WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

సవాల్‌కు...'గొట్టిపాటి' ప్రతి సవాల్‌...!

మైన్స్‌కు సంబంధించి సుమారు 45కోట్ల రూపాయల పెనాల్టీని ప్రభుత్వం విధించడంతోనే వైకాపా నుంచి టిడిపిలోకి వచ్చారన్న విమర్శలపై అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ ఘాటుగా స్పందించారు. ఇది కేవలం తనను వ్యక్తిగతంగా అప్రదిష్టపాలు చేసేందుకు కొందరు చేస్తోన్న దుష్‌ప్రచారమని రవి ఆరోపించారు. తాను 45కోట్ల రూపాయలు ప్రభుత్వానికి కట్టాల్సి ఉందని ఎవరైనా రుజువు చేస్తే రాజకీయాల నుంచి శాశ్వితంగా తప్పుకుంటానని, ఒక వేళ రుజవు చేయకపోతే ఆరోపణలు చేసిన వారు రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని ఆయన సవాల్‌ విసిరారు. కొందరు సీనియర్‌ నాయకులు తమ రాజకీయ లబ్ది కోసం అవాస్తవ విమర్శలు,ఆరోపణలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. తాను ప్రజల కోసమే పనిచేస్తున్నానని నియోజకవర్గ అభివృద్ధి కోసమే 'జగన్‌' పార్టీని వీడి టిడిపిలోకి చేరారని తనకు స్వార్థం లేదన్నారు. 2009లో 'అద్దంకి' నియోజకవర్గం నుండి సీనియర్‌ టిడిపి నాయకుడు 'కరణం బలరామకృష్ణమూర్తి'ని ఓడించి సంచలనం సృష్టించిన 'గొట్టిపాటి రవికుమార్‌' 2014లో మళ్లీ బలరామ్‌ కుమారుడిపై విజయం సాధించారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేక కొందరు నాయకులు వ్యక్తిగత స్వార్థం కోసం ఆధారాలు లేని విమర్శలు చేస్తున్నారని రాజకీయాల్లో ఎవరెవరు ఎంతెంత ఆస్తులు కూడబెట్టుకున్నారో ప్రజలకు తెలుసనని ఆయన అన్నారు. అధికారం తన బలహీనత కాదని, ప్రజల కోసమే పనిచేస్తానే తప్ప మరో విధంగా వ్యవహరించనని ఆయన కుండబద్దలు కొట్టారు. తన పెదనాన్నను తానే రాజకీయాల్లోకి తీసుకొచ్చానని ఆయనను సమితి ప్రెసిడెంట్‌గా గెలిపించానని, జడ్పీ ఛైర్మన్‌గా చేశానని మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ 'అది పెద్ద జోక్‌ అని..అనుభవం ఉన్న రాజకీయనాయకులు చిల్లర పనులు చేస్తుంటే నవ్వు వస్తోందని' వ్యాఖ్యానించారు. బలరాం వెన్నుపోటు పొడుస్తారా? అన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ పొడిస్తే...ఏమవుతుందని అన్నారు..ఆ మాటల్లో యధార్థం ఉంది. ఒక సారి తండ్రిని, మరోసారి కుమారుడిని ఓడించిన చరిత్ర 'గొట్టిపాటి'కి ఉంది. ఆ ధైర్యంతోనే ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. మనిషికి చావు తప్పదు.. అది కొందరికి ముందుగా మరి కొందరికి ఆలస్యంగా వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. వైకాపా నుంచి తాను బయటకు రావడానికి 'జగనే' కారణమని ఆయన అన్నారు. వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి జీవించి ఉన్నప్పుడు తనను బాగా చూసుకున్నారని, తరువాత 'జగన్‌' తనను పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. నియోజకవర్గంలో వేరే వారి పెత్తనం ఎక్కువయిందని, అందుకే పార్టీ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందన్నారు. నిన్నటి దాకా స్వంత సామాజికవర్గం నేతలే కాకుండా ఇతర సామాజికవర్గానికి చెందిన వారు కూడా మిమ్మల్ని సమర్థించారు కదా...ఇప్పుడు వారు దూరం అవుతారా? అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ ...తాను అన్ని వర్గాల కోసం పాటుపడుతానని...తన సామాజికవర్గమే కాకుండా అందరినీ కలుపుకుపోతానని చెప్పారు. మొత్తం మీద 'గొట్టిపాటి'కి స్వంత పార్టీలో ఎదురవుతున్న సవాళ్లకు ధీటుగా స్పందిస్తున్నారు.

(3829)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ