WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

మంత్రి మాణిక్యాలరావుకు చెక్‌...

ఇంతకు ముందు రెవిన్యూ సీనియర్‌ అధికారులను మాత్రమే పలు దేవాలయాలకు ఇఒగా నియమించిన ప్రభుత్వం తాజాగా ఐఎఎస్‌ అధికారులను నియమించడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. శ్రీశైలం, దుర్గ గుడి, కాణిపాకం, శ్రీకాళహస్తి, అన్నవరం,సింహాచలంతో పాటు ఇతర ప్రాముఖ్యత గల దేవాలయాలకు ఇఒలుగా పలువురు అధికారులను నియమించినప్పుడు లక్షలు చేతులు మారాయాని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు తెలిసింది. దీనిపై ఆయన ఇంటిలిజెన్స్‌ వర్గాల ద్వారా నివేదికలు తెప్పించుకున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తగా జీవితాన్ని ప్రారంభించిన మంత్రి మాణిక్యాలరావు పలు దేవాలయాలకు ఇఒలుగా అధికారులను నియమించే ముందుకు ఆయన కార్యాలయ అధికారిని సంప్రదించిన అనంతరమే నిర్ణయాలు తీసుకుంటున్నారట. మంత్రి కార్యాలయ అధికారి వ్యవహారశైలిపై ప్రభుత్వం రహస్యంగా విచారణ జరిపించింది. ప్రతిపోస్టుకు ఒక రేటును ఆ అధికారి నిర్ణయించి..అడ్వాన్స్‌గా కొంత సొమ్మును ముందుగానే తీసుకుంటున్నారని విచారణలో తేలింది. అంతకు ముందు జరిగిన నియామకాలపై కూడా ప్రభుత్వం విచారణ జరిపించింది. లక్షలు చేతులు మారాయని బయట పడింది. దీంతో పరిస్థితిని ఎలా సరిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా ఆలోచించి...ఐఎఎస్‌ అధికారులను నియమిస్తే పరిస్థితి ఎలా ఉంటుందని కొందరు అధికారులతో చర్చించారు. వారు కూడా ముఖ్యమంత్రి ఆలోచనను సమర్థించి అమలు చేయమని కోరారు. అందుకే ముందుగా ఇఒగా ఐఎఎస్‌ అధికారి సూర్యకుమారిని నియమించగా తాజాగా శ్రీశైలం ఇఒగా 'భరత్‌'ను నియమించడం జరిగింది. దీంతో మంత్రి మాణిక్యాలరావు ఖంగుతిన్నారు. దేవాలయాలపై మంత్రి పట్టు కోల్పోయేవిధంగా పరిస్థితి తయారైంది. కానీ పలు దేవాలయాల అభివృద్ధికి ఇఒలు సరైన రీతిలో స్పందించడంలేదని, అవినీతికి పాల్పడుతూ దేవలయాల్లో ముఠా తగాదాలను ప్రోత్సహిస్తున్నారని అందుకే ముఖ్యమంత్రి ఆ విధమైన నిర్ణయం తీసుకున్నారని సిఎంఒ వర్గాలు చెబుతున్నాయి. కానీ అసలు అది కాదని, భారీ ఎత్తున లక్షలు చేతులు మారడమే కారణమని ఆ వర్గాలే ఆఫ్‌ ది రికార్డుగా చెబుతున్నాయి. రెవిన్యూ సీనియర్‌ అధికారులను నియమించినా వారు కూడా అవినీతికి పాల్పడుతున్నట్లు బయటకు పొక్కడంతో చివరకు ఐఎఎస్‌ అధికారులను నియమిస్తున్నారు.

(902)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ