లేటెస్ట్

‘కూటమి’కి దెబ్బ మీద దెబ్బ..!

‘ఆంధ్రప్రదేశ్‌’ టిడిపి,జనసేన, బిజెపి కూటమికి దెబ్బమీద దెబ్బ తగులుతోంది. సీట్ల పంపకాల విషయంలో ఏదో విధంగా కొందరు త్యాగాలు చేసి, పొత్తును నిలబెట్టినా..బిజెపి అగ్రనాయకత్వం తీరుతో..కూటమి ఏర్పాటు ఉద్దేశ్యం పూర్తిగా దెబ్బతింటోంది. అధికార వైకాపాను ఓడిరచడానికి ఎన్నో అవమానాలు భరించి మరీ వారితో..పొత్తుకు వెళ్లిన ‘టిడిపి,జనసేన’లకు ‘మోడీ’ ఉద్దేశ్యాలు తెలిసిన తరువాత హతాశులవుతున్నారు. బిజెపి తమతో ఉంటే..అధికార వైకాపా అకృత్యాలను, దౌర్జన్యాలను ఎదుర్కోవచ్చనే భావనతో వారితో కలిస్తే..వీరి బలహీనతలను ఆసరా చేసుకుని ‘బిజెపి’ పెద్దలు వీరితో ఆడుకుంటున్నారు. మొన్నటికి మొన్న ‘చిలకలూరిపేట’ సభలో ‘మోడీ’ నిర్వాకం చూసిన తరువాత పొత్తు వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువన్న భావన టిడిపి,జనసేనల్లో కలిగింది. అయితే..ఇదే మొదటి సభ కనుక తరువాత అయినా..‘బిజెపి పెద్దల’ నుంచి సహకారం అందుతుందనే ఆశతో ఉన్నవారికి ఈరోజు ‘రఘురామకృష్ణంరాజు’కు సీటు నిరాకరించడంతో..తాము ‘కూటమి’లో ఉన్నా..తమ మనస్సు ‘జగన్‌’ వైపే అని మరోసారి వారు రుజువు చేశారు. వాస్తవానికి ‘రఘురామకృష్ణంరాజు’ బిజెపి నాయకుడు కాదు కానీ..ఆయనకు ‘బిజెపి’ టిక్కెట్‌ ఇస్తుందనే ప్రచారం చాలా రోజుల నుంచి జరుగుతోంది. అయితే..ఆయనకు బిజెపిలో టిక్కెట్‌ రాకుండా ‘జగన్‌’ అడ్డుకుంటూ వస్తున్నారు. అయితే..ఎవరు అడ్డుకున్నా...తనకు ‘నర్సాపురం’ సీటు వస్తుందనే ధీమాతో ‘రఘురామ’ ఉన్నారు. అయితే..ఆయన ఆశలను అడియాసలు చేస్తూ..ఈ రోజు..‘నర్సాపురాని’కి వేరే అభ్యర్థిని బిజెపి తరుపున ప్రకటించారు. దీంతో..‘ఆంధ్రా’ బిజెపి టిక్కెట్లు ఎవరి సిఫార్సులతో వస్తున్నాయో..అర్థం అవుతుంది. బిజెపి చేసిన ఈ పని కూటమిని బలపరిచేదా..? లేక పరోక్షంగా ‘జగన్‌’కు సహకరించేదా..? అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.


‘జగన్‌’ అధికారంలోకి వచ్చిన వెంట నుంచే..‘రఘురామ’ ఆయనపై ఒంటరిపోరాటం చేస్తున్నారు. ఆయనను జైలుకు పంపడం..పోలీసు కస్టడిలో హింసకు గురిచేయడం వంటి పనులు చేసినా, బిజెపి పెద్దలు తనవైపు ఉంటారనే భావనతో ఆయన ‘జగన్‌’పై వెన్ను చూపకుండా పోరాటం చేశారు. అయితే.అసలైన సమయంలో ఆయనకు ‘బిజెపి’ హ్యాండ్‌ ఇచ్చింది. కూటమి కోసం అనేక విధాలుగా కష్టపడ్డ ‘రఘురామ’కు ‘బిజెపి’ టిక్కెట్‌ ఇవ్వకుండా చేయడం, అదీ టిడిపి,జనసేనలు అభ్యర్ధులు ప్రకటించిన తరువాత ఆయనను నమ్మించి మోసం చేయడమే. ఇప్పుడు ‘రఘురామ’కు టిక్కెట్‌ లేకపోతే..అది ‘కూటమి’పై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ చర్య పరోక్షంగా ‘జగన్‌’కు సహకరించేందుకేనన్న భావన ప్రజల్లోకి వెళుతుంది. దీంతో..కూటమి మధ్య తీవ్ర అగాధాలు ఏర్పడుతాయి. కూటమిలో ఒకరికొకరు ఓడిరచుకునేందుకు ప్రయత్నాలుచేస్తారు. ఇదే కాదు..ఎన్నికల కోడ్‌ వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో పరిస్థితులు ఏకపక్షంగా ఉండవని, అధికారపార్టీకి అధికారులు, పోలీసులు సహకరించరని ‘కూటమి’ పెద్దలు భావించారు. అయితే..అది కూడా అత్యాశే అయింది. సాక్షాత్తూ ప్రధాని సభలో గందరగోళం జరిగినా, దానికి కారుకులైన అధికారులపై ఇంతవరకూ చర్యలు లేవు. అదేవిధంగా అధికారపార్టీ అడ్డగోలుగా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్నా..వారిపై చర్యలు లేవు. అదే ప్రతిపక్ష సభ్యులు ఇంటిలోంచి కాలు బయటకు పెడితే వేధింపు చర్యలకు పాల్పడుతున్నారు. మొత్తం మీద పొత్తు వల్ల ఏదో ఒరుగుతుందనుకుంటే..చివరకు..ఏదో జరుగుతోందన్న ఆందోళన టిడిపి,జనసేన నాయకుల్లో, కార్యకర్తలో..నెలకొంది. ‘మబ్బులను చూసి..ముంతలో ఉన్న నీళ్లు ఒంపుకున్న చందమైందని’ ఓ టిడిపి నాయకుడు వ్యాఖ్యానించారు.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ