లేటెస్ట్

‘డొక్కా’కు మంత్రివర్గంలో స్థానం...!?

గుంటూరు జిల్లా వైకాపా రాజకీయాల్లో పెను సంచల‌నం నమోదు కాబోతోందా..? అంటే కొందరు అవుననే అంటున్నారు. నిన్న మొన్నటి దాకా..టిడిపి నాయకుడిగా ఉండి...ఇటీవలే వైకాపాలో చేరి..నిన్న ఎమ్మెల్సీగా గెలిచిన సీనియర్‌ నేత ‘డొక్కా మాణిక్యవరప్రసాద్‌’కు మంత్రి పదవి ల‌భించబోతోందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఎస్సీ వర్గాల్లో సీనియర్‌ నేతగా, మంత్రిగా పనిచేసిన ‘డొక్కా’ను ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి తన మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారని, త్వ‌ర‌లో జ‌రిగే మంత్రి విస్త‌ర‌ణ‌లో ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇస్తార‌ని, ఆయన సన్నిహిత వర్గాలతో పాటు, ఇతర వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా ఎస్సీ వర్గాల్లో ఈ ప్రచారం జోరుగా సాగుతోంది. గతంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా పనిచేసిన ‘డొక్కా’ అనుభవం తనకు పనికి వస్తుందన్న ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి ఉన్నారని, దీంతో మంత్రి వర్గ విస్తరణలో ఆయనకు మంత్రిగా అవకాశాలు కల్పిస్తారని కొందరు చెబుతున్నారు. రాజ‌కీయంగా కూడా ఇది క‌ల‌సి వ‌స్తుంద‌నే అంచ‌నాల‌తో మాదిగ వర్గానికి చెందిన సీనియర్‌ నేత ఆయన ‘డొక్కా’కు మంత్రివర్గంలో స్థానం కల్పించ‌బోతున్నార‌ని..దీంతో ‘మాదిగ’ల‌ను పూర్తిగా ఆకట్టుకోవచ్చనే ఆలోచన ముఖ్యమంత్రిలో ఉందంటున్నారు. 

ఇప్పటికే ఎస్సీల్లో ప్రధానమైన ‘మాల‌’ వర్గానికి పూర్తిస్థాయిలో ప్రాధాన్యత ఇచ్చారని, ఇప్పుడు ‘మాదిగల‌’ను కూడా తన వైపుకు తిప్పుకుంటే ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ, బీసీ వర్గాల్లో తిరుగులేని శక్తిగా ఎదగవచ్చన్న ఆలోచన ముఖ్యమంత్రిలో ఉందంటున్నారు. వాస్తవానికి అనాది నుంచి ‘మాదిగ’ వర్గాలు ‘టిడిపి’వైపే ఉన్నాయి. ‘మాల‌లు’ కాంగ్రెస్‌ వైపు ఉంటే ‘మాదిగ’లు టిడిపి వైపు ఉంటూ వచ్చారు. అయితే గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఈ రెండు వర్గాలు కూడా ‘వైకాపా’ వైపే నిలిచాయి. దీంతో ‘మాదిగ’ ఓటు బ్యాంక్‌ చెక్కుచెదరకుండా త‌న వైపు  ఉండాలంటే వారికి మరింత ప్రాధాన్యత ఇవ్వాల‌నే ఉద్దేశ్యంతో మాదిగ వర్గానికి చెందిన సీనియర్‌ నేత ‘డొక్కా’కు మంత్రి పదవిని ముఖ్యమంత్రి ఇవ్వబోతున్నారనే మాట వినిపిస్తోంది. అయితే నిన్నటి దాకా..టిడిపిలో ఉండి..హఠాత్తుగా వైకాపాలో చేరిన ‘డొక్కా’కు మంత్రి పదవి ఎలా ఇస్తారని మరి కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటే ఇక ‘డొక్కా’కు హద్దేముందని మ‌రి కొంద‌రు చెబుతున్నారు. వాస్తవానికి ‘డొక్కా’ ఏ పార్టీలో ఉన్నా...ఆయనను పదవులు వెతుక్కుంటూ వస్తున్నాయి. కాంగ్రెస్‌ హయాంలో మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచినా..ఆయనకు మంత్రి పదవి వచ్చింది. ఆ తరువాత...టిడిపిలోకి రావడంతోనే ఆయనకు ఎమ్మెల్సీ పదవితో పాటు, విప్‌, పార్టీ పదవులు దక్కాయి. ఇటీవలే ఎమ్మెల్సీకీ రాజీనామా చేసినా..వైకాపా వెంటనే మళ్లీ ఆయనకే ఎమ్మెల్సీ ఇచ్చి ఏకగ్రీవంగా గెలిపించుకుంది. ఇప్పుడు మంత్రి పదవి కూడా ఇస్తే..రాజకీయాల్లో ‘డొక్కా’ అంత అదృష్టవంతుడు ఎవరూ ఉండరని పలువురు ఎస్సీ నాయకులు చెప్పుకుంటున్నారు. అదృష్టమంటే ‘డొక్కా’దే మరి.

(674)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ