లేటెస్ట్

‘వంశీ’ వర్సెస్‌ ‘శివ భరత్‌రెడ్డి’...!

కృష్ణా జిల్లా గన్నవరం రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. టిడిపికి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో అధికారపార్టీ నేతల‌ మధ్య నెల‌కొన్న విభేదాలు చర్చనీయాంశం అయ్యాయి. గత ఎన్నికల్లో టిడిపి తరుపున పోటీ చేసి స్వల్ప‌ మెజార్టీతో గెలిచిన ‘వ‌ల్ల‌భనేని వంశీమోహన్‌’ వైకాపాకు మద్దతు ల‌తెపడం, టిడిపి అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నాయకుల‌పై ఒంటికాలిపై విమర్శులు చేయడం గత కొన్నాళ్లుగా...రాష్ట్ర స్థాయిలో చర్చకు దారి తీసింది. టిడిపిని వీడి వైకాపాలో చేరిన ‘వంశీ’కి ప్రస్తుతం అక్కడి పరిస్థితులు ఆందోళన కల్గిస్తున్నాయి. ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి చేస్తోన్న అభివృద్ది కార్యక్రమాల‌కు తాను మద్దతు ప్రకటిస్తున్నానని చెప్పిన ‘వంశీ’కి నియోజకవర్గంలోని  వైకాపా నాయకుల‌ నుంచి ప్రతిబంధకాలు ఏర్పడుతున్నాయి. ముందుగా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ‘యార్లగడ్డ వెంకట్రావు’ నుంచి ఎదురవుతున్న అసంతృప్తిని ఏదో విధంగా చల్లార్చుకున్న ‘వంశీ’ మరో నాయకుడు ‘దుట్టా రామచంద్రరావు’ నుంచి తీవ్రమైన ఇరకాటాన్ని ఎదుర్కొంటున్నారు. 2014 ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ‘దుట్టా రామచంద్రరావు’ గత ఎన్నికల్లో తాను పోటీ చేయలేనని పక్కకు తప్పుకున్నారు. దీంతో విదేశాల్లో ఉంటున్న ‘యార్లగడ్డ’కు వైకాపా టిక్కెట్‌ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో ‘వెంకట్రావు’ గట్టిగానే పోరాడినా చివరకు స్వల్ప‌ తేడాతో ఓడిపోయారు. గెలిచిన ‘వంశీ’ వైకాపాలోకి రావడంతో ‘యార్లగడ్డ’కు కెడిఎస్‌ ఛైర్మన్‌ పదవిని ఇచ్చి సంతృప్తి పరచగా...‘దుట్టా’ వర్గీయుల‌ నుంచి ‘వంశీ’కి ఇబ్బందులు వ‌స్తున్నాయి.  

ప్రస్తుతం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న ‘వంశీ’కి పెద్దగా ప్రాధాన్యత దక్కడం లేదని ఆయన వర్గీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘దుట్టా రామచంద్రరావు’ అల్లుడు ‘శివభరత్‌రెడ్డి’ నియోజకవర్గంలో పెత్తనం చేస్తున్నారని వైకాపా పెద్దల‌కు ఆయన బంధువని దీంతో అధికారులు కూడా ఆయ‌న చెప్పిన విధంగా చేస్తున్నారనే మాట ‘వంశీ’ వర్గీయుల‌ నుంచి వినిపిస్తోంది. హైదరాబాద్‌లో హాస్పటల్‌ నిర్వహిస్తున్న ‘శివభరత్‌రెడ్డి’ నేరుగా ‘గన్నవరం’ రాజకీయాల్లో వేలు పెడుతున్నారని, నియోజకవర్గంలోని కార్యకర్తకుల‌, నాయకుకు ఫోన్‌లు చేసి నిత్యం టచ్‌లో ఉంటూ తన వర్గాన్ని పెంచుకుంటున్నారని, ఇది ‘వంశీ’కి ఇబ్బందిని కల్గిస్తోందంటున్నారు. తన మామ ‘దుట్టా రామచంద్రరావు’తో కల‌సి ‘శివభరత్‌రెడ్డి’ దూకుడుగా వెళుతుండడంతో వారిని ఎలా కట్టడి చేయాలో తెలియక ‘వంశీ’ కల‌వరానికి గురవుతున్నారంటున్నారు. గత కొన్నాళ్ల క్రితం వైకాపాకు మద్దతు ప్రకటించిన ఎమ్మెల్యే వంశీ తన పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో గెల‌వాల‌ని భావిస్తున్నారు. ఆ మేరకు వ్యూహాలు రంగం సిద్ధం చేసుకుంటుండగానే..వైకాపా నాయకుల‌ నుంచి వస్తోన్న ప్రతిస్పందన ఆయనకు చికాకులు సృష్టిస్తోంది. ఒక వేళ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే..ఉప ఎన్నికల్లో సీటు ఇస్తారా..? ఇచ్చినా...‘దుట్టా వర్గీయులు ఎన్నికల్లో తనకు సహకరిస్తారా..? అనే ఆందోళన ఆయనలో నెల‌కొందని ఆయన వర్గీయులు అంటున్నారు. కృష్ణా జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా ఉన్న ‘పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి’ ‘శివభరత్‌రెడ్డి’కే సహకరిస్తున్నారని, ఇటువంటి పరిస్థితుల్లో ఏమి చేయాలో తెలియక ‘వంశీ’ నిర్వేదానికి గురవుతున్నారనే మాట ఆయన వర్గీయులు నుంచి వినిపిస్తోంది. మొత్తం మీద టిడిపి నుంచి వైకాపాలోకి వెళ్లిన ఎమ్మెల్యేల‌ పరిస్థితి అంత సౌకర్యకరంగా లేదని తాజాగా ‘వంశీ’ ఉదంతం స్పష్టం చేస్తోంది. 

(2129)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ