లేటెస్ట్

అవ్వా తాతల‌కు ‘జగన్‌’ రూ.17,500/- బాకీ...!

వైకాపా రెబల్‌ ఎంపీ ‘రఘురామకృష్ణంరాజు’ తన స్వరాన్ని పెంచుతున్నారు. నిన్నటి దాకా నాకూ..మా ముఖ్యమంత్రికి మధ్య ఏమీ లేదని, ఆయన తన నాయకుడని, వైకాపా ద్వితీయ శ్రేణి నాయకుల‌తోనే తనకు గొడవ అని..త్వరలోనే అందరం కలిసిపోతామని చెబుతూ వస్తోన్న ఆయన..ఇప్పుడు వైకాపా ప్రభుత్వ లోపాల‌ను బయటకు తీసి ప్రశ్నిస్తున్నారు. నిన్నటికి నిన్న రాజధానిగా ‘అమరావతే’ ఉండాల‌ని డిమాండ్‌ చేసిన ఆయన ఇప్పుడు మరో ఆసక్తికరమైన అంశాన్ని బయటకు తెచ్చారు. వైకాపా ప్రభుత్వం ఇచ్చిన హామీల‌పై ఆయన ప్రశ్నలు వేస్తూ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ఓ లేఖ రాశారు. ‘జగన్‌’ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వృద్ధుల‌ వయోపరిమితిని 65ఏళ్ల నుంచి 60కి తగ్గిస్తూ ఉత్తర్వులు ఇచ్చారని, 2019 జూలై నెల‌ నుంచి ఇది అమలులోకి వస్తుందని ఆ జీవోలో పేర్కొన్నారని కానీ ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి నుంచి దాన్ని అమ‌లు చేస్తూన్నార‌ని, దీని వ‌ల్ల వృధ్దులు ప్రతి ఒక్కరూ రూ.15,750/- లు నష్టపోయారని, అవ్వా తాతల‌కు ‘జగన్‌’ రూ.15,750/- లు బాకీ పడ్డారని, వారికి వెంటనే ఆ సొమ్మును మొత్తం ఇవ్వాల‌ని ఆయన డిమాండ్‌ చేశారు. అదే విధంగా ప్రతి ఏడాది పెంచుతామన్న పెన్షన్‌ రూ.250/- ఇంతవరకు పెంచలేదని, వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి జయంతి రోజు నుంచి అయినా పెంచిన పెన్షన్‌ కానుకను అమలు చేయాల‌ని ఆయన ప్రభుత్వానికి సూచించారు. కాగా ఎంపీ రఘురామకృష్ణంరాజు లేవనెత్తిన అంశాల‌పై వైకాపా ఎలా స్పందిస్తుందో చూడాలి. 

గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగభృతిని ప్రకటించి ఇవ్వలేదని, అప్పట్లో నిరుద్యోగుల‌కు ‘చంద్రబాబు’ బాకీ పడ్డారని, కాల‌ర్‌పట్టుకుని వాటిని నిరుద్యోగులు వసూలు చేసుకోవాల‌ని, నిరుద్యోగుల‌నుమోసగించిన ‘చంద్రబాబు’కు అధికారంలో కొనసాగే అర్హతలేదని నాడు ‘జగన్‌’ దుయ్యబట్టారు. నాడు ‘చంద్రబాబు’ నిరుద్యోగుల‌ను మోసం చేస్తే..నేడు ‘జగన్‌’ వృద్ధుల‌ను మోసం చేశారని ‘రఘురామకృష్ణంరాజు’ గుర్తు చేస్తున్నారు. మొత్తం మీద..కీల‌కమైన ఈ విషయాల‌ను ప్రతిపక్షపార్టీలేవీ ఇంత వరకు ప్రస్తావించలేదు కానీ..‘రఘు’ మాత్రం బయటకు తేవడం విశేషం. వైకాపా అమలు చేస్తోన్న పథకాలు లోపభూష్టమైనవని చెప్పడానికి, ఇచ్చిన హామీలు, ప్రస్తుతం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాల‌కు వ్యత్యాసం ఉందనే విషయాన్ని ‘రాజుగారు’ భలే చెప్పారని ఆయనకు మద్దతు ఇచ్చేవారు ప్రస్తావిస్తున్నారు. మొత్తం మీద..స్వంత పార్టీ ఎంపీనే సంక్షేమ పథకాల‌పై లేఖలు రాయడం ఆసక్తిరకమే. 

(399)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ