లేటెస్ట్

‘ఆంధ్రా’లో మళ్లీ ‘పీకే’ కల‌కలం..!

గత సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా ఘన విజయానికి కారకుడిగా పేర్కొన్న ‘ప్రశాంత్‌ కిశోర్‌’ పేరు మరోసారి ‘ఆంధ్రా’లో మారుమ్రోగిపోతోంది. సార్వత్రిక ఎన్నికల‌ సందర్భంగా వైకాపాలో అన్నీ తానై వ్యవహరించి ఆ పార్టీకి ఘనవిజయాన్ని సాధించి పెట్టిన ‘ప్రశాంత్‌ కిశోర్‌’ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ కార్యక్రమాల‌ను పర్యవేక్షించబోతోందని వార్తలు  వస్తున్నాయి. సంక్షేమ పథకాల అమలు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా వాలంటీర్‌ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ప్రతి 50 కుటుంబాల‌కు ఒక వాలంటీర్‌ చొప్పున దాదాపు 4ల‌క్ష మంది వాలంటీర్లును ప్రభుత్వం ఇప్పటికే నియమించింది. వారి ద్వారా వివిధ సంక్షేమ పథకాల‌ను ల‌బ్దిదారుల‌కు అందిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ వాలంటీర్లకు మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం కొత్తగా ఫీల్డ్‌ ఆర్గనైజింగ్‌ ఏజెన్సీనీ ఏర్పాటు చేసింది. ఈ ప్రభుత్వ ఏజెన్సీకి ‘పీకే’ టీమ్‌లోని ‘దినేశ్‌మోరే’ అనే వ్యక్తిని పర్యవేక్షకుడిగా నియమించారు. ఆయన వాలంటీర్లకు శిక్షణతో పాటు, పర్యవేక్షణ చేస్తారని ప్రచారం జరుగుతోంది. 

పంచాయితీరాజ్‌, మున్సిపల్‌ శాఖ పరిధిలో పనిచేయాల్సిన గ్రామ, వార్డు వంటీర్లపై ప్రైవేట్‌ పెత్తనం ఏమిటని ప్రతిపక్షాలు దండెత్తుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో ల‌బ్ది కోసమే ‘పీకే’ టీమ్‌ ఈ విధంగా వ్యవహరిస్తుందని, ప్రజల‌పై నిఘా పెట్టడం ద్వారా, వారి కదిలికల‌ను పర్యవేక్షించడం తదితరాల వ‌ల్ల వైకాపా పార్టీ భారీగా ల‌బ్దిపొందబోతోందని, ఇదంతా వచ్చే ఎన్నికల్లో గెల‌వడానికే చేస్తున్నారని దుయ్యబడుతోంది. ‘పీకేటీమ్‌’ ద్వారా ఎంఎల్‌ఓను నియమించబోతున్నారని, వీరు గ్రామ,వార్డు వాలంటీర్ల పనిని పర్యవేక్షిస్తారని దీనితో ప్రభుత్వ వ్యవస్థ మొత్తం ప్రైవేట్‌ వ్యక్తుల‌ చేతుల్లోకి పోతుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కాగా ఈ వ్యవహారంపై తమకేమీ సంబంధం లేదని ‘పీకే’ టీమ్‌ ఖండను విడుదల‌ చేసింది. తమతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎటువంటి ఒప్పందం చేసుకోలేదని, ఒక పత్రికలో వచ్చిన వార్త నిరాధారమని పేర్కొంది. కాగా..సార్వత్రిక ఎన్నికల్లో వైకాపాకు ఘన విజయాన్ని అందించిన ‘పీకే’ మళ్లీ రాబోయే ఎన్నికల్లో మరోసారి ‘జగన్‌’కు అధికారాన్ని అప్పగించేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తుండడం రాజకీయవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

(317)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ