లేటెస్ట్

‘రఘు’ను హీరోను చేసిన వైకాపా...!

‘రఘురామకృష్ణంరాజు’ ఒక సాధారణ పార్లమెంట్‌ సభ్యుడు. తొలిసారి చట్టసభల్లో అడిగిన వ్యాపారవేత్త...! మహా అయితే కాంగ్రెస్‌కు చెందిన సీనియర్‌ నాయకుడు ‘కెవిపి రామచంద్రరరావు’కు వియ్యంకుడిగానే  చాలా మందికి తెలుసు. వ్యాపారవేత్తగా, కోడి పందాలు అంటే చెవి కోసుకునే వ్యక్తిగా గోదావరి జిల్లాల‌ ప్రజల‌కు తెలిసి ఉంటుంది. అదే సమయంలో బ్యాంకుల‌కు అప్పు ఎగగొట్టారనే ఆరోపణతో కొంత మంది వ్యాపారవేత్తల‌కు తెలుసు. ఆంధ్రాలో ఆయన గురించి ఇప్పటి దాకా తెలిసింది..ఇదే..! కానీ ఆయ‌న పేరు ఇప్పుడు రాష్ట్రంలో మారుమ్రోగిపోతోంది. ఏడాది క్రితం దాకా..టిడిపిలో ఉన్న ఆయన ఎన్నికల‌ సమయంలో వైకాపాలో చేరి నర్సాపురం ఎంపీగా గెలుపొందారు. ఎంపీగా గెలిచిన దగ్గర నుంచి ఆయన గురించి రెండు, మూడు సార్లు రాష్ట్ర మీడియాలో, ఒకసారి జాతీయ మీడియాలో మాత్రం కథనాలు వచ్చాయి. జాతీయ స్థాయిలో దాదాపు 350 మంది ఎంపీల‌కు విందు ఇచ్చి..రాజకీయనాయల‌కు, దేశ ప్రజల‌ దృష్టిలో నిలిచారు. ఆ తరువాత..ఆయన గురించి పెద్దగా వార్తలేమీ లేవు. కానీ...గత పక్షం రోజుల‌ నుంచి..తెలుగు రాష్ట్రాల‌తో పాటు, కేంద్ర రాజకీయాల్లోనూ ఆయన పేరు మారుమ్రోగిపోతోంది. 

తొలుత ఇంగ్లీషు మీడియం విషయంలో పార్లమెంట్‌లో అధికార పార్టీ వైఖరికి భిన్నంగా ‘రఘు’ మాట్లాడడంతో ఆయన వార్తల్లోకి వచ్చారు. ఆ తరువాత..‘తిరుమల‌ తిరుపతి దేవస్థానం’ భూముల‌ అమ్మకాల‌పై బహిరంగంగా ధ్వజమెత్తడం, తన నియోజకవర్గ పరిధిలోని అధికార పార్టీ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్ప‌డుతున్నారని, వీరిని కట్టడి చేయాల‌ని, ముఖ్యమంత్రి తనకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదని చెబుతూ ఆయన మీడియా దృష్టిని ఆకర్షించారు. ఆయన వ్యాఖ్యల‌పై అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు స్పందించడంతో రోజువారి రచ్చ మొదలైంది. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీల బల‌గంతో తిరుగులేని అధికారాన్ని చెలాయిస్తున్న ‘జగన్‌’కు వ్యతిరేకంగా ఒక ఎంపీ మాట్లాడుతుండడంతో ఆయన ఏమి చెబుతారనే దానిపై తెలుగు ప్రజల‌ దృష్టి పడిరది. వారి అంచనాల‌ను నిజం చేస్తూ...‘రఘురామరాజు’ ఇష్టారీతిలో చెల‌రేగిపోయారు. తన నియోజకవర్గంలో తాను ‘జగన్‌’ బొమ్మతో గెల‌వలేదని పేర్కొనడం, దానికి వైకాపా ఎమ్మెల్యేలు దమ్ముంటే రాజీనామా చేయాల‌ని సవాల్‌ చేయడంతో..ఇరువైపు నుంచి సవాళ్లు, ప్రతిసవాళ్లు మొదల‌య్యాయి. ఈ లోపు..పార్టీ వ్యతిరేక కార్యక్రమాల‌కు పాల్ప‌డుతున్నారని పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్‌ చేయకూడదని వైకాపా ఎంపి విజయసాయిరెడ్డి షోకాజ్‌ నోటీసు ఇవ్వడంతో వ్యవహారం ముదిరి పాకానపడిరది. 

తాను వైకాపా అధినేత ‘జగన్‌’కు వ్యతిరేకం కాదని, ప్రభుత్వంలో జరుగుతున్న తప్పుల‌ను ఎత్తి చూపుతున్నానని, అందుకే సస్పెండ్‌ చేస్తారా..? అంటూ ‘రఘు’ ప్రతి స్పందనతో పాటు, వైకాపా పార్టీ ‘జగన్‌’ది కాదని, ఆయన పార్టీ యువజన,శ్రామిక,రైతు కాంగ్రెస్‌ పార్టీ ఆ పార్టీ నుంచి నోటీసులు ఇవ్వాల‌ని అలా ఇస్తేనే తాను స్పందిస్తానని కొత్త రగడకు ఆయన శ్రీకారం చుట్టడంతో..ఇప్పుడు వైకాపా నేతలు తల‌లు పట్టుకుంటున్నారు. అసలు ప్రభుత్వంపై మొదటల్లో ఆయన వ్యాఖ్యలు చేసినప్పుడే...ఆయనను సస్పెండ్‌ చేస్తే సరిపోయేదని, ఇప్పటి దాకా..కొనసాగించి..ఆయనకు ప్రయారిటీ ఇచ్చి హీరోను చేశారనే మాట వైకాపా వర్గాల‌ నుంచి వ్యక్తం అవుతోంది. ఇంగ్లీషు భాషకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడైనా, లేక తిరుమల‌ తిరుపతి దేవస్థానం భూముల‌ విషయంలో మాట్లాడినప్పుడైనా..సస్పెండ్ చేసి..వదిలేస్తే పోయేదని, ఇప్పుడు  ఆయన పార్టీ మూల‌ విషయాల‌కే ముప్పు పెట్టారనే మాట ఆ పార్టీ వర్గాల‌ నుంచి వ్యక్తం అవుతోంది. కేంద్ర ఎన్నికల‌ సంఘాన్ని కల‌సి ఆయన పార్టీ గుర్తింపును రద్దు చేయించడమో, లేక..వైకాపా పార్టీ అని పిల‌వకుండా యువజన, శ్రామిక,రైతు కాంగ్రెస్‌ పార్టీ అని పిల‌వాల‌నే నిబంధనను పెట్టించే పరిస్థితుల్లో ఉన్నారని, ఆయనపై తొలుతే కఠినంగా వ్యవహరించి ఉంటే ఇటువంటి పరిస్థితి ఉత్పన్నం అయ్యే కాదని, ఆయనను ఇప్పటి దాకా ఉపేక్షించి తామే ‘హీరో’ను చేశామనే మాట వైకాపా వర్గాల‌ నుంచి వ్యక్తం అవుతోంది. బిజెపి పెద్దల‌కు సన్నిహితుడనే భావనతో ఆయనపై చర్యలు తీసుకోకపోవడంతో..ఇప్పుడు ఆయన చేస్తోన్న రగడ పార్టీకి తల‌వంపులు తెస్తుందని, పార్టీని ఢిల్లీ స్థాయిలో చుల‌కన చేస్తున్నారని కూడా వారు అంటున్నారు. మొత్తం మీద..తొలుతే ఆయనపై వేటు వేసి వదిలేస్తే...ఆయన మానాన ఆయన వెళ్లే వారని, ఇప్పటి దాకా ఉంచడంతో..పార్టీకి తీరని నష్టం చేస్తున్నారని, ఇప్పటికైనా..ఆయనపై చర్యులు తీసుకోవాల‌ని పార్టీ సామాన్య నేతలు చెబుతున్నారు.

(253)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ