లేటెస్ట్

‘నెట్టెం’ రెండో ఇన్నింగ్స్‌లో రాణిస్తారా...!?

మాజీ మంత్రి ‘నెట్టెం రఘురాం’ను విజయవాడ పార్లమెంటరీ పార్టీ ఇన్‌ఛార్జిగా ప్రకటించి ‘చంద్రబాబు’ అందరినీ ఆశ్చర్యపోయారు. ప్రస్తుత యువతలో  ‘నెట్టెం’ గురించి అతి కొద్ది మందికే తెలుసు. కృష్ణా జిల్లా ‘జగ్గయ్యపేట’ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రఘురాం వరుసగా మూడుసార్లు గెలిచి ‘చంద్రబాబు’ మంత్రి వర్గంలో ఎక్సైజ్‌శాఖ మంత్రిగా పనిచేశారు. 1985,1989,1994లో వరుసగా ‘జగ్గయ్యపేట’ నుంచి గెలుపొంది హ్యాట్రిక్‌ సాధించారు. 1985లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ‘ముక్కపాటి వెంకటేశ్వరరావు’పై విజయం సాధించిన ఆయన 1989లో ‘వసంత నాగేశ్వరరావు’పై గెలుపొందారు. తరువాత 1994లో మళ్లీ ‘ముక్కపాటి’పై ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఆయన ‘ముక్కపాటి’పై దాదాపు 20వేల‌ మెజార్టీతో గెలిచారు. ఎన్టీఆర్‌పై ‘చంద్రబాబు’ తిరుగుబాటు తరువాత ‘నెట్టెం’కు ‘చంద్రబాబు’మంత్రివర్గంలో స్థానం కల్పించారు. అయితే మద్యం స్కామ్‌లో ఇరుక్కుని ‘నెట్టెం’ మంత్రి పదవిని కోల్పోయారు. మంత్రి పదవిని కోల్పోయిన తరువాత ఆయన 1999లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి,బిజెపి గాలి వీచినా..‘నెట్టెం’ ఆ ఎన్నిక‌ల్లో గెలుపొందలేకపోయారు. 

2004లో మరోసారి పోటీ చేసినా ఆయన విజయం సాధించలేకపోయారు. ఆ తరువాత క్రియాశీల‌క రాజకీయాల‌కు దూరంగా ఉంటూ వస్తున్నారు. 2009,2014,2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన అంతగా కల్పించుకోలేదు. ఈ పదిహేను సంవత్సరాల్లో ఆయన పార్టీ పదవుల్లో కానీ, అధికార పదవుల్లో కానీ కనిపించలేదు. కృష్ణా జిల్లాల్లో ‘నెట్టెం’ పేరు దాదాపు కనుమరుగు అయింది. అయితే ఇప్పుడు హఠాత్తుగా ‘చంద్రబాబు’ ‘నెట్టెం’ను ‘విజయవాడ’ పార్లమెంట్‌కు బాధ్యునిగా నియమించడం పార్టీలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఎప్పటి ‘రఘురాం’...? ఇప్పుడు పదవేంటి..? అంటూ కొందరు నాయకులు ఆశ్చర్యపోతున్నారు. ఒకప్పుడు టిడిపికి కంచుకోటగా ఉన్న కృష్ణా మెట్ట ప్రాంతంలో ఇటీవల‌ తగిలిన ఎదురుదెబ్బల‌ నుంచి తేరుకుని..మళ్లీ పార్టీని పట్టాలు ఎక్కించడం ‘నెట్టెం’ వ‌ల్ల‌ అవుతుందా..? పదిహేను సంవత్సరాలు క్రియాశీల‌క రాజకీయాల‌కు దూరంగా ఉన్న వ్యక్తి...దూకుడైన రాజకీయాలు సాగుతున్న ఈ రోజుల్లో నెట్టుకు వస్తారా..? అనే ప్రశ్న పలువురు కార్యకర్తల‌ నుంచి వస్తున్నాయి. ఐదుసార్లు ‘జగ్గయ్యపేట’ నుంచి పోటీ చేసి మూడుసార్లు గెలిచి రెండుసార్లు ఓడిపోయిన ‘నెట్టం’ మెట్ట ప్రాంతంలో, విజయవాడ సిటీలో ఎంత వరకు పార్టీని క్రియాశీల‌కంగా ఉంచుతారో చూడాలి. కేంద్రపార్టీ కార్యాయంలో క్రియాశీల‌కంగా పనిచేసే ‘టి.డి.జనార్ధన్‌’కు దగ్గర బంధువే ‘నెట్టెంరఘురామ్‌’. ఆయన వల్లే ‘నెట్టెం’కు పదవి వచ్చిందనే మాట వినిపిస్తోంది. సరే ఎవరి వ‌ల్ల‌ వచ్చినా..పార్టీ కార్యకర్తల్లో, నాయకుల్లో చైతన్యం కల్గించి పార్టీని ముందుకు తీసుకెళితేనే ‘నెట్టెం’ రెండో ఇన్సింగ్స్‌ సాఫీగా సాగుతుంది. లేదంటే మరోసారి తెరవెనుక్కు వెళ్లిపోవాల్సి వస్తుంది.

(262)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ