లేటెస్ట్

‘సహానీ’కి మరోసారి పొడిగింపు ల‌భిస్తుందా...!?

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ‘నీలం సహానీ’ పదవీకాలాన్ని మరో మూడు నెల‌లు పొడిగించాల‌ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఇప్పటికే ‘సహానీ’కి మూడు నెల‌లు పొడిగింపు ల‌భించింది. ఇప్పుడు మరో మూడు నెల‌ల పొడిగింపు కావాల‌ని స్వయంగా ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి లేఖ రాయడంతో ఆమెకు మరి కొంత కాలం పొడిగింపు ల‌భిస్తుందనే ప్రచారం జరుగుతోంది.వాస్తవానికి ఆమె జూన్‌30వ తేదీన రిటైర్‌ కావాల్సి ఉంది. అయితే కరోనా పరిస్థితుల‌ నేపథ్యంలో ఆమె పదవీకాలం పొడిగించాల‌ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరడంతో ఆమెకు సెప్టెంబర్‌ వరకు పదవీకాలం పొడిగింపు ల‌భించింది. ప్రధానిగా ‘మోడీ’ పదవీ బాధ్యతలు  చేపట్టినప్పటి నుంచి కేంద్ర సర్వీసుకు చెందిన అధికారుల‌ పదవీకాలాన్ని పొడిగించడానికి ఇష్టపడలేదు. పలువురు ముఖ్యమంత్రులు ‘మోడీ’పై నేరుగా ఒత్తిడి తెచ్చినా..పొడిగింపు బిజినెస్‌లు వద్దంటూ ఆయన గట్టిగా తిరస్కరించారు. తెలుగు రాష్ట్రాల‌కు సంబంధించి గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేసిన విజ్ఞప్తిని, ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ముఖ్యమంత్రి ‘చంద్రబాబు’ చేసిన విజ్ఞప్తుల‌ను ఆయన తిరస్కరించారు. అయితే ప్రస్తుతం ‘కరోనా’ సమయంలో సీనియర్‌ అధికారుల సేవ‌లు కావాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయడంతో ‘సహానీ’కి మూడు నెల‌లు పొడిగింపు ల‌భించింది. కేంద్రంలోనూ ఒకరిద్దరు రిటైర్డ్‌ అధికారుల‌ సర్వీసుల‌ను పొడిగించడంతో ‘సహానీ’కి కూడా అవకాశం ల‌భించింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం మరో మూడు నెల‌లు సర్వీసును పెంచాల‌న్న విజ్ఞప్తిపై కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందా..? లేదా అనే దానిపై సచివాల‌య వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.  

రాష్ట్ర సర్వీసుకు చెంది కేంద్రంలో పనిచేస్తోన్న ‘ప్రీతీసూడాన్‌’ సర్వీసు కాలాన్ని ఇటీవల‌ పొడిగించారు. అయితే ఇప్పుడు ఆమె సర్వీసును పొడిగించేది లేదని చెబుతున్నారని, ఆమెకు అనుసరించిన నియమాలే ‘సహానీ’కి వర్తింప చేస్తారని, దాంతో మరోసారి ఆమెకు పొడిగింపు ల‌భించదని పలువురు సీనియర్‌ అధికారులు అంటున్నారు. కాగా ప్రస్తుతం సిఎస్‌గా ఉన్న ‘నీలం’ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఒక వైపు ప్రభుత్వం మరో వైపు కోర్టులు పరస్పరం ఢీ కొడుతుండడంతో ఆమె తీవ్రమైన ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఎన్నికల‌ కమీషనర్‌ ‘రమేష్‌కుమార్‌’ను తిరిగి నియమించాల‌ని హైకోర్టు చెప్పినా..దానికి సంబంధించిన జీవో ఇంత వరకు ప్రభుత్వం ఇవ్వకపోవడంపై కోర్టు  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోర్టుధిక్కరణ కిందకు తెచ్చింది. రేపు శుక్రవారం లోపు ‘రమేష్‌కుమార్‌’ విషయంలో ఆర్డర్‌ ఇవ్వకపోతే ‘సహానీ’ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో మరో మూడు నెల‌లు సర్వీసు పొడిగింపు తెచ్చుకుని ‘నీలం’ ఏం చేస్తారనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

(377)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ