లేటెస్ట్

ఒకే ఒక్కడు 'అవినాష్‌'

సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి ఘోర ఓటమి తరువాత కొంత మంది ఎన్నికైన శాసనసభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు అధికార వైకాపాలో చేరారు. వీరిలో  'చీరాల' ఎమ్మెల్యే 'కరణం బలరాం, గుంటూరు-2 ఎమ్మెల్యే 'గిరిధర్‌', గన్నవరం ఎమ్మెల్యే 'వల్లభనేని వంశీ', విశాఖకు చెందిన 'వాసుపల్లి గణేష్‌కుమార్‌'లు ఉన్నారు. వీరు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పలువురు మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు అధికార పార్టీలో చేరారు. ప్రతిపక్షం నుంచి అధికారపార్టీలోకి ఫిరాయించిన వారిలో చాలా మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందరి కంటే ముందుగా టిడిపి నుంచి వైకాపాలో చేరిన గన్నవరం ఎమ్మెల్యే 'వల్లననేని వంశీమోహన్‌' తీవ్ర కష్టాలను చవిచూస్తున్నారు. తనపై పోటీ చేసి ఓడిపోయిన 'యార్లగడ్డ వెంకట్రావు'తో పాటు, గతంలో పోటీ చేసి ఓడిపోయిన 'దుట్టా రామచంద్రరావు' వర్గాల నుంచి ఆయన అడుగడుగునా ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. నియోజకవర్గంలో ప్రతి రోజూ ఎమ్మెల్యే వంశీకి వీరికి మధ్య ప్రత్యక్ష యుద్ధం నడుస్తోంది. స్వయంగా ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి కలుగు చేసుకుని రాజీ చేసినా మళ్లీ పరిస్థితి మొదటికే వస్తోంది. ఎంత ప్రయత్నించినా 'వంశీ'కి పార్టీలో పట్టుదొరకడం లేదు. 'యార్లగడ్డ, రామచంద్రరావు' వర్గాలు 'వంశీ'కి చుక్కలు చూపిస్తున్నాయి. మరో ఎమ్మెల్యే 'కరణం బలరాం' పరిస్థితీ అంతే. తనపై ఓడిపోయిన 'ఆమంచి కృష్ణమోహన్‌', టిడిపి నుంచి వైకాపాలో చేరిన మాజీ ఎమ్మెల్సీ 'పోతుల సునీత' వర్గాలు ఆయనను వెంటాడుతున్నాయి. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే 'ఆమంచి' వర్గానికి 'కరణం' వర్గానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. 

విశాఖలో 'వాసుపల్లి'దీ అదే పరిస్థితి. కాగా గుంటూరు-2 ఎమ్మెల్యే 'గిరిధర్‌' నియోజకవర్గ పెత్తనం మొత్తం వైకాపా నాయకులకు అప్పచెప్పి తన వ్యాపారాలను తాను చేసుకుంటున్నారు. టిడిపి నుంచి వైకాపాలో చేరిన ఎమ్మెల్యేలు ఇంతగా ఇబ్బందులు పడుతుంటే గత ఎన్నికల్లో 'గుడివాడ' నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి 'కొడాలి నాని' చేతిలో ఓడిపోయిన 'దేవినేని అవినాష్‌' తరువాత అదే పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వెంటనే ఆయనకు 'విజయవాడ తూర్పు' నియోజకవర్గ ఇన్‌ఛార్జి పదవి లభించింది. నియోజకవర్గంలోని వైకాపా నాయకుల నుంచి ఆయనకు పెద్దగా ఇబ్బందులు ఎదురుకావడం లేదు. నియోజకవర్గం మొత్తం ఆయన కనుసన్నల్లోనే నడుస్తోంది. వైకాపాకు చెందిన ద్వితీయశ్రేణి నాయకులు, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన 'బొప్పన రవికుమార్‌', నియోజకవర్గం నుంచి టిక్కెట్‌ ఆశించి భంగపడ్డ 'యలమంచలి రవి' ఆయనకు సహకరించకపోయినా ఎటువంటి చికాకులు సృష్టించడం లేదు. మొత్తం మీద నియోజకవర్గంలో 'దేవినేని అవినాష్‌'కు ఎదురులేకుండా పోయింది. టిడిపి నుంచి పలువురు నాయకులు వైకాపాలో చేరినా..ఇలా పార్టీలో, ప్రభుత్వంలో సౌకర్యంగా ఉంది మాత్రం 'అవినాష్‌' ఒక్కడే. వాస్తవానికి ఆయనకు కూడా ఇక్కట్లు ఎదురయ్యేవి కానీ, విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైకాపాకు బలమైన నాయకత్వం లేదు. బలమైన అభ్యర్థి లేకపోయినా, ఆర్థికంగా 'అవినాష్‌' స్థాయిలో ఉన్నవారు లేరు. దాంతో 'అవినాష్‌' పరిస్థితి మెరుగ్గా కనిపిస్తోంది.  

(276)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ