లేటెస్ట్

అమరావతిపై 27వరకు స్టేటస్‌కో పొడిగింపు

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిపై గతంలో హైకోర్టు ఇచ్చిన స్టేటస్‌కోను ఈ నెల‌27వరకు పొడిగిస్తూ నేడు హైకోర్టు న్యాయమూర్తులు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో హైకోర్టు ఇచ్చిన స్టేటస్‌కో ఈ రోజుతో ముగియనుండడంతో ఈ రోజు మళ్లీ కోర్టులో దీనిపై వాదనలు జరిగాయి. ప్రభుత్వం తన అఫడవిట్‌ను దాఖలు చేయడానికి హైకోర్టు 14వ తేదీ వరకు గడువు ఇచ్చింది. దీనిపై రాజధానికి సంబంధించిన పలు వ్యాజ్యాల‌ను అన్నింటిని కలిపి హైకోర్టు ఈ రోజు విచారణ చేపట్టింది. మూడు రాజధానులు అనేవి విభజన చట్టానికి విరుద్ధమని పిటీషనర్ల తరుపు న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. విభజన చట్టంలో ఒకటే రాజధాని అని ప్రస్తావించారని, ఇప్పుడు ప్రభుత్వం మూడు రాజధానులు అంటోందని ఇది చట్ట వ్యతిరేకమని వారు కోర్టుకు విన్నవించారు. రాజధాని తరలింపు, సీఆర్డీఎ రద్దు వంటి చట్టాలు అమలుపై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల‌ను ఎత్తివేయాల‌ని రాష్ట్ర ప్రభుత్వ తరుపు న్యాయవాది హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే ఆయన విజ్ఞప్తిని హైకోర్టు తిరస్కరిస్తూ 27 వరకు స్టేటస్‌కోను పొడిగించింది. కాగా పిటీషన్లను ప్రత్యక్ష పద్దతిలో విచారణ జరిపించాల‌ని పిటీషనర్‌ తరుపు న్యాయవాదులు కోరగా..కోవిడ్ వ‌ల్ల‌ తాము ప్రత్యక్షంగా హాజరు కాలేమని సుప్రీంకోర్టు న్యాయవాదులు తెలిపారు. దీంతో ఇకపై కూడా ఆన్‌లైన్‌లోనే విచారణ జరగబోతోంది. కాగా ఇప్పటికే హైకోర్టు ఇచ్చిన స్టేటస్‌కోను ఎత్తివేయాల‌ని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నెల‌17వ తేదీన దీనిపై విచారణ జరగనుంది.

(264)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ