లేటెస్ట్

పాఠశాలల‌ను ఇప్పుడే తెరవవద్దు:రఘురామకృష్ణరాజు

రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్‌5వ తేదీ నుంచి పాఠశాల‌లను తెరవాల‌ని యోచిస్తున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయని, కరోనా ఉధృతంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో స్కూళ్లను తెరవద్దని నర్సాపురం పార్లమెంట్‌ సభ్యుడు రఘురామకృష్ణరాజు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని కోరారు. ఈ మేరకు ఆయన ఓ లేఖను ముఖ్యమంత్రికి రాశారు. పాఠశాలల‌ను తిరిగి తెరుస్తున్నారని ఇప్పట్లో స్కూళ్లను తెరవవద్దని రాష్ట్రంలో పలువురు తనకు ఫోన్‌ చేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. కరోనా సమయంలో పాఠశాల‌లు తెరవడం వ‌ల్ల‌ తమ పిల్ల‌ల‌కు కరోనా సోకే ప్రమాదం ఉందని, ప్రాణాలు పోతాయనే ఆందోళనతో వారు భయభ్రాంతుల‌కు గురవుతున్నారని ఆ లేఖలో రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. రాష్ట్రంలో రోజుకు పదివేల‌ వరకు కొత్త కరోనా కేసులు నమోదు అవుతున్నాయని, 70 నుంచి 90 మంది వరకు ప్రాణాలు కోల్పోతున్నారని అధికార లెక్కలే చెబుతున్నాయని రాష్ట్రంలో ఇప్పటికే మూడు ల‌క్ష మందికి కరోనా సోకిందని ఇటువంటి తరుణంలో పాఠశాల‌లు తెరవడం సరికాదని ఆయన ముఖ్యమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. చిన్న పిల్ల‌ల‌కు రోగనిరోధకశక్తి తక్కువగా ఉంటుందన్న విషయం మీకు తెలియంది కాదు. పిల్ల‌ల‌ను భౌతిక దూరం పాటించే విధంగా కట్టడి చేయడం చాలా కష్టం. అంతే కాకుండా రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ పాఠశాల‌ల విద్యార్థుల‌కు సరిపడ తరగతి గదులు లేవు, టాయిలెట్‌లు అధ్వాన్నంగా ఉన్నాయి. ప్రైవేట్‌ స్కూళ్లు యాజమాన్యాలు ఇరుకు గదుల్లో తరగతులు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో తొందరపడి పాఠశాలు తెరిస్తే..పిల్ల‌ల‌కు కరోనా సోకినా, మృత్యువాత పడినా మీకు, మన ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని, ఈ అంశాల‌ను దృష్టిలో ఉంచుకుని పాఠశాల‌లు తెరవాల‌న్న ప్రభుత్వం నిర్ణయంపై పునరాలోచన చేయాల‌ని ఆయన కోరారు.

(644)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ