Breaking-News

‘నాకు టిక్కెట్‌ ఇప్పించలేనేళ్లు..‘పోలవరం’ కడతారా...?: రఘురామకృష్ణంరాజు

రాష్ట్ర రాజకీయాల్లో వైకాపా రెబెల్‌ ఎంపి రఘురామకృష్ణంరాజు వ్యవహారం అన్ని పార్టీల్లో కలకలం సృష్టిస్తోంది. ముఖ్యంగా కూటమి పార్టీలైన ‘టిడిపి, జనసేన, బిజెపి’ల్లో అలజడికి కారణం అవుతోంది. గత నాలుగున్నరేళ్ల నుంచి అధికార వైకాపాపై అలుపెరగని పోరాటం చేస్తోన్న ‘రఘురామకృష్ణంరాజు’ రాష్ట్రంలో వైకాపా వ్యతిరేక కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. అయితే..కూటమి ఏర్పాటు తరువాత జరిగిన పరిణామాల్లో ఆయనకు ‘బిజెపి’ సీటును నిరాకరించింది. మొన్నటి వరకూ ఆయనకు ‘నర్సాపురం’ పార్లమెంట్‌ సీటును ‘బిజెపి’ ఇస్తుందని ఆయనతోపాటు అందరూ భావించారు. అయితే..అనూహ్యంగా ఆయనకు ‘బిజెపి’ టిక్కెట్‌ ఇవ్వలేదు. అసలు తమ పార్టీలో లేని వ్యక్తికి టిక్కెట్‌ ఎలా ఇస్తామని ‘బిజెపి’ నేతలు ప్రశ్నిస్తున్నారు. తనకు సీటు రాకపోవడానికి ఆపధర్మ ముఖ్యమంత్రి జగన్‌తో పాటు, మాజీ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు ‘సోము వీర్రాజు’ కారణమని ‘రఘురామ’ ఆక్రోశిస్తున్నారు. వాస్తవానికి ఆయనకు ‘బిజెపి’ సీటు ఇస్తుందని, ఆ సీటును ‘టిడిపి’ పొత్తులో భాగంగా ‘బిజెపి’కి కేటాయించింది. అయితే..ఇప్పుడు ‘జగన్‌’ తనకు టిక్కెట్‌ ఇవ్వకుండా అడ్డుకున్నారని ‘రఘురామకృష్ణంరాజు’ ఆరోపిస్తున్నారు. ఎవరు అడ్డుకున్నా..అడ్డుకోకున్నా..ఇప్పుడు ఆయనకు సీటు రాని వ్యవహారం కూటమిపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ‘జగన్‌’పై అలుపెరగకుండా పోరాడిన ‘రఘురామకృష్ణంరాజు’కు సీటు ఇవ్వకపోవడం రాష్ట్రంలో మెజార్టీ ప్రజలకు అసంతృప్తికి కారణం అవుతోంది. ఇది ఇలా ఉంటే..తనకు సీటు ఇప్పించాల్సిన బాధ్యత ‘టిడిపి, జనసేన’అధినేతలపైనే ఉందని ‘రఘురామకృష్ణంరాజు’ అంటున్నారు. ‘బిజెపి’ పెద్దలతో మాట్లాడి తన సీటు తనకు ఇప్పించాలని ఆయన వాదిస్తున్నారు. అలా ‘బిజెపి’ పెద్దలకు నచ్చచెప్పలేకపోతే..కూటమి ఎలా విజయం సాధిస్తుందని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడే..‘టిడిపి’ పెద్దలు ‘బిజెపి’ని నిలదీయలేకపోతే..ఎన్నికల్లో గెలిచిన తరువాత ‘పోలవరం’ ఇంకా ఇతర విషయాలపై ‘బిజెపి’ పెద్దలను ఎలా ప్రశ్నిస్తారని ఆయన అంటున్నారు. తనవంటి వారికి అన్యాయం జరిగితే..దానిని సరిదిద్దాల్సిన బాధ్యత ‘చంద్రబాబు’దేనని, ఆయన ‘బిజెపి’ని తన విషయంలో నిలదీయాలని, అలా నిలదీయలేకపోతే..ఇక ఆయన ఎన్నికల్లో గెలిచినా..ఆయనేం చేస్తారని ‘రఘురామ’ ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద ‘రఘురామ’వ్యవహారం..కూటమి విచ్ఛినానికి దారి తీస్తుందనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అదే జరిగితే..వైకాపాకు ఆయాచిత లబ్ది చేకూరినట్లే. ‘రఘురామరాజు’ అనే వ్యక్తి మూలంగా ఏర్పాటు అయిన కూటమి..ఆయన వల్లే విచ్ఛినం అవుతుంది. అయితే..నామినేషన్లకు ఇంకా సమయం ఉండడంతో ఏమి జరుగుతుందో..చూడాలి. కాగా..‘టిడిపి’ ‘నర్సాపురం’ టిక్కెట్‌ను ‘బిజెపి’ ‘రఘురామకృష్ణంరాజు’కు ఇస్తుందని హామీ ఇచ్చాకే వారికి ఇచ్చింది. అయితే..ఇప్పుడు వారు ఆ హామీ తప్పినందున..ఆ సీటును వెనుక్కు తీసుకుని..దాని బదులు మరో సీటు ‘బిజెపి’కి కేటాయించాలని టిడిపిలో కొంత మంది నేతలు, కార్యకర్తలు కోరుతున్నారు. దీనికి ‘బిజెపి’పెద్దలను ‘చంద్రబాబు, పవన్‌’లు ఒప్పించాలని కోరుతున్నారు. బిజెపి నుంచి వెనుక్కు తీసుకున్న ‘నర్సాపురం’ నుంచి ‘రఘురామకృష్ణంరాజు’ను ‘టిడిపి’ తరుపున పోటీ చేయించాలని వారు కోరుతున్నారు. మొత్తం మీద..‘రఘురామకృష్ణంరాజు’ వ్యవహారం..అటుతిరిగి..ఇటు తిరిగి ‘టిడిపి,జనసేన’లకు చుట్టుకునే ప్రమాదం ఉంది.

  • (0)
  • -
  • (0)