లేటెస్ట్

మమ్మల్ని వేధిస్తున్నారు:రాయపాటి

స్వర్ణాప్యాలెస్ కోవిద్ హాస్ప‌ట‌ల్ లో జ‌రిగిన‌ అగ్ని ప్రమాదం విషయంలో తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని మాజీ ఎంపి రాయపాటి సాంబశివరావు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఇటీవల‌ కోవిద్‌ రోగుల‌తో ఉన్న స్వర్ణాప్యాలెస్‌ హోటల్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 11మంది మృతి చెందడం వెనుక దాన్ని నిర్వహిస్తున్న రమేష్‌ హాస్పటల్‌ యాజమాన్యం నిర్లక్ష్యం ఉందని, దానికి బాధ్యులుగా పేర్కొంటూ ముగ్గురు హాస్పటల్‌ నిర్వహకుల‌ను పోలీసులు ఇప్ప‌టికే అదుపులోకి తీసుకున్నారు. ఇంకా కొంత మంది బాధ్యుల‌ను అరెస్టు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. దీనిలో భాగంగా గుంటూరు రమేష్‌ హాస్పటల్‌లో పనిచేస్తోన్న మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కుమారుడి భార్య డాక్టర్‌ మమతకు పోలీసులు నోటీసులు జారీ చేసి విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని కోరారు. రమేష్‌ హాస్పటల్‌ యాజమాన్య నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని దానిలో భాగస్తులైన అందరినీ విచారిస్తున్నామని పోలీసు చెబుతున్నారు. అయితే విజయవాడ రమేష్‌ హాస్పటల్‌ ఆధ్వర్యంలో స్వర్ణాప్యాలెస్‌లో కోవిద్‌ హాస్పటల్‌ నిర్వహిస్తున్నారని, విజయవాడ రమేష్‌ హాస్పటల్‌కు గుంటూరు హాస్పటల్‌కు సంబందం లేదని ‘రాయపాటి’ కుటుంబీకులు పేర్కొంటున్నారు. డాక్టర్‌ మమత గుంటూరులో విధులు నిర్వహిస్తున్నారని, ఆమె హెచ్‌ఆర్‌ఎగా పనిచేస్తున్నారని, హాస్పటల్‌ నిర్వహణకు, ఇతర విషయాల‌కు ఆమెకు సంబంధం లేదని, ఆమెను ఈ కేసులో ఎలా ప్రశ్నిస్తారని డాక్టర్‌ మమత భర్త రాయపాటి రంగ‌బాబు ప్రశ్నిస్తున్నారు. తమపై కావాల‌నే ప్రభుత్వం వేధింపుల‌కు గురి చేస్తుందని ఆయన ఆరోపిస్తున్నారు. డాక్టర్‌ మమత ఇప్పటికే కరోనాతో బాధపడుతూ ఇటీవలే కోలుకున్నారని, ఇటువంటి పరిస్థితుల్లో ఆమెను విచారించడం సరికాదని వారు వాదిస్తున్నారు. అయితే ‘రాయపాటి’ కుటుంబీకులు ఏమి చెప్పినా..తాము మాత్రం ఆమెను విచారిస్తామని చెబుతూ డాక్టర్‌ మమతను పోలీసులు విజయవాడ తరలించారు. మొత్తం మీద..స్వర్ణాప్యాలెస్‌లో జరిగిన అగ్నిప్రమాదం రాజకీయంగా ప్రకంపనలు రేకెత్తిస్తోంది.

(504)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ