కేంద్ర సర్వీసులకు ‘రవిచంద్ర’...!

ఆకస్మాత్తుగా సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి పదవి నుంచి తొలగింపబడ్డ సీనియర్ ఐఎఎస్ అధికారి ‘రవిచంద్ర’ కేంద్ర సర్వీసుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దళితులు, వెనుకబడిన వర్గాల శ్రేయస్సు కోసం నిజాయితీగా, క్రమశిక్షణతో పనిచేసిన తనపై వేటు వేయడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారనే ప్రచారం జరుగుతోంది. దళితుల సంక్షేమ కోసం, శ్రేయస్సు కోసం ఒక సర్కులర్ ఇస్తే..దాన్ని పట్టుకుని..ఆయనను బదిలీ చేశారని, నిజాయితీగా, కష్టపడి పనిచేస్తున్న రవిచంద్ర వంటి వారిని గుర్తించకపోవడం సరికాదని, పనిచేసే వారిని గుర్తించకపోయినా..అవమానించాల్సిన అవసరం లేదనే మాట ‘రవిచంద్ర’ సన్నిహితుల నుంచి వస్తోంది. ఎవరో చెప్పిన మాటలు విని రవిపై బదిలీ వేటు వేశారని, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి తెలిసి ఈ పని జరగలేదని ఆ వర్గాలు అంటున్నాయి. దళితు, బడుగు, పేదల కోసం పనిచేసే ‘రవిచంద్ర’ వంటి అధికారిని బదిలీ చేయడం సరికాదని ఇప్పటికే దళిత, కులవివక్షపోరాట సంఘాలు ముఖ్యమంత్రి ‘జగన్మోహన్రెడ్డి’కి లేఖ రాశాయి. అయితే దీనిపై ఆయన నుంచి స్పందన వచ్చిందో లేదో తెలియదు కానీ..ఇప్పటి వరకు ‘రవిచంద్ర’కు పోస్టింగ్ ఇవ్వలేదు. ఇటీవలే తీవ్ర అనారోగ్యానికి గురైన ‘రవిచంద్ర’ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆలోచన ఏమిటో తెలియదు కానీ..తన సేవలు ఇక్కడ అవసరం లేకపోతే కేంద్ర సర్వీసులకు వెళ్లే ఉద్దేశ్యంతో ఉన్నారని సచివాయంలో ప్రచారం జరుగుతోంది. కొందరు ఏకపక్షంగా తనపై దాడి చేస్తున్నారని, ఒక దళిత ఐఎఎస్ అధికారి తనకు ఉన్న పలుకుబడిని ఉపయోగించి తనను ఇబ్బందులు పెడుతున్నారని, ఇక్కడ ఇబ్బంది పడే దాని కన్నా..కేంద్ర సర్వీసుకు వెళితే బాగుంటుందనే ఆలోచన ఆయనలో ఉందంటున్నారు. మొత్తం మీద కష్టపడి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే ‘రవిచంద్ర’ లాంటి అధికారులకు అన్యాయం జరిగిందని, దీన్ని సరిదిద్దాలని కొందరు ఐఎఎస్ అధికారులు ప్రైవేట్ సంభాషణల్లో అంటున్నా...ముఖ్యమంత్రి జగన్ ఉద్దేశ్యం ఏమిటో తెలియక మౌనంగా ఉంటున్నారు.