జర్నలిస్టుల సత్తా చూపిస్తాం:ఐవి సుబ్బారావు

రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలు నిబంధనలతో జర్నలిస్టులను అవమానిస్తుందని, వివిధ నిబంధనలతో జర్నలిస్టులకు అక్రిడిటేషన్స్లు ఇవ్వకుండా వేధిస్తుందని, ప్రభుత్వ వైఖరిపై తాము సమరశంఖాన్ని పూరిస్తున్నామని, ప్రభుత్వానికి జర్నలిస్టుల సత్తా ఏమిటో చూపిస్తామని ఎపిడబ్ల్యుజె రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వి.సుబ్బారావు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నూతన సంవత్సరం మొదటి రోజే ప్రభుత్వంపై సమరశంఖం పూరిస్తున్నామని, జర్నలిస్టుల సత్తా ఏమిటో త్వరలోనే ప్రభుత్వానికి చూపిస్తామని ఆయన సవాల్ చేశారు. సమాచారశాఖ మంత్రి, సమాచారశాఖ కమీషనర్‌కు దమ్ముంటే జిల్లాల్లో తిరగాలని, తామెంటో వారికి చూపిస్తామని సవాల్ చేశారు. జర్నలిస్టుల ఇన్వెస్టిగేషన్ సత్తా ఏమిటో చూపిస్తామని, ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని వెలికి తీస్తామని అన్నారు. తాము తలచుకుంటే సమాచారశాఖ మంత్రి మచిలీపట్నం ఎమ్మెల్యేగానే మిగులుతారని, మంత్రి పదవి పోతుందని హెచ్చరించారు. కేసులున్న రాజకీయ నాయకులు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా పనిచేయడం లేదా..? జర్నలిస్టుల్లో ఒకరోఇద్దరో చెడ్డవాళ్లు ఉంటే వ్యవస్థ మొత్తం మీద కత్తికడతారా..అని ఆయన ప్రశ్నించారు. జర్నలిస్టులు శాశ్వితమని, ప్రభుత్వాలు అశాశ్వితాలని, ప్రభుత్వాలు వస్తుంటాయిపోతుంటాయని, జర్నలిస్టులతో పెట్టుకున్న ప్రభుత్వాలు మరిన్ని రోజులు నిలబడలేవని సుబ్బారావు హెచ్చరించారు. అక్రిడిటేషన్ లేకపోతే జర్నలిస్టులు కాకుండా పోతారా...? అక్రిడిటేషన్స్లు ఉన్నా లేకున్నా జర్నలిస్టులు జర్నలిస్టులేనని ఆయన అన్నారు.