లేటెస్ట్

‘ఉండవల్లి’ని బ‌య‌ట‌కు ర‌ప్పించిన టిడిపి సోష‌ల్ మీడియా...!?

రాజమండ్రి మాజీ ఎంపి ‘ఉండవల్లి అరుణ్‌కుమార్‌’ ఈ రోజు వైకాపా ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు సంచల‌నం సృష్టిస్తున్నాయి. గత కొన్నాళ్లుగా వివిధ పార్టీలు చేసిన ఆరోపణల‌ను సమర్థిస్తూ, అధికార వైకాపా పార్టీ పాల‌న సరిగా లేదని ఆక్షేపించారు. ప్రభుత్వం తీసుకుంటున్న వివిధ నిర్ణయాల‌ను ఆయన తూర్పారపట్టారు. ఆయన చేసిన ఆరోపణలు కొత్తవేమీ కాకపోయినా...ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి తండ్రి రాజశేఖర్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ‘ఉండవల్లి’ నోట ఇటువంటి ఆరోపణలు, విమర్శలు రావడం ఆస‌క్తిని క‌ల్గిస్తోంది.  ఆయన ఎందుకు ఇప్పుడు బయటకు వచ్చి ‘జగన్‌’పై ఆరోపణలు ఎక్కుపెట్టారనే దానిపై రకరకాలైన వ్యాఖ్యలు వస్తున్నా...తాను బయటకు రావడానికి టిడిపి నాయకులే కారణమని చెప్పుకున్నారు. ఇది చాలా వరకు నిజమే. చాలా మంది టిడిపి నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఫోన్‌ చేసి..ప్రభుత్వ నిర్ణయాపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారని చెప్పుకున్నారు. తనకు వివిధ పార్టీ నాయకు ఫోన్‌లు చేశారని, ప్రభుత్వం తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాల‌పై మాట్లాడాని కోరారని, అందుకే ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్నానని ఆయన చెప్పారు. అయితే ఆయన అన్నట్లు కేవలం వారి వల్లే..‘ఉండవల్లి’ బయటకు రాలేదు. 

టిడిపి సోషల్‌ మీడియా గత ఏడాది నుంచి ‘ఉండవల్లి’ని ల‌క్ష్యంగా చేసుకుని పదే పదే ప్రశ్నిస్తూండడంతో ఆయన బయటకు రావాల్సి వచ్చిందనేది బహిరంగ రహస్యం. టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో మద్యం పాల‌సీ విషయంపై ఆయన క్వార్టర్‌ బాటిల్‌ మద్యం తయారు అవడానికి రూ.10/-లు అవుతుందని, దాన్ని ‘చంద్రబాబు’ ప్రభుత్వం రూ.80/-కు అమ్ముతుందని, ఇంత దారుణంగా ప్రజల‌ను ప్రభుత్వం దోచుకుంటుందని అప్పట్లో ఆయన ఆరోపించారు. అదే కాకుండా ఇతర విషయాల‌పై కూడా ఆయన టిడిపిని ల‌క్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. సోషల్‌మీడియాలో మిగతా విషయాల‌ కన్నా మద్యం విషయంపై ‘క్వార్టర్‌ బాటిల్‌’ విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు, హావభావాలు..ప్రజల‌ను బాగా ఆకట్టుకున్నాయి. ఆయన చేసిన విమర్శలు, ఆరోపణలు నేరుగా మధ్యతరగతి, దిగువతరగతి ప్రజల్లోకివెళ్లి టిడిపి ఫలితాన్ని అనుభవించాల్సి వచ్చింది. నాడు తమ ప్రభుత్వం క్వార్టర్‌కు రూ.80/- లు వసూలు చేస్తే..అది పెద్ద నేరమన్నట్లు ప్రజల‌ను తప్పుదోవ పట్టించిన ‘ఉండవల్లి’ నేడు అదే ‘క్వార్టర్‌’ రూ.230/-కు అమ్ముతుంటే ఆయనేమి చేస్తున్నారని టిడిపికి చెందిన సోషల్ మీడియా ఆయనపై గత కొన్నాళ్లుగా దండెత్తుతోంది. మద్యం రేట్ల విషయంపై ఆయనెందుకు స్పందించరని,ఈ విష‌యంపై ఆయ‌న బ‌య‌ట‌కు వ‌చ్చి ప్ర‌భుత్వాన్ని నిల‌దీయాల‌ని  పదే పదే ప్రశ్నించింది. ‘జగన్‌’ ప్రభుత్వం గతంలో ఉన్న రేట్ల కంటే మూడు రెట్లు అధికంగా ధరలు వసూలు చేస్తుంటే...నాడు క్వార్టర్‌ బాటిల్‌ మద్యం తెచ్చి ప్రెస్‌మీట్‌ పెట్టిన ‘ఉండవల్లి’ నేడు అదే విధంగా ప్రెస్‌మీట్‌లు పెట్టాల‌ని టిడిపి సోషల్‌మీడియా ఆయనపై విరుచుకుపడింది. చంద్ర‌బాబుపై మాత్ర‌మే బుర‌ద పూస్తారా...? స‌్నేహితుని కుమారుడిపై ప‌ల్లెత్తి మాట అన‌వా...?  ధైర్యం లేదా...అంటూ వారు ప‌దే ప‌దే ఎద్దేవా చేయడంతో  చివరకు ఈ రోజు మీడియా ముందుకు ఆయన రావాల్సి వచ్చిందనే మాట వినిపిస్తోంది.

(1033)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ