లేటెస్ట్

కాపుల‌కు ‘మరాఠా’ తరహా రిజర్వేషన్లు...!

రాష్ట్రంలో మళ్లీ కాపు రిజర్వేషన్ల అంశం తెరపైకి వచ్చింది. జనసేన అధినేత ‘పవన్‌కళ్యాణ్‌’ వైకాపా ప్రభుత్వం కాపుల‌కు అన్యాయం చేస్తోందని, వారిపై కపటప్రేమ చూపిస్తోందని, అందరికీ ఇచ్చినట్లే ‘కాపుల‌కు’ నిధులు ఇచ్చి వారికి ప్రత్యేకంగా నిధులు ఇచ్చామని చెబుతున్నారని దీనిపై శ్వేతపత్రం విడుదల‌ చేయాల‌ని డిమాండ్‌ చేయడంతో మరోసారి ‘కాపు’ రిజర్వేషన్ల అంశం చర్చనీయాంశం అయింది. గత టిడిపి ప్రభుత్వం హయాంలో కాపుల‌కు 5శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. దానిపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే గత ఏడాది ఎన్నికల‌ సందర్భంగా నిర్వహించిన ఎన్నిక ర్యాలీల్లో వైకాపా అధినేత ప్రసంగిస్తూ...తాను ‘చంద్రబాబు’ వలే ఉత్తుత్తి హామీల‌ను ఇవ్వలేనని, కాపుల‌కు రిజర్వేషన్లు ఇవ్వలేనని చెప్పారు. తరువాత...దానిని సవరించుకుని..తనకు సాధ్యమైతే చేస్తానని, అయితే ‘చంద్రబాబు’ కన్నా ఎక్కువ నిధులు ఇస్తానని హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత..ఆయన గత ప్రభుత్వం కంటే తక్కువ నిధులు ఇచ్చారని ‘పవన్‌కళ్యాణ్‌’ విమర్శలు గుప్పించారు. దీనికి వైకాపా మంత్రులు నుంచి ధీటైన సమాధానం వచ్చింది. 

‘జనసేన-బిజెపి’ అధికారంలోకి వస్తే..16శాతం రిజర్వేషన్లు...!

కాగా...‘జనసేన-బిజెపి’ కూటమి వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో విజయం సాధిస్తే...మహారాష్ట్రలో ‘మరాఠా’ల‌కు ఇచ్చినట్లు 16శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఆ పార్టీకి చెందిన నేతలు చెబుతున్నారు. టిడిపి, వైకాపా పార్టీలు రెండూ రిజర్వేషన్ల విషయంలో ‘కాపుల‌’ను మోసం చేశాయని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే దీనిపై దృష్టిపెడతామని, వచ్చే ఎన్నికల‌కు ఇదే తమ మొదటి హామీ అని ప్రకటిస్తున్నారు. మహారాష్ట్రలో బిజెపి అధికారంలో ఉన్నప్పుడు ‘మరాఠా’ల‌కు రిజర్వేషన్లు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారని, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 162ను ఉపయోగించి బిజెపి ప్రభుత్వం దీనిని అమలు చేసిందని, దీనిపై కొందరు హైకోర్టుకు వెళ్లగా, హైకోర్టు దీనిని అంగీకరించిందని, అయితే 16శాతాన్ని 12శాతానికి తగ్గించిందని, మరాఠాల‌ వలే ఆంధ్రాలో ‘కాపుల‌కు’ 16శాతం రిజర్వేషన్లు సాధిస్తామని వారు చెబుతున్నారు. మొత్తం మీద..ఎన్నికల‌కు నాలుగేళ్ల సమయం ఉన్నా..అప్పుడు తమ ఎన్నికల‌ నినాదాల‌కు ‘జనసేన-బిజెపి’ కూటమి పదును పెట్టడం విశేషం.

(204)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ