లేటెస్ట్

బిజెపిలోకి మక్కెన, వెంకటేశ్వరరెడ్డి...!?

రాష్ట్రంలో బిజెపి చాప కింద నీరులా విస్తరిస్తోంది. మతాన్ని అడ్డుపెట్టుకుని బలం పెంచుకునేలా చర్యలు తీసుకుంటూనే మరో వైపు వివిధ పార్టీల్లోని ద్వితీయ స్థాయి నాయకులను పార్టీలో చేర్చుకుంటోంది. రాజకీయ చైతన్యం అధికంగా గల గుంటూరు జిల్లాలో ఆ పార్టీ టిడిపి,వైకాపాలో అసంతృప్తి చెందుతోన్న నేతలకు గాలం వేస్తోంది. ముందుగా జిల్లాలో 'వినుకొండ', సత్తెనపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేలైన 'మక్కెన మల్లిఖార్జున్‌రావు, యర్రం వెంకటేశ్వర్‌రెడ్డిలను బిజెపిలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. 2004లో వినుకొండ నుంచి కాంగ్రెస్‌ తరపున గెలుపొందిన 'మక్కెన మల్లిఖార్జునరావు' ప్రస్తుతం వైకాపాలో ఉన్నారు. గత ఎన్నికలకు ముందు ఆయన వైకాపాలో చేరారు. అప్పట్లో కాంగ్రెస్‌ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న 'మక్కెన'ను ప్రస్తుత ఎమ్మెల్యే 'బొల్లా బ్రహ్మనాయుడు' ఎంపి 'లావు కృష్ణదేవరాయలు'లు కలసి వైకాపాలో చేర్పించారు. వైకాపాలో చేరితే డిసిసి ఛైర్మన్‌ పదవి కానీ, ఎమ్మెల్సీ పదవి కానీ ఇస్తామని అప్పట్లో ఆయనకు హామీ ఇచ్చారు. వినుకొండ నియోజకవర్గంలో కొంత పట్టు ఉన్న 'మక్కెన' వల్ల వైకాపా బాగానే లాభపడింది. అయితే ఎన్నికల్లో గెలిచిన తరువాత 'మక్కెన'ను ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు దూరం పెట్టినట్లు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. అంతే కాకుండా 'మక్కెన' ముఖ్య వ్యాపారమైన చేపల చెరువుల వ్యాపారంలో ఎమ్మెల్యే అనుచరులు ప్రవేశించి 'మక్కెన'ను ఆర్థికంగా దెబ్బతీశారని 'మక్కెన' అనుచరులు ఆరోపిస్తున్నారు. అదే కాకుండా ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చుకోలేదని 'మక్కెన' తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 

ఈ నేపథ్యంలో ఆయనను బిజెపి నాయకులు సంప్రదిస్తున్నారని తెలుస్తోంది. నియోజకవర్గంలో 'మక్కెన'కు పార్టీలకు అతీతంగా బంధువర్గం ఉంది. ఆయన స్వంత బలం బిజెపి పార్టీని అభిమానించే వర్గాలతో నియోజకవర్గంలో పట్టు సాధించాలనే లక్ష్యంతో 'మక్కెన'ను పార్టీలో చేర్చుకోవాలని బిజెపి ఆశిస్తోందని ప్రచారం జరుగుతోంది. కాగా 'సత్తెనపల్లి' నుంచి 2004,2009ల్లో కాంగ్రెస్‌ పార్టీ తరుపున గెలిచిన 'యర్రం వెంకటేశ్వరరెడ్డి'కి కూడా బిజెపి వల వేస్తోంది. ప్రస్తుతం సత్తెనపల్లి ఎమ్మెల్యేగా ఉన్న 'అంబటి రాంబాబు'పై నియోజకవర్గంలో అసంతృప్తి నెలకొందని, టిడిపికి సరైన నాయకుడు లేనందున ఇక్కడ ఆయనను పార్టీలో చేర్చుకుంటే ప్రస్తుతానికి రెండో స్థానంలో నిలవచ్చునని బిజెపి భావిస్తోంది. 'యర్రం, మక్కెన'లను బిజెపిలో చేర్చుకుని వారికి ప్రాధాన్యత ఇస్తే..టిడిపి, వైకాపాల్లో ప్రాధాన్యత లేని వారు బిజెపిలో చేరవచ్చు. 'తిరుపతి' ఉపఎన్నిక తరువాత బిజెపి రెండో స్థానంలో నిలిస్తే గుంటూరు జిల్లా రాజకీయాల్లో గణనీయమైన మార్పు వస్తుందనే అంచనాలు ఉన్నాయి. చూద్దాం ఏమి జరుగుతుందో..!? 

(262)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ