లేటెస్ట్

'ఆంధ్రా తేజస్వి..లోకేష్‌'...!

ఆయన ఒకప్పుడు అధికారంలో ఉన్నప్పుడు...అందరూ అవమానించినవాళ్లే. తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని..ఎమ్మెల్సీ, మంత్రి పదవి సాధించారని ఎద్దేవా చేశారు. వ్యంగ్యవ్యాఖ్యలు చేస్తూ...ఆయనను ఘోరంగా అవమానించారు. 'చంద్రబాబు' మంత్రివర్గంలో పనిమంతుడిగా పేరు తెచ్చుకున్నా, తన మంత్రిత్వశాఖకు ఎన్నో అవార్డులు తెచ్చి పెట్టినా..ఆయన పనితీరు ఎక్కడా చర్చనీయాంశం కాలేదు. ఆయన పేరు చెబితే పప్పుసుద్ద..అంటూ వెక్కిరింపులు, అవహేళనలతో అవమానించారు. అయితే ఆ అవమానాలను, హేళనలను, ఆయన ఎప్పుడూ పట్టించుకోలేదు. తన పనితాను చేసుకుంటూ ముందుకు వెళ్లారు. ఎన్నికల్లో దురదృష్టవశాత్తు ఓడిపోయారు..అంతే ఈ అవమానించేవారు, అవహేళన చేసేవారు మరింత రెచ్చిపోయారు. అయినా..ఆయన కుంగిపోలేదు..ముడుచుకుపోలేదు..తనదైన రీతిలో తనలోని తప్పులను,లోపాలను సవరించుకుని ప్రజాక్షేత్రంలోకి దిగిపోయారు. ఇప్పుడు సమస్య ఎక్కడ ఉంటే ఆయన అక్కడ ఉంటున్నారు. చిన్న వయస్సులోనే ప్రజల్లో తిరుగుతూ ఆంధ్రా తేజస్వియాదవ్‌గా పేరు తెచ్చుకుంటున్న ఆయన ఎవరో కాదు...ఆయనే 'చంద్రబాబునాయుడు' కుమారుడు 'నారా లోకేష్‌'. 

ప్రస్తుతం రాష్ట్రంలో ఏ సమస్య ఉన్నా 'నారా లోకేష్‌' ముందుంటున్నారు. ఎక్కడ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో..అక్కడికి వాలిపోతున్నారు. ఇది ప్రజల సమస్యా, లేక వ్యక్తి సమస్యా..అనేది లేకుండా..ఎవరు..పిలిస్తే..వారి ముందు వాలిపోతున్నారు. ఆయన తీరు చూసి గతంలో విమర్శించి, అవహేళన చేసినవారు ఇప్పుడు నోరెళ్లబెడుతున్నారు. ఇంతలో ఈయనలో ఇంత మార్పు ఏమిటి..? ఈ దూకుడు ఏమిటి..అంటూ ఆశ్చర్యపోతున్నారు. ప్రసంగాలలో స్పష్టత, ప్రజలలో కలసిపోవడం ఆయనను రాష్ట్రంలో మిగతా నాయకులకు భిన్నంగా చూపెడుతోంది. ఒక మాజీ ముఖ్యమంత్రికి మనవడు, ఒక మాజీ ముఖ్యమంత్రికి తనయుడు, ఒక సినిమా కుటుంబానికి, ఒక కేంద్ర మాజీ మంత్రికి బంధువైన ఈ యువ నేత ఇప్పుడు వార్తల్లోని వ్యక్తి అయ్యారు. గత సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయంతోపాటు, తాను పోటీ చేసి ఓడిపోయినా..ఆయనలో ఆత్మస్థైర్యం చెక్కుచెదరలేదు.

 ప్రజా సమస్యలపై తిరుగులేని పోరాటం ఆయనను భిన్నమైన నాయకుడిగా చూపుతోంది. అదే సమయంలో ఘోరంగా పరాజయం పాలయి, ఇంట్లోనుంచి బయటకు రాలేకపోతున్న నాయకులకు, కార్యకర్తలకు భరోసానిస్తున్నారు. భయపడుతున్న కార్యకర్తలు, నాయకులకు తానున్నానని, అధికారపార్టీ చేసే ఆగడాలను, హత్యలను తాను అడ్డుకుంటానని, కార్యకర్తలకు ఏమైనా అయితే  వారి కుటుంబాలను తాను ఆదుకుంటానని, ఏమైనా పోరాటంతోనే ముందుకు పోదామని కార్యకర్తలను, నాయకులను కార్యాన్మోఖులను చేస్తున్నారు. 'లోకేష్‌' అభయంతో ఇప్పుడిప్పుడే నాయకులు, కార్యకర్తలు పోరాటాలకు దిగుతున్నారు. ఒకప్పుడు అవహేళనలు, అవమానాలు ఎదుర్కొన్న ఈ యువనేతను ఇప్పుడు బీహార్‌ నేత 'తేజస్వీయాదవ్‌'తో పోలుస్తున్నారు. మొన్నటి బీహార్‌ ఎన్నికల్లో ఎన్‌డిఎ పెద్దలు ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్‌షా, బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ మొదలగు పెద్దలు, బిజెపి రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా కూడగట్టుకుని యువకుడైన 'తేజస్వీ'పైకి దండెత్తినా..ఆయన వారికి తలొగ్గక ఆఖరి దాకా పోరాడారు. ఇప్పుడు 'ఆంధ్రా'లో వైకాపా, బిజెపి, జనసేన తదితరపార్టీలన్నీ 'లోకేష్‌'పై దండెత్తుతున్నా...ఆయన మొక్కవోని పోరాటంతో ముందుకు దూకుతూ పార్టీలో స్థైరాన్ని నింపుతున్నారు. మొత్తం మీద...'లోకేష్‌' అధికారంలో ఉన్నప్పుడు కనిపించిన లోపాలు..ప్రతిపక్షంలోకి వచ్చాక కనిపించకపోవడం విశేషం. 

(446)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ