లేటెస్ట్

దళితపక్షపాతి ‘రవిచంద్ర’పై బ‌దిలీ వేటా...!?

ఆయనో  సీనియర్‌ ఐపఎస్‌ అధికారి. వివాదరహితుడు, నిజాయితీపరుడు, దళితులు,వెనుకబడిన వర్గాల‌ శ్రేయస్సు కోసం పనిచేస్తారనే పేరు తెచ్చుకున్న అధికారి. తనకు ఉన్న అధికార పరిధిలో వారి సమస్యల‌ను పరిష్కరించేందుకు, వారి అభివృద్ధి కోసం నిజాయితీగా, నిష్కరగా పనిచేస్తుంటారు. అటువంటి అధికారిని రాత్రికి రాత్రికి ప్రభుత్వం బదిలీ చేసింది. దళితులు, బడుగుల‌ కోసమే తాము అధికారంలోకి వచ్చామని, వారి శ్రేయస్సే తమ ల‌క్ష్యమని చెప్పే ప్రభుత్వం..వారి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న ఆ అధికారిపై అవమానకరంగా బదిలీ వేటు వేసింది. ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తోన్న ఆ అధికారి చేసిన తప్పేమిటి..? రాత్రికి రాత్రి బదిలీ చేయాల్సినంత తప్పు ఆయన చేశారా..? దళితు ఆత్మగౌరవం కోసం, వారి సమస్యల‌ పరిష్కారం కోసం ఇచ్చిన ఉత్తర్వులే ఆయన బదిలీకి కారణమని ప్రచారం జరుగుతోంది. దళితుడు కాకపోయినా వారి కోసం తపన పడే సీనియర్‌ ఐఎఎస్‌ ‘రవిచంద్ర’పై వేటు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. 

‘రవిచంద్ర’ చేసిన తప్పేమిటి...?

సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శిగా ‘ముద్దాడ రవిచంద్ర’ మంచి పనితీరును కనపరుస్తున్నారు.  ఇటీవల కాలంలో ఆయన 627352/సివిపిఒఎ/2020 తేది 10.10.2020 ఎస్సీ ఎస్టీ బాధితుల‌కు ఉపశమనం మరియు పునరావాస చర్యల‌ చెల్లింపు కోసం, ఎస్సీ, ఎస్టీ బాధితుల‌కు, డిపెండెంట్లకు ఉపాధి కల్పించడంలో చాలా ఆల‌స్యం అవుతున్న ప్రక్రియను వేగవంతం చేయడానికి మరియు అత్యాచార బాధితుల‌కు ఉపశమనం చెల్లించడం కోసం గౌరవ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు వెంటనే అమలు చేయాల‌ని ఉత్తర్వులు జారీ చేశారు.  ఈ ఉత్తర్వులే ‘రవిచంద్ర’పై వేటుకు కారణమనే ప్రచారం జరుగుతోంది. దళితుల‌ ఓట్లతో రాజ్యాధికారానికి వచ్చిన వైకాపా ప్రభుత్వం..అదే దళితుల‌కు మేులు జరిగే ఉత్తర్వులు ఇచ్చిన ‘రవిచంద్ర’పై వేటు వేస్తుందా...? అనే ప్రశ్న పలు దళిత సంఘాలు, ఇతర కుల‌ సంఘాల‌ నుంచి వ్యక్తం అవుతోంది. ఆయన ఇచ్చిన ఉత్తర్వుల వల్ల‌ ప్రభుత్వానికి మేలు జరుగుతుందే కాని చెడు జరగదు. కానీ..ఓ సీనియర్‌ దళిత ఐఎఎస్‌ అధికారి చెప్పిన చెప్పుడు మాటలు విని ‘రవిచంద్ర’పై వేటు వేశారనే మాట ఆ శాఖ వర్గాల్లో వినిపిస్తోంది. నిజాయితీగా, దళితుల‌ కోసం కష్టపడే అధికారిని ఇలా అవమానకరంగా బదిలీ చేయడం సరికాదని ఆయా వర్గాలు అంటున్నాయి. సాంఘిక సంక్షేమ శాఖలో ఎస్‌.ఆర్‌. శంకరన్‌, టి.ముని వెంకటప్ప లాంటి గొప్ప సేవ చేసే మనస్తత్వం కలిగిన రవిచంద్రను బదిలీ చేయడం సాంఘిక సంక్షేమానికి అడ్డుకట్టవంటదనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది.  గత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం, ప్రస్తుత సిఎస్ నీలం సాహ్ని ఎస్సీ, ఎస్టీల‌కు ప్రమోషన్స్‌లో రిజర్వేషన్ల ఫైల్స్ విషయంలో చేసిన దళిత ద్రోహ చర్యల‌ను ఆ శాఖమంత్రి పినిపే విశ్వరూప్‌, సెక్రటరీ రవిచంద్రలు అడ్డుపడి అడ్డుకుని ద‌ళితులకు మేలు చేశారు. ఇలా ద‌ళితుల‌కు మేలు చేస్తోన్న    అధికారిని ఎటువంటి కారణం లేకుండా బదిలీ చేయడం ప్రభుత్వ ప్రతిష్టకు మ‌చ్చ‌నే మాట సర్వత్రా వినిపిస్తోంది. ప్రభుత్వ ల‌క్ష్యాల‌కు అనుగుణంగా దళితులు, వెనుకబడిన వర్గాల‌ సంక్షేమం కోసం ‘రవిచంద్ర’ కృషి చేస్తుంటే ఆ శాఖ మంత్రికి కూడా తెలియకుండా ఆకస్మికంగా ఆయనను జిఎడికి సరెండ్‌ర్‌ చేయడంపై దళిత సంఘాలు, కుల‌ సంఘాలు ప్రభుత్వంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డికి ఆయా సంఘాలు లేఖలు రాస్తున్నాయి. 

సీనియర్‌ అధికారి చెప్పుడు మాటల‌ వల్లేనా..?

‘రవిచంద్ర’ను ఆకస్మికంగా బదిలీ చేయడం వెనుక దళిత వర్గానికి చెందిన సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి పాత్ర ఉందనే మాట సచివాల‌య వర్గాల‌ నుంచి వస్తోంది. గత టిడిపి ప్రభుత్వం హయాంలో దళితుల‌కు చెందిన శాఖలో పనిచేసిన ఆ అధికారి అవినీతికి పాల్ప‌డ్డార‌ని, నాటి అవినీతి వ్యవహారాల‌ను ‘రవిచంద్ర’ తవ్వి తీస్తున్నారనే అనుమానంతో ఆ సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి ‘రవిచంద్ర’ బదిలీ కోసం పావులు కదిపారంటున్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో తనకు ఉన్న పలుకుబడిని ఉపయోగించి ‘రవిచంద్ర’పై బదిలీ వేటు వేయించారనే ప్రచారం సచివాల‌యంలో జరుగుతోంది. దళితులు, వెనుకబడిన వర్గాల‌ కోసం దళితేర అధికారి విశేషంగా పనిచేస్తోన్న సమయంలో దళిత వర్గానికి చెందిన అధికారే ఆయనను అడ్డుకోవడం, బదిలీ చేయించడం దళిత వర్గాల్లోనూ చర్చనీయాంశం అవుతోంది. మొత్తం మీద..దళితులు, వెనుకబడిన వర్గాల‌ అభివృద్ధికి కృషి చేస్తోన్న ‘రవిచంద్ర’పై వేటు అధికార, ఉద్యోగవర్గాల్లో సంచల‌నం సృష్టిస్తోంది. ప్రభుత్వం ఇప్ప‌టికైనా  ప్రతిష్టకు పోకుండా చేసిన పొరపాటును దిద్దుకుని ర‌విచంద్ర‌ను తిరిగి అదేశాఖ కార్య‌ద‌ర్శిగా నియ‌మిస్తే బాగుంటుంద‌నే అభిప్రాయం పలు వర్గాల్లో వ్యక్తం అవుతోంది.

(628)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ