లేటెస్ట్

‘దమ్మాల‌పాటి’పై మరో కేసు...!

మాజీ అడ్వకేట్‌ జనరల్‌ ‘దమ్మాల‌పాటి శ్రీనివాస్‌’పై పోలీసులు మరో కేసు నమోదు చేసినట్లు ఓ ఆంగ్ల పత్రిక వార్తను ప్రచురించింది. ‘అమరావతి’ భూముల‌ వ్యవహారంలో ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌కు పాల్ప‌డినట్లు ఆయనపై ప్రభుత్వం ఇంతకు ముందు కేసులు నమోదు చేసింది. అయితే ఈ కేసుల్లో ఆయనను అరెస్టు చేయవద్దని హైకోర్టు స్టే ఇచ్చింది. ఇది ఇలా ఉంటే ‘దమ్మాల‌పాటి శ్రీనివాస్‌’ ఆయన కుటుంబం కల‌సి తనను మోసం చేశారని రిటైర్డ్‌ లెక్చరర్‌ ‘కోడె రాజారామ్మోహన్‌రావు’ మంగళగిరి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా కృష్ణాయపాలెంలో లేక్‌వ్యూ పేరుతో అపార్ట్‌మెంట్‌ నిర్మిస్తున్నారని తన వద్ద రెండు ప్లాట్లకు డబ్బు తీసుకుని ఒక ప్లాట్‌ మాత్రమే రిజిస్టర్‌ చేసి రెండో ప్లాట్‌ రిజిస్టర్‌ చేయకుండా మోసం చేశాడని ఆయన పోలీసుకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తాము నిర్మించబోయే ‘లేక్‌ వ్యూ అపార్ట్‌మెంట్‌’ పక్కనే స్టార్‌ హోటల్స్‌ వస్తున్నాయని ‘దమ్మాల‌పాటి’ కుటుంబం నిర్వహిస్తున్న హౌజింగ్‌ ప్రాజెక్టు ప్రైవేట్‌ లిమిటెడ్‌ నిర్వహకులు చెప్పి మోసం చేశారని, ఇది నేరపూరిత కుట్ర, విశ్వాసఘాతుకం కిందకు వస్తుందని ఆయన పేర్కొన్నారు.  తన వద్ద నుంచి మొదట రూ.50ల‌క్షలు తీసుకున్నారని, తరువాత తన కుమార్తె ఎన్‌ఆర్‌ఐ అకౌంట్‌ నుంచి మరో రూ.75ల‌క్షలు ట్రాన్స్‌ఫర్‌ చేశానని, డబ్బు తీసుకున్న తరువాత రెండో ప్లాట్‌ రిజిస్టర్‌ చేయకుండా తాత్సారం చేస్తున్నారని, అడిగితే జైల్లో పెట్టిస్తామని బెదిరిస్తున్నారని మాజీ అడ్వకేట్‌ జనరల్‌ ‘దమ్మాల‌పాటి’ అండ చూసుకుని వారి కుటుంబం తనను వేధిస్తోందని రామ్మోహన్‌రావు ఫిర్యాదు చేశారు. 

కాగా ‘దమ్మాల‌పాటి’ కుటుంబంపై ఫిర్యాదు చేసిన ‘కోడె రాజారామ్మోహన్‌రావు’ టిడిపి సానుభూతిపరుడు కావడం విశేషం. ఆయన సోషల్‌మీడియాలో టిడిపికి మద్దతుగా పలు పోస్టులు పెడుతుంటారు. ‘అమరావతి’ రాష్ట్రానికి రాజధానిగా ఉండాల‌ని, మూడు రాజధానులు వద్దని ఆయన పదే పదే డిమాండ్ చేస్తుంటారు. టిడిపికి మద్దతు ఇచ్చే...వ్యక్తే..టిడిపి ప్రభుత్వంలో అడ్వకేట్‌జనరల్‌గా పనిచేసిన వ్యక్తి కుటుంబంపై ఫిర్యాదు చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. రాజధాని అమరావతిలో ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ జరిగిందని, అనేక అక్రమాలు జరిగాయని అధికార వైకాపా ప్రభుత్వం చెబుతోన్న పరిస్థితుల్లో తాజాగా టిడిపిని సమర్థించే వారే ఇటువంటి ఫిర్యాదు చేస్తోండడంతో టిడిపి మరింత ఇరకాటంలో పడే అవకాశం ఉంది. ప్రస్తుత కేసులో స్టార్‌హోటల్స్‌ వస్తున్నాయని అప్పట్లో అడ్వకేట్‌ జనరల్‌గా ఉన్న ‘దమ్మాల‌పాటి’ ముందుగా పేర్కొని ఎన్‌ఆర్‌ఐతో వ్యాపారం చేశారని, ఇదే ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌కు నిదర్శనమని అధికారపార్టీ చెల‌రేగిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

(379)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ