లేటెస్ట్

‘గన్నవరం’ ‘టిడిపి’ గురించి ‘బాబు’ పట్టించుకోరా...!?

నిన్న మొన్నటి వరకు టిడిపికి కంచుకోటగా ఉన్న ‘గన్నవరం’ నియోజకవర్గంలో ప్రతిపక్ష టిడిపి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. గత ఎన్నికల్లో టిడిపి తరుపున గెలిచిన ‘వ‌ల్ల‌భనేని వంశీమోహన్‌’ వైకాపాకు మద్దతు ప్రకటించడంతో నియోజకవర్గంలో ఆ స్థానాన్ని భర్తీ చేసే నాయకత్వం కనిపించడం లేదట. ‘వంశీ’ టిడిపిని వీడి చాలా కాలం అయినా..ఆయన స్థానంలో ఇన్‌ఛార్జిని ప్రకటించకుండా పార్టీ అధ్యక్షుడు మీన మేషాలు లెక్కపెడుతున్నారనే మాట సాధారణ కార్యకర్తల‌ నుంచి వినిపిస్తోంది. ఆయన ఎప్పుడు అయితే ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డిని కలిసి మద్దతు ప్రకటించారో...అదే రోజు ఇన్‌ఛార్జిని ప్రకటిస్తే..పార్టీ పరిస్థితి బాగుండేదనే అభిప్రాయం పార్టీ కార్యకర్తల్లోనూ, సానుభూతిపరుల్లోనూ వ్యక్తం అవుతోంది. ‘వంశీ’ పార్టీని వీడిన తరువాత అయినా ఇన్‌ఛార్జి వ్యవహారం తేల్చ‌కుండా పార్టీ అధ్యక్షుడు ‘చంద్రబాబు’ ఆయన కుమారుడు ‘లోకేష్‌’ మీన మేషాలు లెక్కిస్తున్నారని, ఇప్పటికే నాయకత్వం లేక పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులు ‘వంశీ’ వెంట వెళ్లుతున్నారని, మరి కొన్ని రోజుల్లో క్రియాశీల‌కంగా అన్నవారంతా ఆయన వెంట నడుస్తారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

వాస్తవానికి టిడిపి నుంచి వైకాపాలోకి వెళ్లిన ‘వంశీ’కి అక్కడ పరిస్థితులు అంత సజావుగా లేవు. వైకాపాలో ఉన్న గ్రూపు తగాదాల‌తో..ఆయన పరీక్షాకాలాన్ని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలో ‘దుట్టా రామచంద్రరావు’ వర్గీయులు ఆయనను తీవ్ర ఇబ్బంది పెడుతున్నారు. మరో వైపు గత ఎన్నికల్లో వైకాపా తరుపున పోటీ చేసి ఓడిపోయిన ‘యార్లగడ్డ వెంకట్రావు’ కూడా తనకు చేతనైన రీతిలో ‘వంశీ’కి చిక్కులు సృష్టిస్తున్నారు. వీరిద్దరికి తోడు ‘దుట్టా’ అల్లుడు నియోజకవర్గ రాజకీయాల్లో కలుగచేసుకుని..పెత్తనం చేస్తున్నారనే అభిప్రాయం నియోజకవర్గంలో వ్యక్తం అవుతుంది. ‘దుట్టా’, యార్లగడ్డ’ల‌ను కలుపుకుని వెళ్లాల‌ని ‘వంశీ’ ఎంత ప్రయత్నిస్తున్నా..వారు ఆయనకు సహకరించడం లేదు. వారిద్దరూ సహకరిస్తే..త్వరలో తాను శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళతానని, ఇక్కడ వైకాపా తరుపున తాను గెలిచి..రాజధాని ప్రాంతంలో రికార్డు సృష్టించాల‌ని ‘వంశీ’ భావిస్తున్న సందర్భంలో ఆయనకు పార్టీలో చికాకులు ఎదురవుతుండడంతో..ఆయన ఇలా కాదని టిడిపిలో తన వెంట రాని నాయకుల‌ను తనవైపు తిప్పుకుంటున్నారు. 

మెజార్టీ గ్రామాల్లో ఉన్న టిడిపి నాయకులు ‘వంశీ’ వెంట వెళుతున్నా..వారిని ఆపేవారు కానీ, వారికి సర్దిచెప్పి పార్టీలో ఉండేలా చేయగలిగిన నాయకులు టిడిపిలో కనిపించడం లేదు. రోజు రోజుకు  నియోజకవర్గంలో టిడిపి బల‌హీనం అవుతున్నా ‘చంద్రబాబు’ కానీ ఆయన కుమారుడు ‘లోకేష్‌’ కానీ..పట్టించుకోవడం లేదనే అభిప్రాయం ఇక్కడ వినిపిస్తోంది. నియోజకవర్గంలో ఒకవేళ ఉప ఎన్నిక జరిగితే...‘వంశీ’కి సీటు వస్తే..ఆయనను వ్యతిరేకించే వైకాపా నాయకులు ఇండిపెండెంట్‌గా రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో..ఉపఎన్నికల్లో పోటీ ‘వంశీ’కి ఇండిపెండెంట్‌ మధ్యే జరిగే పరిస్థితి. టిడిపి మూడవ స్థానానికి వెళ్లే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికైనా ‘చంద్రబాబు’ శభిషలు మానుకుని..ఎవరో ఒక నాయకుని..ఇన్‌ఛార్జి పదవిని అప్పగించి..పార్టీ నాయకుల్లో, కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా కాకుండా..ఇదే విధంగా నానిస్తే..పైన చెప్పుకున్నట్లు మూడోస్థానానికి సిద్ధపడాల్సిందే.

(352)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ