లేటెస్ట్

కేంద్ర క్యాబినెట్‌లోకి ‘వైకాపా’...!

చాలా రోజుల‌ నుంచి జరుగుతున్న చర్చే. ఎన్‌డిఎ మంత్రివర్గంలోకి వైకాపా చేరుతుందని అటు ఢిల్లీ వర్గాల్లోనూ, ఇటు రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ జోరుగా ప్రచారం జరుగుతోంది. దీన్ని ఎవరూ ఖండించేవారు లేరు..సమర్థించేవారు లేరు. వైకాపా నేతల‌ను ఈ విషయం గురించి అడిగినా వారిదీ మూగనోమే. ఎటూ తిరిగి..రాబోయే కొద్ది రోజుల్లో కేంద్ర మంత్రివర్గంలోకి వైకాపాకు చెందిన ఎంపీలు చేరతారని ప్రస్తుత పరిస్థితుల‌ను అంచనా వేసి కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతోన్న మాట. ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ఇటీవ ఢిల్లీ పర్యటన తరువాత..ఈ ప్రచారానికి మరింత ఊపు వచ్చింది. ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిసినప్పుడు ఆయన వైకాపాను మంత్రివర్గంలోకి ఆహ్వానించారని తెలుస్తోంది. ఈ సందర్భంగా ‘జగన్‌’ పలు షరతులు విధించారని, దీనిపై ప్రధాని మోడీని కలిసి వివరణ తీసుకున్న తరువాత కేంద్రమంత్రి వర్గంలో చేరడంపై ‘జగన్‌’ తుది నిర్ణయం తీసుకోబోతున్నారని సమాచారం. 

వచ్చే వారంలో మళ్లీ ముఖ్యమంత్రి ‘జగన్‌’ ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారని, ఈ పర్యటనలో ఆయన ప్రధాని మోడీని కల‌వబోతున్నారని, ఈ సందర్భంగా వారిద్దరూ మనసు విప్పి మాట్లాడుకుంటారని సమాచారం. కేంద్ర మంత్రివర్గంలో చేరితే రాష్ట్రంలో తనకు వచ్చే ఇబ్బందుల‌ గురించి ‘జగన్‌’ మోడీకి వివరిస్తారని అంటున్నారు. ముఖ్యంగా ప్రత్యేకహోదా విషయం తేల‌కుండా కేంద్రమంత్రివర్గంలో చేరితే ప్రతిపక్ష తెలుగుదేశం దాన్ని ఆయుధంగా మల‌చుకుంటుందని, దీనిపై స్పష్టత రావాల్సిన అవసరం ఉందని ‘జగన్‌’ భావిస్తున్నారట. అయితే ప్రత్యేకహోదా ముగిసిపోయిన అంశం కాబట్టి దాని స్థానంలో గతంలో ప్రకటించినట్లు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని, దానితో సర్దుకోవాని కేంద్ర బిజెపి పెద్దలు ‘జగన్‌’కు నచ్చచెప్పబోతున్నారట. కాగా..రాష్ట్రానికి సంబంధించిన నిధుల‌ విడుదల‌లో ప్రత్యేక శ్రద్ధ చూపుతామని హామీ ఇవ్వబోతున్నారట. 

ఇక రాజకీయంగా ‘జగన్‌’ కోరిన కోర్కెల‌ను నెరవేర్చడానికి ప్రధాని మోడీ హామీ ఇస్తారంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు ‘లోకేష్‌’లు చేసిన అవినీతిపై విచారణ జరిపించానని, వారిద్దరినీ అరెస్టు చేయడానికి అనుమతి ఇవ్వాల‌ని ‘జగన్‌’ కోరారని ప్రచారం జరుగుతోంది. దీనికి బిజెపి పెద్దలు ఓకే అంటే ఎన్‌డిఎలో చేరడానికి అభ్యంతరం లేదని ‘జగన్‌’ చెప్పారంటున్నారు. కాగా..ప్రస్తుతం ఎన్‌డిఎలో చెప్పుకోదగిన పార్టీ ఏదీ లేనందున ‘వైకాపా’ తమ వైపు ఉంటే బాగుటుందనే ఆలోచన బిజెపి పెద్దల‌కు ఉందని అందు వ‌ల్ల‌ ‘జగన్‌’ కోరిన కోర్కొల‌ను నెరవేరుస్తారంటున్నారు. మరో వైపు ‘విజయసాయిరెడ్డి, నందిగం సురేష్‌’లు తమకు కేంద్ర మంత్రి పదవులు వస్తాయని ఆశిస్తున్నారట. వీరు కాకుండా బీసీ వర్గానికి చెందిన వారు కూడా తమకు అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు. మొత్తం మీద ‘జగన్‌’ ప్రధానితో సమావేశమైన తరువాత మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. కాగా..‘జగన్‌’ను ప్రధాని మోడీ పిలిపిస్తున్నారని, రాష్ట్రంలో న్యాయవ్యవస్థకు, జగన్‌ ప్రభుత్వానికి జరుగుతున్న పోరు పతాకస్థాయికి చేరిన నేపథ్యంలో దీని గురించి హెచ్చరించేందుకే ‘మోడీ’ ‘జగన్‌’ను పిలిపిస్తున్నారని ఆయన వ్యతిరేకులు ప్రచారం చేస్తున్నారు. మరి దీనిలో నిజమెంతో త్వరలోనే తెలుస్తుంది. 

(534)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ