‘వామ్మో...! ‘ఓటు’కు ‘లక్ష’ రూపాయిలట....!
లక్ష రూపాయిల విలువ తగ్గిందా...? లేక ‘ఓటు’ ఖరీదు పెరిగిందా...? అడ్డగోలు హామీలతో గద్దెనెక్కి..అధికారంలోకి వచ్చిన తరువాత అరాచకంగా సంపాదించిన అధికార పార్టీ నాయకులు ‘ఓటు’కు ‘లక్ష’ ఇస్తాం..తమకే ఓటు వేయాలనే ప్రచారం చేస్తున్నారట. తమ మాట వినలేదని, ‘టిడిపి’తో పొత్తు పెట్టుకున్నారనే ఏకైక కారణంతో ‘జనసేన’ అధ్యక్షుడు ‘పవన్ కళ్యాణ్’ను ఓడించడానికి ‘ఓటు’కు ‘లక్ష’ రూపాయిలు ఇస్తామని వీరంగాలు వేస్తున్నారట. తూర్పుగోదావరి జిల్లా ‘పీఠాపురం’ నుంచి ‘పవన్’పోటీ చేస్తున్నారు. ఆయనపై ‘వైకాపా’ అభ్యర్థిగా ‘వంగా గీత’ తలపడుతున్నారు. ఇక్కడ పోటీ ‘పవన్’ ‘గీత’ల మధ్యే అయినా..అసలైన పోటీ అపధర్మ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి, పవన్‌ల మధ్యే సాగుతోంది. ఎట్టి పరిస్థితుల్లో ‘పవన్’ను ఓడించాలని, అందుకోసం ఎంత దూరమైనా వెళ్లడానికి ‘జగన్’ ‘సిద్ధం’ అవుతున్నారనే ప్రచారం నియోజకవర్గంలో సాగుతోంది. దీన్ని ‘పవన్’ కూడా దృవీకరించారు. ఈ రోజు ఆయన ‘పీఠాపురం’ నియోజకవర్గ ‘జనసేన’ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాల గురించి వారు ‘పవన్’కు వివరించారు. తనను ఓడించడానికి ‘జగన్’ తనపై ప్రత్యేక దృష్టిపెట్టారని, ఆయనతో పాటు ప్రభుత్వ సలహాదారు ‘సజ్జల రామకృష్ణారెడ్డి, ‘రాజంపేట’ ఎంపి ‘మిధున్‌రెడ్డి’ ‘ముద్రగడ్డ పద్మనాభం’ ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వంటి నేతలను ప్రత్యేకంగా నియమించారని, వీరితోపాటు మండలానికో నాయకుడిని నియమించి, ఎన్నికోట్లు ఖర్చు అయినా..‘పవన్’ ఓడించాలని కోరుతున్నారని, అయితే..తనను ఈసారి ‘జగన్’ ఓడిరచలేరని ‘పవన్’ అన్నారు. కుటుంబానికి ‘లక్ష రూపాయిలు’ ఇచ్చినా..వైకాపాకు ‘పీఠాపురం’ నియోజకవర్గ ప్రజలు ఓట్లు వేయరని, ఈసారి తనను అసెంబ్లీకి రాకుండా ఎవరూ ఆపలేరని ‘పవన్’ వ్యాఖ్యానించారు. ‘పీఠాపురం’లో ఓటుకు ‘లక్షరూపాయిలు’ ఇస్తామని వైకాపా నాయకులు చెబుతోన్న మాటలు..రాజకీయవర్గాల్లో సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. ఐదేళ్ల వైకాపా పాలనలో వారు ప్రజలను ఎంతగా దోచుకున్నారో..దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చునని, ఓట్ల కోసం లక్షల కోట్లు ఖర్చుచేస్తున్నారని, ఇటువంటి పరిణామాలు ప్రజాస్వామ్యానికి పెనుప్రమాదాన్ని సృష్టిస్తుందని, వివేకవంతమైన ఓటర్ల నిర్ణయమే..ఇటువంటి అరాచకాలను నిరోధిస్తుందని వారు చెబుతున్నారు. కాగా ఈసారి ‘పవన్’ ఖచ్చితంగా గెలుస్తారని, ఆయన గెలుపుకు ‘టిడిపి’ నాయకులంతా కలిసి పనిచేస్తున్నారు. నిన్నటి దాకా అసమ్మతిస్వరం వినిపించిన ‘వర్మ’ ‘పవన్’ను ‘లక్ష’ ఓట్ల మెజార్టీతో గెలిపిస్తానని శపథం చేశారు. ఆయన రాజకీయ భవిష్యత్కు మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత ‘చంద్రబాబునాయుడు’ భరోసా ఇచ్చారని, ‘పవన్’ను గెలిపించే బాధ్యత ఆయనపై పెట్టారు. అయితే..జగన్ చేస్తోన్న సొమ్ముల రాజకీయం నియోజకవర్గంలో ఎటువంటి పరిస్థితిని సృష్టిస్తుందోనన్న భయం ‘జనసేన’ నేతల్లో, కార్యకర్తల్లో, ‘పవన్’ అభిమానుల్లో కనిపిస్తోంది. మొత్తం మీద అరాచకీయానికి, ధర్మానికి జరుగుతోన్న పోరాటంలో ‘ధర్మ’మే గెలుస్తుందని వారు అంటున్నారు.