లేటెస్ట్

ఇదెక్కడి త‌ల‌నొప్పి‘సోనూ’...?

‘సోనూసూద్‌’ నిన్న మొన్నటి వరకు బాలీవుడ్‌, టాలీవుడ్‌లో పేరు మోసిన విల‌న్‌. అతని గురించి ‘కరోనా’ లాక్‌డౌన్‌ ముందు తెలిసింది అదే. సినిమాల్లో నటుడు..త‌న విల‌నిజంతో ప్రేక్షకుల‌ను భయపెడతాడు...? మంచి యాక్టర్‌..అంత వరకే ప్రజల‌కు తెలుసు. కానీ...‘కరోనా’ లాక్‌డౌన్‌తో అతనిలోని మరో వ్యక్తి ప్రపంచానికి పరిచయమయ్యాడు. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో పేదలు, వల‌స కార్మికులు, నిరుపేదల‌ కష్టాల‌ను తెలుసుకుని వారికి సహాయం చేయడంతో అతను వార్తల్లోకి వచ్చాడు. ఈ రకంగా భారతదేశ వ్యాప్తంగా పలువురు సినీస్టార్‌లు, క్రికెట్‌ ఆటగాళ్లు, ఇంకా పేరు మోసిన వారంతా సహాయం చేసి మమ అనిపించారు. అయితే ఎంతో మంది సహాయం చేసినా..‘సోనూ’కే ఎందుకు అంత పేరు వచ్చిందంటే..మిగతా వాళ్లలా ఆయన  కోటో రెండు కోట్లో సహాయం చేసి చేతులు దులుపుకోలా..? తాను ఎంత సంపాదించాడో తెలియదు కానీ..ఎవరు సహాయం కావాల‌న్నా..? ముందుకు వచ్చాడు.. ఎక్కడో విదేశాల్లో చిక్కుకుపోయామని తమను ఆదుకోవాల‌ని ఒక ట్వీట్‌ చేస్తే..చాలు..వెంటనే స్పందించాడు...వాళ్లను ఇక్కడకు రప్పించడానికి విమానాలు పెట్టి ఆ ఖర్చంతా భరించి వారు దేశానికి వచ్చేదాకా అన్నీ తానై చూసుకున్నాడు. లాక్‌డౌన్‌తో కోట్ల మంది పేదలు ‘అలో ల‌క్ష్మణా’ అంటూ కాలి నడకన వేల‌ కిలోమీటర్లు నడిచిపోతుంటే ఆదుకోవాల్సిన పాల‌కులు చోద్యం చూస్తుంటే...ఆ పరిస్థితుల్లో తనకు చేతనైన మేర వల‌సకార్మికుల‌ను బస్సుల్లో వారి స్వంత ప్రాంతాల‌కు చేరవేశాడు. ఇదొక్కటేనా...ఎవరు ఏ ఆపదలో ఉన్నా...నేను ఉన్నానంటూ ప్రత్యక్షమవుతున్నాడు...! వల‌సకార్మికులే కాదు..దేశంలో ఎవరికి ఏ ఆపద ఉన్నా..తనను సంప్రదిస్తేనో..లేక తాను చూస్తేనే వెంటనే వారికి సహాయం చేస్తూ..ఔరా...అనిపించుకుంటూ రోజు రోజుకు ఎదిగిపోతున్నాడు. నిన్నటికి నిన్న ఆంధ్రప్రదేశ్‌లోని ‘చిత్తూరు’ జిల్లాలోని రైతు పొలం దున్నటానికి ఎద్దులు లేక ఇద్దరు కుమార్తెల‌తో కాడి పట్టించన వైనం సోషల్‌మీడియాలో చూసి..గంటల్లోనే ఆ రైతుకు కొత్త ట్రాక్టర్‌ కొనిచ్చాడు. ల‌క్షల‌ కోట్ల బడ్జెట్‌ ఉన్న ప్రభుత్వాలు, అధికారంలో ఉండి ల‌క్షకోట్లు అక్రమంగా పోగేసుకున్న రాజకీయ నాయకులు చేయలేని పనిని ఒక ‘విల‌న్‌’ చేస్తే..దేశమంతా ఆశ్చర్యంగా చూస్తోంది. అసలు అతను మనిషా..లేక దేవదూతా..? అంటూ పొగడ్తల‌ వర్షం కురుస్తోంది. 

ఇది ఇలా ఉంటే ‘సోనూ’ పేద ప్రజల‌పై చూపిస్తోన్న ఔదార్యాన్ని, దాతృత్వాన్ని చూసి ప్రజలు..ఇతర స్టార్లతో పోల్చిచూసి వారిని దూషిస్తున్నారు. బాలీవుడ్‌, టాలీవుడ్‌, ఇంకా ఇతర వుడ్‌లో ఉన్న సూపర్‌స్టార్‌, మెగాస్టార్‌ల‌కు లేని హృదయం ‘సోనూ’కు ఉందని, హీరోంటే ఆయన వలే ఉండాలంటూ సోషల్‌మీడియాలో జరుగుతున్న ప్రచారం ఇతర హీరోల‌కు తల‌నొప్పి తెచ్చిపెడుతోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా వారు తీవ్రస్థాయిలో విమర్శలు, ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ప్రేక్షకులు, ప్రజ పుణ్యాన వేల‌కోట్లు పోగేసుకున్న ఈ స్టార్‌లు పేదల‌పై కనీస స్పందన చూపించడం లేదని, వీరంతా అథములు అనే స్థాయిలో ప్రచారం జరుగుతోంది. ఆయనెవరో...దానం చేస్తే..మేమూ చేయాలా..? ఇదెక్కడ తల‌నొప్పి ‘సోనూ’ అంటూ కొందరు హీరోలు లోలోన మండిపడుతున్నారు. ఆయనకు దాతృత్వమనే పిచ్చిపట్టింది...తామూ..అదే విధంగా సొమ్మును దానం చేయాలా..? అంటూ కొందరు అంతరంగికంగా ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద..స్టార్లు, మెగాస్టార్లు ఇంకా ఇతర స్టార్లుల‌కు ‘సోనూ’ తల‌నొప్పి పుట్టిస్తున్నాడంటే అతిశయోక్తి లేదేమో..? స్టార్లకే కాదు..రాజకీయ నాయకుల‌కూ ‘సోనూ’ సెగ తగులుతోంది.

(557)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ