లేటెస్ట్

రచ్చ రచ్చ చేస్తోన్న ‘రఘు’...!

నర్సాపురం వైకాపా పార్లమెంట్‌ సభ్యుడు ‘రఘురామకృష్ణంరాజు’ మరో సారి రాష్ట్ర రాజకీయాల్లో కల‌కలం సృష్టించారు.  గత కొన్ని రోజులుగా వైకాపా అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఆయనకు ఆ పార్టీ షోకాజ్‌ నోటీసుల‌ను జారీ చేసింది. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, దీనిపై వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాల‌న్న వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఇచ్చిన నోటీస్‌కు ఆయన ఇచ్చిన రిప్లై ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచల‌నం సృష్టిస్తోంది. తనకు వైఎస్సార్‌ పార్టీ నుంచి షోకాజ్‌ నోటీసు వచ్చిందని, తాను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ సభ్యుడునని, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి వచ్చిన షోకాజ్‌కు చట్టబద్దత లేదని, రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలా ఉంటారని ఆయన ప్రశ్నిస్తున్నారు. అంతే కాకుండా పలు ప్రశ్నల‌ను సంధించారు. అసలు వైకాపా పార్టీలో క్రమశిక్షణ సంఘం ఉందా..? క్రమ శిక్షణ సంఘానికి ఎన్నిక గుర్తింపు ఉందా..? క్రమశిక్షణ సంఘానికి ఛైర్మన్‌, సభ్యులెవరు..? మీటింగ్‌ ఎప్పుడు పెట్టారు..? ఏమి తీర్మానం చేశారో తెలియజేండి. క్రమశిక్షణ సంఘం మినిట్స్‌ నాకు పంపండి. షోకాజ్‌ ఎవరు జారీ చేయాలి..? ప్రొసీజర్ తెలుసా..? అంటూ ‘రఘురామకృష్ణంరాజు’ లేవనెత్తి ప్రశ్నలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

‘రఘురామకృష్ణంరాజు’ లేవనెత్తిన అంశాలు చర్చనీయాంశం అవుతున్నాయి. స్వంత పార్టీలోనూ ఇవి ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రాష్ట్ర స్థాయి పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి ఏమిటంటూ ఆయన వేసిన ప్రశ్నల‌పై వారు సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. అదే విధంగా పార్టీకి క్రమశిక్షణా సంఘం ఉంటుందని, అది ఈ పార్టీలో ఏదంటూ ఆయన వేసిన ప్రశ్న కూడా సమాధానం లేదు. పార్టీ క్రమశిక్షణా సంఘం మినిట్స్‌ పంపాల‌ని, ఏమి తీర్మానం చేయాలో చెప్పాలంటూ చేస్తోన్న ప్రశ్నకు వైకాపా వర్గాలు మౌనాన్ని పాటిస్తున్నాయి. పార్టీ నుంచి వెళ్లిపోవడానికే ఆయన ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని వారు ఎంత చెప్పుకున్నా...ఆయన లేవనెత్తిన మౌళిక ప్రశ్నలు చర్చనీయాంశం అవుతున్నాయి. అసలు వైఎస్సార్‌ పార్టీ అనేది ‘జగన్‌’ పార్టీ కాదని, అది కర్నూలుకు చెందిన ఓ వ్యక్తికి చెందిదంటూ ఆయన చెబుతున్న మాటలు..వైకాపా స్థాపించిన నాటికి విషయాల‌ను గుర్తు చేస్తున్నాయి. యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్‌ అనే పార్టీని ‘శివకుమార్‌’ అనే వ్యక్తి పెట్టుకుంటే దాన్ని ‘జగన్‌’ తీసుకున్నారనే విషయాలు బయటకు వస్తున్నాయి. ‘రఘురామకృష్ణంరాజు’ లేవనెత్తిన అంశాలు పార్టీకి ఇబ్బందికరంగా మారడంతో పాటు, కేంద్రస్థాయిలోనూ పార్టీ పరువు తీసిందనే మాట ఆయా వర్గాల‌ నుంచి వ్యక్తం అవుతోంది. అదే విధంగా పార్టీ క్రమశిక్షణకు సంబంధించి ఒక షోకాజ్‌ నోటీసును సరిగా ఇవ్వలేకపోయారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తం మీద...‘విజయసాయిరెడ్డి, ‘రఘురామకృష్ణంరాజు’ మధ్య పెరిగిన ఆధిపత్యపోరుతో పార్టీలో రచ్చ రచ్చ రేగుతోందనే అభిప్రాయం సామాన్య కార్యకర్తల‌ నుంచి వ్యక్తం అవుతోంది. 

(333)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ