లేటెస్ట్

‘కన్నా’ మమ్మాటికి ‘చంద్రబాబు’ కోవర్టే:విజయసాయిరెడ్డి

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ‘కన్నా ల‌క్ష్మీనారాయణ’పై వైకాపా సీనియర్‌ నేత ‘విజయసాయిరెడ్డి’ మరోసారి ధ్వజమెత్తారు. బిజెపి పార్టీ విధానాల‌కు వ్యతిరేకంగా ఆయన రాజధాని మార్పుపై గవర్నర్‌కు లేఖ రాశారని, పార్టీ విధానాల‌ను కూడా ‘చంద్రబాబు’కు తాకట్టుపెట్టారని, తాను మొదటి నుంచి చెబుతున్నట్లు ‘కన్నా’ మమ్మాటికి ‘చంద్రబాబు’ కోవర్టే అని ఆయన ట్విట్టర్‌లో ధ్వజమెత్తారు. సొంత పార్టీ అభిప్రాయానికి వ్యతిరేకంగా ‘చంద్రబాబు’కు అనుకూలంగా రాజధాని బిల్లులు ఆమోదించవద్దని గవర్నర్‌కులేఖ రాశారని దీనిపై పార్టీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసిందని, ‘కన్నా’ ఇంకెన్నాళ్లు ముసుగు వేసుకుని ‘చంద్రబాబు’కు అనుకూలంగా వ్యవహరిస్తారని ఆయన ప్రశ్నించారు. ‘చంద్రబాబు’తో భౌతిక దూరం పాటించాల‌ని రాష్ట్ర బిజెపికి జాతీయ నాయకత్వం హెచ్చరించినా టిడిపి లైన్‌లోనే లేఖలు రాస్తున్నారని, కరోనా టైంలోనైనా సోషల్‌ డిస్టెన్స్‌ పాటించకపోతే ఎలా ‘కన్నా’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. బిజెపి స్టేట్‌ ఇంచార్జి కూడా రాజధానులు రాష్ట్ర ప్రభుత్వ ఇష్టం అన్నారు కన్నా...ఓహో ఇదంతా నీ పచ్చ స్వామి భక్తినా..? అంటూ ‘విజయసాయిరెడ్డి’ ‘కన్నా’ను ఎద్దేవా చేశారు. మూడు రాజధానుల బిల్లు గవర్నర్‌ చెంతకు చేరిన సమయంలో వైకాపా ఎంపి చేస్తోన్న ట్వీట్‌లు రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. 

బిజెపి జాతీయ నాయకత్వం మూడు రాజధానుల‌కు అనుకూంగా ఉందన్నట్లు, ఇక రాజధాని బిల్లులు వెంటనే అమలులోకి వస్తాయని పరోక్షంగా ఆయన చెబుతున్నారు. మరో వైపు గతంలో వలే ‘కన్నా ల‌క్ష్మీనారాయణ’ ‘చంద్రబాబు’ మనిషి అని మరోసారి చాటిచెప్పారు. రూ.20కోట్లు తీసుకుని ‘కన్నా’ ‘చంద్రబాబు’కు అనుకూలంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. అప్పట్లో ఈ వ్యాఖ్యల‌పై బిజెపి భగ్గుమంది. ‘విజయసాయిరెడ్డి’కి దమ్ముంటే ‘కాణిపాకం వినాయకస్వామి’ ఆల‌యంలో ప్రమాణం చేయాల‌ని ‘కన్నా’ సవాల్‌ చేశారు. దీనికి ‘విజయసాయిరెడ్డి’ ప్రతిస్పందించారు. అయితే తరువాత కాలంలో ఇద్దరూ ఈ సవాళ్లను మరిచిపోయారు. కాగా..ఇప్పుడు మరోసారి ‘కన్నా’ను ‘విజయసాయిరెడ్డి’ టార్గెట్‌ చేయడంతో బిజెపి రాష్ట్ర నాయకత్వం ఇరుకునపడినట్లైంది. దీనిపై బిజెపి నాయకత్వం ఇంకా స్పందించలేదు. ఈ రోజు పలువురు బిజెపి నాయకులు ప్రెస్‌మీట్‌ పెట్టినా...‘కన్నా’కు అండగా ఎవరూ మాట్లడలేదు. మొత్తం మీద..బిజెపి జాతీయ నాయకత్వం తమ చేతిలో ఉందని, రాష్ట్ర నాయకుల‌ను పట్టించుకోనవసరం లేదన్న వైకాపా నాయకుల‌ మాటే నిజం అవుతున్నట్లు కనిపిస్తోంది.

(239)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ