లేటెస్ట్

‘కన్నా’పై వేటుకు కారణాలు ఇవే...!?

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా ‘సోము వీర్రాజు’ నియామకం..కొంతమంది ఊహించిందే. తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడ్ని మార్చిన తరువాత..ఇక్కడ కూడా మారుస్తారనే ప్రచారం అప్ప‌ట్లో జోరుగా సాగింది. అయితే అప్పట్లో...ఎందుకో అధిష్టానం వేచి చూసింది. అయితే ఎవరూ ఊహించని విధంగా నిన్న‌ రాత్రికి రాత్రికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ‘కన్నాల‌క్ష్మీనారాయణ’ను తొల‌గించి..ఆ స్థానాన్ని ఎమ్మెల్సీ ‘సోము వీర్రాజు’కు ఇచ్చేసింది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ‘కన్నా ల‌క్ష్మీనారాయణ’ కొన్ని విషయాల్లో బిజెపి అధిష్టానానికి ఇబ్బందులు తెచ్చేలా వ్యవహరించారని, మరీ ముఖ్యంగా రాజధాని అమరావతి విషయంలో కేంద్ర పెద్దల‌ను ఆయన ఇరుకున పెట్టారనే మాటలు పార్టీలో ఉన్నాయి. మూడు రాజధానుల బిల్లులు గవర్నర్‌కు చేరిన వెంటనే ‘అమరావతి’నే రాజధానిగా ఉంచాలంటూ గవర్నర్‌కు ‘కన్నా’ లేఖ రాయడం అధిష్టానానికి ఆగ్రహం కల్గించిందంటున్నారు. ఆ మేరకు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారని వార్తలు వచ్చాయి. 

కేవలం అదొక్కటే కాదు..టిడిపి, కాంగ్రెస్‌ నుంచి బిజెపిలో చేరిన నాయకుల‌తో కల‌సి ఆయన ఒక గ్రూపుగా వ్యవహరిస్తున్నారని, వారంతా టిడిపి విధానాల‌కు అనుగుణంగా పనిచేస్తున్నారని, ముఖ్యంగా రాజధాని విషయంలో పార్టీ లైన్‌కు సంబంధం లేకుండా స్వంత్య్రంగా వ్యవహరించారనే కోపం అధిష్టానంలో ఉందంటున్నారు. రాజధాని ఎక్కడ పెట్టాలో..నిర్ణయించుకునే స్వేచ్చ రాష్ట్ర ప్రభుత్వాల‌కు ఉందని, ఆ విషయంలో కేంద్రం జోక్యం చేసుకునేది లేదని పార్టీ సీనియర్‌ నేతలు జి.వి.ఎల్‌.నర్సింహ్మారావు, పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి సునీల్‌, మాధవ్‌ వంటి నేతలు చెబుతున్నా..దాన్ని పట్టించుకోకుండా ‘అమరావతే’ రాజధానిగా కొనసాగాల‌ని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా ‘కన్నా’ ముందుకెళ్లారని, దీనితో బిజెపి ఇరకాటంలో పడిందని చెబుతున్నారు. అదే కాకుండా గత ఎన్నికల‌ సందర్భంగా కేంద్ర పెద్దలు ఇచ్చిన నిధుల‌ను దుర్వినియోగం చేశారనే ఆరోపణలు, రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శులు చేయడం కూడా కేంద్రంలోని పెద్దల‌కు నచ్చలేదట. కేంద్ర స్థాయిలో ప్రతి విషయంలో తమతో సహకరిస్తున్న ‘వైకాపా’ ప్రభుత్వంపై అంత స్థాయిలో దాడులు చేయాల్సిన అవసరం లేదనే భావన కేంద్ర పెద్దల్లో ఉందట. ‘కన్నా, సుజనా, పురంధేశ్వరి’ మరి కొంత మంది నేతలు కల‌సి ‘టిడిపి’కి మేలు చేసే విధంగా చేస్తున్నారని పార్టీలోని ఇతర నాయకులు కేంద్ర పెద్దల‌కు పదే పదే ఫిర్యాదు చేయడంతో ‘కన్నా’పై వేటు వేశారని తెలుస్తోంది.

(708)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ