‘కరోనా’కు కళ్లెం వేసే ‘అమెరికా’ టీకా రెడీ..!

ప్రపంచాన్ని అతలాకుతం చేస్తోన్న ‘కరోనా’ మహమ్మారికి కళ్లెం వేసే టీకా రెడీ అయిందని అమెరికాకు చెందిన మోడెర్నా కంపెనీ ప్రకటించింది. ప్రయోగ దశలో ఉన్న తమ టీకా క్లినికల్ ట్రయల్స్‌లో ఆశాజనక ఫలితాలినిచ్చినట్లు ఆ సంస్థ మంగళవారం నాడు తెలిపింది. తొలి దశలో 45మంది ఆరోగ్యవంతులైన వాలంటీర్లకు ఈ వ్యాక్సిన్‌ను ఇచ్చినట్లు, కరోనాపై పోరాడే రోగనిరోధకశక్తి వీరిలో ఏర్పడినట్లు తాము గుర్తించామని కంపెనీ వెల్లడించింది. తాము రూపొందించిన ఈ టీకా సురక్షితమైనదని కూడా నిర్థారణ అయినట్లు తెలిపింది. ‘మోడెర్నా’ కంపెనీ పరిశోధన ఫలితాన్ని ‘న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్’లో ప్రచురించారు. రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో కరోనా వైరస్‌ను అంతం చేయగలిగే ప్రతిరక్షాలు భారీ స్థాయిలో విడుదల అయినట్లు మోడెర్నా తెలిపింది. కోవిడ్-19 నుంచి కోలుకున్న వారిలో కంటే ఎక్కువ ప్రతిరక్షకాలు వీరిలో ఏర్పడినట్లు తెలిపింది. ఎవరిలోనూ తీవ్రమైన దుష్పరిమాణాలు కానరాలేదని, అయితే కొందరిలో వికారం, కండరాల నొప్పులు, తలనొప్పి, చలి, టీకా ఇచ్చిన చోట నొప్పి వంటి లక్షణాలు కనిపించినట్లు కంపెనీ పేర్కొంది. ఎక్కువ మోతాదులో డోసు ఇచ్చినవారిలోనే ఈ లక్షణాలు బయటపడినట్లు వివరించింది. ఈ టీకాను అమెరికా నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్, మోడెర్నా కంపెనీ సంయుక్తంగా అభివృద్ధి చేశారు.