WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

మీది శ్యామ్‌సంగ్‌ ఫోనా!? తస్మాత్‌ జాగ్రత్త...!

ప్రస్తుతం మార్కెట్‌లో శ్యామ్‌సంగ్‌ కంపెనీ ఫోన్‌లకు ఎంతో డిమాండ్‌ ఉంది. ఈ కంపెనీ అందిస్తోన్న నూతన సర్వీసులు, ఇతర ఆకట్టుకునే డిజైనింగ్‌లతో అనేక మంది వినియోగదారులు ఆ ఫోన్లను వేలం వెర్రిగా కొంటున్నారు. ఆ వెర్రినే ఇక్కడ ఆ కంపెనీ సొమ్ము చేసుకుంటోంది. వేలాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన ఆ ఫోన్లకు చిన్న రిపేరు వచ్చినా వేలాది రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. చిన్న బటన్‌ పనిచేయకపోయినా కనీసం రూ.2500 నుంచి రూ.3000దాకా వసూలు చేస్తున్నారు. ఫోన్‌ పనిచేయనప్పుడు..సర్వీసింగ్‌ సెంటర్‌కు వెళితే మీ జేబులు గుళ్ల అయినట్లే...! సర్వీస్‌ సెంటర్‌లు బందిపోట్ల కన్నా ఎక్కువ దోచుకుంటున్నాయి. ఫోన్‌ పనిచేయడం లేదంటే వేల రూపాయలు చెల్లిస్తే కానీ...మరమ్మత్తులు చేయడం లేదు. వాస్తవానికి సర్వీసింగ్‌ సెంటర్‌లో ఆ కంపెనీ ఫోన్‌లకు వారెంట్‌ ఉంటే ఉచితంగా చేయాల్సి ఉంటుంది. కానీ ఫోన్‌ కింద పడ్డా...నీటిలో తడిసినా వారెంటీ పనిచేయదట. వాస్తవంగా ఫోన్‌ కిందపడకపోయినా...నీటిలో తడవకపోయినా...వారు కస్టమర్‌కు ఫోన్‌ కిందపడిందని వాదనకు దిగుతున్నారు.. కస్టమర్‌ ఫోన్‌ కిందపడలేదని చెప్పినా పట్టించుకోకుండా, తాము చెప్పిందే వేదం అన్నట్లు దాన్ని వారెంటీ కింద చేయమని, ప్రత్యేక చార్జీ అవుతుందని కుండబద్దలు కొడుతున్నారు. దీంతో ఎంతో ఖరీదు పెట్టి కొన్న ఫోన్‌ కోసం వారు అడిగినంత కస్టమర్‌ చెల్లిస్తున్నారు. ఒక్కొక్క పరికరం ఖరీదు పది వేల రూపాయలు అని...వసూలు చేస్తున్నారు.. అదేమిటంటే ఇష్టం అయితే రిపేరు చేయించుకోండి..లేదా మీ ఫోన్‌ వాపస్‌ తీసుకుపొండి అని కసురు కుంటున్నారు. గతంలో ప్రఖ్యాత ఫోన్‌ సంస్థ అయిన 'నోకియా'లో ఇటువంటి పరిస్థితి ఉండేది కాదు. వారెంటీ గడువు లోపల ఎటువంటి మరమ్మతులైనా ఉచితంగా చేసేవారు. కానీ ఇక్కడ అందుకు విరుద్దంగా జరుగుతుంది. కస్టమర్లు శ్యామ్‌సంగ్‌ ఫోన్లపై నమ్మకంతో కొనుగోలు చేయడమే. అయితే ఈ నమ్మకాన్నే వాళ్లు పెట్టుబడిగా దోపిడీ చేస్తున్నారు. ఈ దోపిడీపై స్పందించాల్సిన అధికారులు స్పందించడం లేదు... ప్రైవేట్‌ కంపెనీలు ఇష్టారాజ్యంగా దోచుకుంటుంటే ఎవరిని అడగాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబందిత అధికారులు ఈ సర్వీసింగ్‌ దోపిడీని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

(2667)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ