభిప్రాయం. గతంలో ‘చంద్రబాబు’ కూడా ఇటువంటి సర్వేలు చేయించుకుని ప్రజల్లో వందశాతం సంతృప్తి ఉందని బావించి బొక్కబోర్లా పడ్డారు. అధికారంలో ఉన్న వారి ప్రాపకం కోసం ఇటువంటి సర్వేల‌ను వంటి వారుస్తారని, ఇదే పాల‌నకు గీటు రాయి కాదని అధికారంలో ఉన్న వారు గమనించుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం ఉంది. ఏది ఏమైనా...సంక్షేమంపై అతిగా ఆధారపడితే భవిష్యత్‌లో ఎదురుదెబ్బలు తప్పవనే సంగతి పాల‌కులు గమనించాలి.

(492)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ