లేటెస్ట్

అక్రిడిటేషన్లు మరింత జాప్యం...!

నూతన విధివిధానాల‌ కోసం కసరత్తు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పాత్రికేయుల‌కు ఇచ్చే అక్రిడిటేషన్లు మరింత జాప్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఏడాది క్రితం అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం నూతనంగా జర్నలిస్టుల‌కు అక్రిడిటేషన్లు ఇవ్వాల‌ని పలుసార్లు ప్రయత్నించింది. అయితే వివిధ కారణాల‌తో ప్రతిసారీ  వాయిదా పడుతూనే వస్తున్నాయి. తాజాగా...మరోసారి నూతన అక్రిడిటేషన్లు పక్రియ వాయిదా పడినట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లో జూలై మాసంలో నూతన కార్డులు ఇవ్వాల‌ని సమాచారశాఖ కమీషనర్‌ గట్టి పట్టుదల‌తో ఉన్నారు. అయితే ఆయన ఎంత ప్రయత్నించినా..ఇప్పట్లో నూతన అక్రిడిటేషన్లు మంజూరు కావడం సాధ్యం కాదని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న కార్డుల‌నే మరో మూడు మాసాలు పొడిగించాల‌ని తాజాగా నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే కమీషనర్‌ అంత పట్టుదల‌గా ఉన్నా..ఎందుకు నూతన కార్డులు ఇవ్వలేకపోతున్నారనే దానిపై రకరకాల‌ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 

ఈ ఏడాది జనవరిలో నూతన కార్డుల‌ను ఆన్‌లైన్‌ సిస్టసమ్‌ ద్వారా ఇవ్వడానికి రాష్ట్ర సమాచారశాఖ సర్వం సిద్ధం చేసింది. ఆ మేరకు జీవో విడుదల‌ చేసి, రాష్ట్ర స్థాయి అక్రిడిటేషన్‌ కమిటీని కూడా నియమించింది. దీంతో పలువురు జర్నలిస్టులు నూతన కార్డుల‌ కోసం నానా తిప్పలు పడి తమ‌కు తెలియ‌ని ఆన్‌లైన్‌లో విధానంలో తమ ధరఖాస్తుల‌ను సమర్పించారు. ఇక రేపో..మాపో అక్రిడిటేషన్ల పక్రియ ప్రారంభం అవుతుందనుకునే సమయంలో రాష్ట్ర స్థాయి అక్రిడిటేషన్‌ కమిటీని రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఒక్కసారిగా అక్రిడిటేషన్ల ప్రక్రియ ఆగిపోయింది. ఎందుకు ఇంత హఠాత్తుగా ఈ ప్రకియ ఆగిపోయిందనే దానిపై అప్పట్లో పలు వార్తలు వచ్చాయి. రాష్ట్ర స్థాయి కమిటీలో  తెలుగుదేశం పార్టీకి చెందిన సానుభూతిపరులు ఉన్నారన్న మాటల‌తో ప్రభుత్వ పెద్దలు ఈ కమిటీని రద్దు చేశారనే మాట సర్వత్రా వినిపించింది. ఆ తరువాత గత ఆరు నెలలుగా దీనిపై ఎటువంటి పురోగతి కనిపించలేక పోయినా మే నెలో మళ్లీ జర్నలిస్టులు ధరఖాస్తులు చేసుకోవాల‌ని ప్రభుత్వం కోరింది. దీనితో మళ్లీ కొందరు ధరఖాస్తు చేసుకున్నారు. ఇక జూలై మొదటి వారంలో నూతన కార్డులు వస్తాయని భావిస్తున్న తరుణంలో మరోసారి కార్డుల‌ ప్రక్రియ వాయిదా పడినట్లు తెలుస్తోంది. 

తాజాగా ఎందుకు కార్డుల‌ను ఇవ్వకుండా వాయిదా వేశారనే దానిపై రకరకాలైన మాటలు వినిపిస్తున్నాయి. గతంలో రద్దు చేసిన రాష్ట్ర స్థాయి కమిటీని మళ్లీ నూతన సంఘాల‌తో పునరుద్ధరించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. అయితే ఈ కమిటీల్లో ఉన్న జర్నలిస్టు సంఘాల్లో కొన్నింటిని తొల‌గించాల‌ని, ఆయా సంఘాల్లో కొన్నింటిలో నామ మాత్రంగా జర్నలిస్టులు ఉన్నారని, వారి సభ్యత్వాల‌ను చెక్‌ చేయాల‌నే సూచన ప్రభుత్వాన్ని సమర్థించే జర్నలిస్టు సంఘం నుంచి వచ్చింది. దీంతో నూతన కార్డుల‌ ప్రక్రియ జాప్యం అవుతోంది. అదే కాకుండా గతంలో ఏర్పాటు చేసిన రద్దు చేసిన స్టేట్‌ కమిటీపై ఓ జర్నలిస్టు సంఘం కోర్టును ఆశ్రయించడం, మరి కొందరు అదే దారిలో ఉండడంతో నూతన కార్డుల‌ మంజూరుకు అవరోధంగా మారింది. రద్దు చేసిన కమిటీ స్థానంలో నూతన కమిటీల‌ను నియమించడం, గతంలో విడుద చేసిన జీవోకు విరుద్దం. అలా కాదని ఆ జీవోను రద్దు చేసి..మళ్లీ నూతన జీవోను తేవాలంటే ఇప్పటికే అది కోర్టులో ఉండ‌డంతో దానిపై...న్యాయపరమైన చిక్కులు వస్తాయనే ఆందోళన. వెరసి..ప్రస్తుతానికి ఉన్న కార్డుల‌నే మరి కొన్నాళ్లు పొడిగించి..తరువాత మరింత నాణ్యమైన ప్రక్రియతో నూతన విధివిధానాల‌తో అక్రిడిటేషన్లు మంజూరు చేయాల‌నే భావన ప్రభుత్వ పెద్దల్లో ఉందని తెలుస్తోంది. 

గతంలో అక్రిడిటేషన్లు ఇవ్వడానికి అప్పటి ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ ఆధ్వర్యంలో సీనియర్‌ సంపాదకులు, జర్నలిస్టుతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ప్రభుత్వానికి పలు సూచన‌ల‌ను చేసింది. దీనిపై జర్నలిస్టు సంఘాల‌ నుంచి అభ్యంతరాు వ్యక్తం అయ్యాయి. అయితే ఆ అభ్యంతరాల‌ను పట్టించుకోకుండా కమీషనర్‌ అక్రిడిటేషన్‌ పక్రియను ప్రారంభిస్తూ రాష్ట్ర స్థాయి అక్రిడిటేషన్‌ కమిటీని నియమించారు. దీనిపై ప్రభుత్వాన్ని సమర్థించే జర్నలిస్టు సంఘం అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఆ కమిటీని రద్దు చేయాల్సి వచ్చింది. తరువాత పక్రియ అందిరకీ తెలిసిందే. పైన పేర్కొన్న పరిస్థితులు, తాజాగా నెల‌కొన్న ‘కరోనా’ భయాల‌తో మరి కొన్నాళ్లు అక్రిడిటేషన్లను పొడిగిస్తే బాగుంటుందనే సూచనలు రావడంతో మూడు నెల‌లు అక్రిడిటేషన్లను పొడిగించాల‌నే నిర్ణయాన్ని మంత్రి పేర్నినాని   తీసుకున్నాయని సమాచారం. ప్రస్తుతం మూడు నెల‌లు పొడిగిస్తే...ఈ లోపు నూతన విధివిధానాల‌ను తీసుకురావచ్చని, ఈసారి అక్రిడిటేషన్‌ నిబంధనల‌తో పాటు, యాడ్ పాల‌సీ, జర్నలిస్టు హెల్త్‌, జర్నలిస్టు హౌసింగ్ పాల‌సీకి కూడా ఒక రూపు ఇవ్వాల‌ని, తద్వారా అన్ని సమస్యల‌ను నూతన సంవత్సరాంభానికి పరిష్కరించాల‌నే భావన ప్రభుత్వ పెద్దల్లో ఉందంటున్నారు. చూద్దాం..మ‌రి ఏమి జరుగుతుందో..?

(384)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ