లేటెస్ట్

‘కూటమి’ దూకుడు తగ్గిందా..?

ఒకేసారి దాదాపు వంద మంది అభ్యర్థులను ప్రకటించిన ‘టిడిపి,జనసేన కూటమి’ ఎన్నికల గోదాలోకి ఎంతో ఆత్మవిశ్వాసంతో దిగింది. ‘చంద్రబాబు’ నైజానికి భిన్నంగా అంతమంది అభ్యర్ధులను ప్రకటించడం, ‘జనసేన’ కూడా వచ్చేఎన్నికల్లో ఎలాగైనా ‘జగన్‌’ను ఓడిరచాలనే ధ్యేయంతో సీట్లను సర్దుబాటు చేసుకోవడంతో..ఇక కూటమిది ‘విజయబాట’ అన్నట్లుగా ఉంది. అయితే..ఈ కూటమిలోకి ఎప్పుడైతే ‘బిజెపి’ వచ్చి చేరిందో..అప్పటి నుంచి ‘కూటమి’కి కష్టాలు మొదలయ్యాయి. ఎన్నికల్లో ‘జగన్‌’ దౌర్జన్యాలను ఎదుర్కొవడానికి, ఎన్నికలు సజావుగా జరిగేందుకు ‘బిజెపి’ తోడ్పాటు తప్పనిసరి అని, టిడిపి,జనసేన నాయకులకు, కార్యకర్తలకు ఇష్టం లేకపోయినా..‘బిజెపి’తో బంధానికి ‘టిడిపి’ పెద్దలు అంగీకరించారు. అయితే..‘బిజెపి’ కూటమితో జతకట్టాక..కూటమి విజయం దిశగా దూసుకుపోతున్నకున్న వారి ఆశలను ‘బిజెపి’ అడియాసలు చేసింది. మొదట సీట్ల దగ్గర పంచాయితీలు పెట్టి..బలం లేకున్నా ‘ఆరు’ ఎంపీ సీట్లు, 10 అసెంబ్లీ సీట్లను తీసుకున్నారు. సరే..పొత్తు ధర్మమని భావించి సర్దుకుపోయినా..బిజెపి పెద్దలు మాత్రం పొత్తు ఉద్దేశ్యాలను తుంగలోకి తొక్కడం ‘టిడిపి,జనసేన’ కార్యకర్తలను, నాయకులకు ఆత్మక్షోభను కల్గిస్తోంది. మొదట ‘చిలకలూరిపేట’ సభలో ‘ప్రధాని మోడీ’ చేసిన ప్రసంగం, తరువాత ‘రఘురామకృష్ణంరాజు’ వ్యవహారం, అధికారుల తీరు, పోలీసుల వ్యవహారశైలితో కూటమి దూకుడుకు కళ్లెం పడిరది. వాస్తవానికి ‘బిజెపి’ కూటమిలోకి వచ్చిన వెంటనే..రాష్ట్ర పాలనలో కీలకంగా వ్యవహరిస్తోన్న ‘ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి’ని, డీజీపి, ఇంటిలిజెన్స్‌ ఐజీని తప్పిస్తారని కూటమి కార్యకర్తలు, నాయకులు, పరిశీలకులు భావించారు. అయితే..అవేమీ జరగలేదు. పైగా ప్రతి చిన్నవిషయానికి అధికారులు, పోలీసులు ప్రతిపక్ష నాయకులను, కార్యకర్తలను వేధిస్తూనే ఉన్నారు. ఎన్నికల కోడ్‌ వచ్చిన తరువాత..ఉన్నతాధికారులు, పోలీసులు సమన్యాయం పాటిస్తారని, అలా కేంద్రంలోని పెద్దలు కనీసం మద్దతు ఇస్తారని ఆశిస్తే అదీ అడియాస అయింది. ఎన్నికల నిబంధనలను పాటించని అధికారపార్టీ నాయకులపై పలు ఫిర్యాదులు వచ్చినా, వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని కోరినా..వారిపై ఎటువంటి చర్యలను ఎన్నికల కమీషన్‌ తీసుకోలేదు. ఎటువంటి ప్రజాబలం లేని ‘బిజెపి’ని పొత్తులోకి తీసుకువచ్చిందే..ఎన్నికలు సజావుగా జరిపిస్తారని, కానీ..బిజెపి పెద్దలు దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ‘పశ్చిమబెంగాల్‌’లో చిన్న తప్పుచేయకపోయినా.. అక్కడి ‘డిజీపీ’ని కేంద్ర ఎన్నికల సంఘం తప్పించింది. ఇక్కడ మాత్రం సాక్షాత్తూ ప్రధాని సభలో గందరగోళం చెలరేగినా, సభకు ఆటంకాలు కలిగినా..దానికి బాధ్యులైన పోలీసు అధికారులపై ఇంత వరకూ చర్యలు తీసుకోలేదు. కూటమిలో ‘బిజెపి’ ఉంటే..ఏదో జరుగుతుందని, టిడిపి, జనసేన నాయకులు త్యాగాలకు సిద్ధపడితే..‘బిజెపి’ పెద్దలు మాత్రం ‘కూటమి’కి వెన్నుపోటు పొడవడానికి సిద్ధం అవుతున్నారనే భావన రాష్ట్ర ప్రజల్లో, కార్యకర్తల్లో, నాయకుల్లో కలుగుతోంది. బిజెపి కూటమిలో లేనప్పుడు మంచి ఊపుమీద ఉన్న ‘టిడిపి,జనసేన’ల్లో ఇప్పుడు నిర్లిప్తత కనిపిస్తోంది. మొత్తం మీద ‘ప్రధాని’ తన దత్తపుత్రుడి గెలుపుకోసం ‘కూటమి’ని కకావికలం చేస్తున్నారనిపిస్తోంది.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ