జ‌గ‌న్‌కు గుదిబండ‌లు...!?

30, Oct 2025


వైకాపా అధినేత వై.ఎస్‌.జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డికి కొంద‌రు పార్టీ నేత‌లు గుదిబండ‌ల్లా త‌యార‌య్యార‌ని, వారిని వ‌దిలించుకోలేక‌పోతే ఆయ‌న భ‌విష్య‌త్తులో చాలా ఇబ్బందులు ప‌డ‌తార‌ని, గ‌తంలో అధికారంలో ఉన్న‌ప్పుడు కూడా వీరి వ‌ల్లే ఎక్కువ ఇబ్బందులు వ‌చ్చాయ‌ని, వారి నోటిదూల‌, అవినీతి, అరాచ‌కాల వ‌ల్ల పార్టీతో పాటు, జ‌గ‌న్ కూడా దెబ్బ‌తిన్నార‌ని, ఇప్ప‌టికైనా వారిని వ‌దిలించుకోవాల‌ని ఆ పార్టీ హిత‌వు కోరే నేత‌లు ఆయ‌న‌కు చెబుతున్నారు. నేరుగా ఆయ‌న‌ను క‌లిసి చెప్పేవారు లేక‌పోయినా..అంత‌రంగిక సంభాష‌ణ‌ల్లో వారు త‌మ అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేస్తున్నారు. స‌ద‌రు నేత‌లు పార్టీకి గుదిబండ‌ల్లా త‌యార‌య్యార‌ని వారిని వ‌దిలించుకునే మార్గాన్ని ఆయ‌న వెతుక్కోవాల‌ని వారు సూచిస్తున్నారు. ముఖ్యంగా రాజ‌ధాని ప్రాంత‌మైన ఉమ్మ‌డి గుంటూరు, కృష్ణా ప్రాంతాల‌లోని నేత‌లైన కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీ, పేర్ని నాని, జోగి ర‌మేష్‌, అంబ‌టి రాంబాబు, అప్పిరెడ్డి, త‌ల‌శిల‌ర‌ఘురాం లాంటి నేత‌ల‌ను వ‌దిలించుకోవాల‌ని వారు అంటున్నారు. వీరితో పాటు మాజీ మంత్రులు ఆర్‌.కె.రోజా, అమ‌ర్‌నాధ్‌, అనిల్‌కుమార్ యాద‌వ్ వంటి వారి వ‌ల్ల పార్టీకి, జ‌గ‌న్‌కు చెడ్డ‌పేరు వ‌స్తుంద‌ని, వీరిని పార్టీ నుంచి త‌ప్పిస్తే..కొత్త నీరు పార్టీలోకి వ‌స్తుంద‌ని, ఇటువంటి వారి వ‌ల్ల వ‌చ్చిన చెడ్డ ఇమేజ్ పోతుంద‌ని వారు చెబుతున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కృష్ణాజిల్లాలో మంత్రులుగా వ్య‌వ‌హ‌రించిన కొడాలి నాని, జోగి ర‌మేష్‌, పేర్ని నాని వల్ల పార్టీకి జ‌రిగిన మేలేమిటో చెప్పాల‌ని వారు నిల‌దీస్తున్నారు. వీరి వ్య‌వ‌హార‌శైలి, నోటి దూల వ‌ల్ల ఈ ప్రాంతంలో పార్టీ స‌ర్వ‌నాశ‌న‌మై పోయింద‌ని, ముఖ్యంగా కొడాలి నాని, జోగి వ‌ల్ల పార్టీకి త‌ట‌స్థులు, చ‌దువుకున్న‌వారు, మేధావులు దూర‌మ‌య్యార‌ని వారు విశ్లేషిస్తున్నారు. నోరు తెరిస్తే..కంపు కొట్టే మాట‌ల‌ను వ‌దిలే వీరి వ‌ల్ల పార్టీకి ఉప‌యోగం ఏమిట‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు. గుంటూరు జిల్లాను అంబ‌టి, అప్పిరెడ్డి, మాజీ మంత్రి ర‌జ‌నీలు స‌ర్వ‌నాశ‌నం చేశార‌ని వీరిని ఎంత త్వ‌ర‌గా వ‌దిలించుకుంటే అంత మంచిద‌ని కూడా వారు అంటున్నారు. 

స‌జ్జ‌ల గుప్పెట్లో పార్టీ బందీ...!

జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి అధికారంలో ఉన్న‌ప్పుడు స‌క‌ల‌శాఖ‌ల మంత్రిగా వ్య‌వ‌హ‌రించిన స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఇప్పుడు కూడా పార్టీని త‌న చేతిలో బందీగా మార్చుకున్నార‌నే అభిప్రాయం పార్టీ వ‌ర్గాల నుంచి వ్య‌క్తం అవుతోంది. పార్టీ కార్యాల‌యానికి ఎవ‌రు రావాలి, ఎవ‌రు రాకూడ‌దు..ఎవ‌రు మాట్లాడాలి...? ఎవ‌రు మాట్లాడ‌కూడ‌దు..? ఎవ‌రేమి చేయాల‌నే ఆయ‌నే నిర్ణ‌యిస్తున్నార‌ని దీంతో పార్టీ క్యాడ‌ర్‌లో నిర్లిప్త‌త‌, నిరాశ వ్య‌క్తం అవుతోందంటున్నారు. పార్టీ ఘోర‌మైన ఓట‌మికి కార‌ణ‌మైన స‌జ్జ‌లే ఇంకా పెత్త‌నం చేయ‌డం వారికి రుచించ‌డం లేదు. పార్టీలో ఆయ‌న త‌ప్ప ఇంకెవ‌రూ లేరా..? అంటూ వారు ప్ర‌శ్నిస్తున్నారు. జ‌గ‌న్ అధికారంలో ఉన్న‌ప్పుడు జ‌రిగిన‌ అవినీతి, అక్ర‌మాల‌కు ప్ర‌ధాన కార‌ణ‌మైన స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిని కూట‌మి ప్ర‌భుత్వం ఏమీ చేయ‌డం లేదంటే..తెలుస్తోంద‌ని, ఆయ‌న వారితో ఎంత‌గా కుమ్మ‌క్కు అయ్యారో..అని వారు అంటున్నారు. చంద్ర‌బాబుతో కుమ్మ‌క్కు కావ‌డం వ‌ల్లే స‌జ్జ‌ల ఆయ‌న కుమారుడు సుఖఃంగా ఉంటున్నార‌ని, వారిపై ఈగ కూడా వాల‌డం లేద‌ని, ఈ సంగ‌తిని అధినేత ఎందుకు విస్మ‌రిస్తున్నారో తెలియ‌డం లేదంటున్నారు. ఇంకా ఆయ‌న‌నే న‌మ్ముకుంటే..గ‌తంలో వ‌చ్చిన ఫ‌లితాలే మ‌ళ్లీ వ‌స్తాయ‌ని వారు చెబుతున్నారు.

అప్పిరెడ్డిదో కుంప‌టి...!

కాగా పార్టీ రాష్ట్ర కార్యాల‌యంలో స‌జ్జ‌ల‌దో కుంప‌టి కాగా, గుంటూరుకు చెందిన అప్పిరెడ్డిది మ‌రో కుంప‌టి అని...జిల్లాల నుంచి వ‌చ్చే కార్య‌క‌ర్త‌లు ఆయ‌న‌ను క‌లిసిన త‌రువాతే..మిగ‌తావారిని క‌ల‌వ‌నిస్తున్నార‌ని, జ‌గ‌న్‌ను క‌ల‌వ‌నీయ‌డం లేద‌ని, ఒక వేళ జ‌గ‌న్‌ను క‌ల‌వ‌నిస్తే..ఆయ‌న‌పై ఫిర్యాదు చేస్తార‌నే భావ‌న‌తో ఆయ‌న వారిని అక్క‌డే నిలిపేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. జిల్లాల నుంచి వ‌చ్చిన నాయ‌కులు ఎదైనా మాట్లాడితే..త‌రువాత వీరు వారిని బెదిరిస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. త‌ట‌స్థులు, మేధావులు, ఇత‌ర వ‌ర్గాల నాయ‌కుల‌ను పార్టీ ఆక‌ర్షించ‌లేక‌పోతుందంటే దానికి కార‌ణం వీరేన‌ని కొంద‌రు పార్టీ నాయ‌కులు విమ‌ర్శిస్తున్నారు. మీడియాలో కూడా పాత వాళ్లే పాత పాట‌లే పాడుతార‌ని, దీని వ‌ల్ల ఉప‌యోగం ఉండ‌డం లేదంటున్నారు. జ‌గ‌న్‌కు వాస్త‌వాలను వివ‌రించ‌డానికి వీరు ఎవ‌రూ సాహ‌సించ‌డం లేద‌ని, ఆయ‌న‌ను ఊహ‌ల‌ప‌ల్లికిలో ఊరేగిస్తున్నార‌ని, దీంతో ఆయ‌నెక్కెడెక్క‌డో విహ‌రిస్తున్నార‌ని, వాస్త‌వంలో జీవించ‌డం లేద‌ని ఓ సీనియ‌ర్ నేత జ‌న‌మ్ఆన్‌లైన్‌.కామ్‌తో అన్నారు. ఆయ‌న‌కు కూడా వారు చేస్తోన్న భ‌జ‌న‌లోనే ఆనందం ఉంద‌ని, 175/175 అంటే..ఎంత మురిసిపోయారో..ఇప్పుడు..ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రిగినా..అధికారంలోకి వ‌చ్చేస్తామ‌నే మాట‌లు ఆయ‌న‌ను మున‌గ‌చెట్టు ఎక్కించేవారు చెబుతుంటే ఆయ‌న మ‌హ‌దానందంగా వింటున్నార‌ని, దీంతో..పార్టీకి ఘోర‌మైన న‌ష్టం జ‌రుగుతుంద‌ని ఆ సీనియ‌ర్ నేత ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పార్టీకి ప‌ట్టుకొమ్మ‌ల్లా ఉంటోన్న వ‌ర్గాల నేత‌ల‌ను జ‌గ‌న్ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, ఇది పార్టీకి న‌ష్టం చేకూరుస్తుంద‌ని కూడా ఆయ‌న అన్నారు. మొత్తం మీద‌..జ‌గ‌న్ త‌నను మున‌గ‌చెట్టు ఎక్కిస్తోన్న భ‌జ‌న‌ప‌రుల‌ను, పార్టీకి గుదిబండ‌ల్లా త‌యారైన వారిని వ‌దిలించుకోకుంటే..మ‌ళ్లీ ఘోర‌మైన  ఫ‌లితాల‌ను చూడాల్సిందేన‌ని వారు అంటున్నారు. 


(1)
(0)

Comments

తాజా పోల్

జ‌గ‌న్ మ‌ళ్లీ గెలుస్తార‌నే భ‌యంతోనే రాజ‌ధాని అమ‌రావ‌తిపై అసెంబ్లీలో తీర్మానం చేశారా?

VOTE PLEASE