లేటెస్ట్

అనూహ్యంగా హత్య కేసులో ఇరుకున్న ‘కొల్లు రవీంద్ర’..!

వైకాపా నేత మోకా భాస్కర్‌రావు హత్య కేసులో మాజీ మంత్రి ‘కొల్లు రవీంద్ర’ను అరెస్టు చేయడం రాజకీయ వర్గాల్లో సంచల‌నం సృష్టిస్తోంది. వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత పలువురు టిడిపి నేతల‌పై రకరకాల‌ కేసులు పెట్టి జైలుకు పంపించిందని, కానీ ఓ హత్య కేసుకు సంబంధించి మాజీ మంత్రి హస్తం ఉందని పేర్కొంటూ తొలిసారిగా ఓ సీనియర్‌ నేతను అరెస్టు చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. వైకాపా నేత ‘భాస్కర్‌రావు’ను హత్య చేయించింది ‘రవీంద్రే’నని రాజకీయంగా అడ్డువస్తున్నారనే కారణంతోనే ఆయనను మాజీమంత్రి అంతమొందించారని, దీనికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పోలీసు చెబుతున్నారు. వైకాపా నేత హత్య వెనుక ‘కొల్లు’ లేకపోతే ఇంట్లోంచి ఆయన నిచ్చెన వేసుకుని దూకి ఎందుకు పారిపోయారని వారు ప్రశ్నిస్తున్నారు. మచిలీపట్నం నుంచి వైజాగ్‌ ఎందుకు వెళుతున్నారని, హత్యకు ఆయనకు సంబంధం లేకపోతే ఆయనకు అంత భయం ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు. తమ వద్ద ఆధారాలు ఉన్నాయని అందుకే అరెస్టు చేశామని వారు చెబుతుండగా...టిడిపి మాత్రం ఇది రాజకీయంగా వేధించడానికేన‌ని  ఆరోపిన్తోంది. టిడిపి అధినేత చంద్రబాబు ఇప్పటికే దీనిపై స్పందించారు. బీసీల‌ను వైకాపా ప్రభుత్వం అణిచివేస్తోందని, అచ్చెంనాయుడు, అయ్యన్నపాత్రుడు, యనమల‌ రామకృష్ణుడు, చినరాజప్ప వంటి మాజీ మంత్రుల‌పై ఇప్పటికే కేసులు నమోదు చేయించి వేధిస్తోందని, తాజాగా ‘కొల్లు రవీంద్ర’ను కూడా అరెస్టు చేసి వేధింపుల‌కు గురి చేస్తోందని ఆయన ఆరోపించారు. కాగా..తమ తండ్రిని ‘భాస్కర్‌రావు’ను హత్య చేసినందుకే తాము ఆయనను హత్య చేశామని నిందితులు చెబుతున్నారు. ‘రవీంద్ర’ అండగా ఉంటానని చెప్పారని, ఆయన అభయంతోనే హత్యకు పూనుకున్నామని  పోలీసుల‌కు చెప్పారని అంటున్నారు. కాగా..ఎంతో సౌమ్యంగా, ప్రశాంతంగా ఉండే ‘కొల్లు రవీంద్ర’ హత్య చేయించారనే మాటల‌ను ఆయన అభిమానులు, ఆయన గురించి తెలిసిన వారు అంగీకరించలేకపోతున్నారు. ఐదేళ్లు మంత్రిగా ఉన్నప్పుడే ఆయన ఎవరితో ఘర్షణకు కానీ, వర్గ రాజకీయాల‌కు కానీ చేయలేదని, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండీ, అదీ వైకాపా ప్రభుత్వం టార్గెట్‌ చేసుకుని వేధిస్తున్నప్పుడు ఇటువంటి పనులు చేస్తారా..అనే అనుమానాల‌ను వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ‘కొల్లు’ అనూహ్యంగా హత్య కేసులో ఇరుక్కుని జైలుకెళ్లడం టిడిపి అభిమానుల‌ను ఆందోళనకు గురిచేస్తోంది.

(353)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ