వినుకొండపై వస్తోన్న వార్తలు నిజమేనా...?
పల్నాడు జిల్లా వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారనే దానిపై పలురకాలైన వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం గాలి వీస్తోందని పలు సర్వే సంస్థలు చెబుతున్నాయి. జాతీయ వార్తా ఛానెల్స్‌తో సహా పలు లోకల్ సంస్థలు కూడా రాష్ట్రంలో అధికారం తెలుగుదేశం కూటమిదే అని చాటి చెబుతున్నాయి. అంతే కాకుండా పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకున్న ఉద్యోగుల్లో మెజార్టీ ఉద్యోగులు కూటమివైపే ఓటు వేశారని అంచనాలు ఉన్నాయి. ఉద్యోగులు ఎటువైపు ఉంటే..అటువైపే విజయం ఉంటుంది. మరోవైపు తనను ఓడించడానికి కూటమినేతలు కుట్రలుపన్నుతున్నారని, పోలీసు అధికారులను ఇష్టారాజ్యంగా తీసేస్తున్నారని ఆపధ్దర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆవేదన చెందుతూ తనపార్టీ ఓడిపోతుందని సంకేతాలను ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో వస్తోన్న మార్పులను గమనిస్తే కూటమివైపు ఏకపక్ష విజయం నమోదు అవుతుందనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తోంది. ఇటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో వినుకొండలో టిడిపి కూటమి అభ్యర్థి ఓడిపోతారని ప్రచారం సాగుతోంది. దీనిలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ..వినుకొండ ప్రాంతంలో ఈ వార్త సంచలనం సృష్టిస్తోంది. ఎందుకు ఇక్కడ ఇది చర్చనీయాంశం అవుతుందంటే..వినుకొండ టిడిపికి కంచుకోట వంటిది.
టిడిపి స్థాపించినదగ్గర నుంచి ఆపార్టీ కానీ, ఆ పార్టీ బలపరిచిన వామపక్షాలు కానీ ఎక్కువ సార్లు గెలిచాయి. టిడిపి రాక ముందు ఇక్కడ వామపక్షాలకు గణనీయమైన బలం ఉందేది. అయితే 1983 లో టిడిపి ఏర్పాటు అయిన తరువాత నుంచి టిడిపి ఇక్కడ బలంగా ఎదిగింది. 1983,1985ల్లో టిడిపి వామపక్షాలకు మద్దతు ఇచ్చింది. 1989లో కాంగ్రెస్ గాలిలో నన్నపనేని రాజకుమారి స్వల్ప ఓట్ల తేడాతో టిడిపిపై గెలుపొందారు. ఆ తరువాత 1994,1999లో టిడిపి అభ్యర్థి యలమందరావు వరుసగా రెండుసార్లు గెలిచారు. 2004లో మాత్రం కాంగ్రెస్ తరుపున మక్కెన మల్లిఖార్జునరావు గెలుపొందారు. 2009,2014లో మాజీ ఎమ్మెల్యే జివి ఆంజనేయులు గెలుపొందారు. 2014లో వైకాపా గాలిలో బొల్లా బ్రహ్మనాయుడు ఘనవిజయం సాధించారు. వినుకొండ చరిత్రలో ఎవరికీ రాని మెజార్టీ ఆయనకు వచ్చింది.
ఘనమైన మెజార్టీతో విజయం సాధించిన బొల్లా బ్రహ్మనాయుడు గత ఐదేళ్ల నుంచి తిరుగులేని విధంగా పరిపాలన చేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో జగన్ వ్యవహరించిన చందంగానే ఆయన నియోజకవర్గంలో వ్యవహరిస్తున్నారు. తనను ఎదిరించిన వారిని, తనకు ఎదురు చెప్పిన వారిని ఏదో రకంగా వేధిస్తున్నారు. తన వ్యతిరేకులపై నోరుపారేసుకుంటూ, అసభ్య భాషతో దూషించుకుంటూ.. నియోజకవర్గంలో తనకు ఎదురేలేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. తానేం చేయాలనుకుంటే..అది చేసుకుంటూపోతున్నారు. నియోజకవర్గంలో అంతో ఇంతో అభివృద్ధి పనులు చేశాడనే పేరును ఆయన తెచ్చుకున్నారు. అయితే..టిడిపి నేతలు ఈ విషయంతో ఏకీభవించడం లేదు. గతంలో జివీ చేసిన పనులు ఈయన చేశారని చెప్పుకుంటున్నారని, ఈయన కొత్తగా చేసిందేమీ లేదంటూ..వారు ఎద్దేవా చేస్తున్నారు. పట్టణంలో రోడ్ల విస్తరణ, వినుకొండ కొండకు ఘాట్ రోడ్డు వేయించడం, పట్టణానికి తాగునీటి సౌకర్యం కల్పించడం వంటి కార్యక్రమాలను ఆయన చేశారని చెబుతారు. అయితే..ఇవన్నీ పోసుకోలు కబుర్లని, కావాలని ఆయన ప్రచారం చేయించుకుంటున్నారని ఆయన వ్యతిరేకులు చెబుతున్నారు. ఎమ్మెల్యేగా ఆయనచేసిందేమీ లేదని, పేదలకు ఇళ్లపట్టాల పేరుతో పెద్ద ఎత్తున్న అవినీతికి పాల్పడ్డారని, ప్రభుత్వ భూములను భారీగా ఆక్రమించారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. స్వంత పార్టీ నాయకులతో పాటు, ఎవరినీ ఆయన లెక్కచేయడం లేదని, తాను అనుకున్నదే చేస్తున్నారని, నిరంకుంశంగా వ్యవహరిస్తున్నారని ఒంటెత్తుపోకడలతో వెళుతున్నారనే మాట నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారంలో ఉంది. టిడిపినాయకులు, కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని, తనను ప్రశ్నించిన రైతుపై కేసు పెట్టి వేధించారని, అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని, ఈయనను మళ్లీ ఎమ్మెల్యేగా ఎన్నుకునేప్రసక్తే లేదని అటు స్వంతపార్టీ నేతలతో పాటు, ప్రతిపక్షాలు చెబుతున్నాయి. వారు చెబుతోన్న మాట క్షేత్రస్థాయిలో కూడా నిజమని ప్రచారం జరుగుతోంది. మొన్నటి దాకా ఎన్నికలు ఎప్పుడు జరిగినా మొదట వైకాపా ఓడిపోయే సీటు వినుకొండ అని మాట సర్వత్రా వినిపించింది. దాదాపు..అన్ని వర్గాలు ఈ మాటను ఆమోదించాయి. అయితే..ఆశ్చర్యకరంగా కొన్ని సర్వే సంస్థలు ఎమ్మెల్యే బొల్లా మళ్లీ గెలుస్తాడని చెబుతున్నాయి. ఒకటీ అరా కాదు..దాదాపు ఐదు నుంచి ఆరు సర్వేలు ఇదే మాటను చెబుతున్నాయి. దీంతో..ఈ నియోజకవర్గంపై అందరి దృష్టి మళ్లింది. వాస్తవానికి బొల్లాకు ప్రత్యర్థి అయిన జీవీ ఆంజనేయులకు మంచివాడు, సౌమ్యుడనే పేరు ఉంది. గత ఎన్నికల్లో ఓడిపోయినా..ఈసారి ఆయన గెలుపు సునాయాసం అని నియోజకవర్గంలో ఎక్కువ మంది భావించారు. అయితే..ఆ అంచనాలను తలకిందులు చేస్తూ ఇప్పుడు మరోసారి బొల్లా గెలుస్తాడంటూ సర్వేలు ఊదరగొడుతున్నాయి.
గత ఎన్నికల్లో బోల్లాకు రికార్డు మెజార్టీ వచ్చినమాటవాస్తమే. అయితే అప్పుడు ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. ముఖ్యమంత్రి పదవి కోసం జగన్ ఒక్క ఛాన్స్ అని వేడుకుంటే..రాష్ట్ర ప్రజలు ఆయనకు ఇచ్చినట్లే తనను ఒక్కసారి ఎమ్మెల్యేను చేయాలని బొల్లా కోరితే..ఆయన కోరిన కోర్కెను గత ఎన్నికల్లో నియోజకవర్గ ఓటర్లు నెరవేర్చారు. వేలకోట్లు సంపాదించానని, తాను పుట్టని ప్రాంతానికి సేవ చేసుకుంటానని, మూడుసార్లు ఓడిపోయానని, జీవితంలో ఎమ్మెల్యే అనిపించుకోవాలనే కోరిక తప్ప తనకేమీ లేవని, తనను ఆదరించాలని బొల్లా గత ఎన్నికల సందర్భంగా నియోజకవర్గ ప్రజలను వేడుకున్నారు. నియోజకవర్గంలో పలు గ్రామాల్లో ఉన్న ఆయన బంధువులు పార్టీలకు అతీతంగా ఒక ఛాన్స్ ఇద్దామనే భావనతో ఆయనకు గత ఎన్నికల్లో ఓట్లు వేశారు. అంతే కాకుండా కాంగ్రెస్‌లో ఉన్న నాయకులను నర్సరావుపేట ఎంపి లావు కృష్ణదేవరాయలు వైకాపాలోకి తేవడం, జీవీపై ప్రజల్లో నెలకొన్న అనాసక్తితో బొల్లా సునాయాసంగా అప్పుడు గెలుపొందారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదని చెప్పవచ్చు.
గత పరిస్థితి ఇప్పుడు లేదు...!
కాంగ్రెస్ నుంచి వచ్చిన మక్కెన ఇప్పుడు బొల్లాను వదిలి టిడిపిలో చేరారు. ఆయన ప్రభావం కొన్ని గ్రామాల్లో ఖచ్చితంగా ఉంటుంది. అదే విధంగా పట్టణంలోని వైశ్యవర్గాలు గతంలో బొల్లాను ఆదరించాయి. కానీ ఇప్పుడు వారు టిడిపి కూటమివైపుకు వచ్చారు. అదే విధంగా పట్టణంలోని ముస్లింమైనార్టీలు కూడా టిడిపి వైపుకు మళ్లారు. గతంలో బొల్లాకు మెజార్టీ కట్టబెట్టిన నూజెండ్ల, బొల్లాపల్లి,ఈపూరు, వినుకొండ రూరల్, వినుకొండ పట్టణంలో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. గత ఎన్నికల్లో టిడిపికి మెజార్టీ వచ్చిన శావల్యాపురం మండంలో ఈసారి ఆపార్టీకి భారీ మెజార్టీ వస్తుంది. బొల్లా స్వంత మండలమైన శావల్యాపురంలో ఈసారి టిడిపి అభ్యర్థికి దాదాపు 5వేలకు పైగానే మెజార్టీ రావచ్చు.అదే విధంగా ఈపూరు, నూజెండ్ల మండలాల్లో టిడిపికి మెజార్టీ వస్తుంది. ఇక వినుకొండ రూరల్, బొల్లాపల్లి మండలాలు చెరిసగం అవుతాయి. వినుకొండ పట్టణంలో ఎంతో కొంత జీవీకి మెజార్టీ వస్తుంది. మొత్తం మీద చూసుకుంటే..5వేల నుంచి 8వేల మెజార్టీతో టిడిపి గెలవడానికే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే కొన్ని సర్వేలు మాత్రం వాస్తవాన్ని చూడకుండా..బొల్లా గెలుస్తాడంటూ..సర్వేలను ప్రకటిస్తున్నాయి. వాస్తవానికి ఓటింగ్ ప్యాట్రన్‌నుచూసుకున్నా ఇక్కడ గెలుపెవరిదో స్పష్టం అవుతుంది. టిడిపిని సమర్థించే కమ్మసామాజిక వర్గ ఓటర్లు ఇక్కడ దాదాపుగా 30వేల మంది ఉన్నారు. వీరిలో 80శాతం టిడిపివైపే ఉంటారు. ఇక పవన్ సామాజికవర్గానికి చెందిన ఓటర్లు కూడా ఇక్కడ గణనీయంగానే ఉన్నారు. ఎస్సీల్లో మాదిగ, బీసీల్లో రజక, వడ్డెర వర్గాలు గణనీయంగా టిడిపివైపు ఉన్నారు. ఇక వైశ్యవర్గం ఈసారి టిడిపికే మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఎటుచూసినా..ఏవైపు నుంచి చూసినా..టిడిపికే మద్దతు లభిస్తోంది. పెయిడ్ సర్వేలతో టిడిపిలో అభద్రతాభావాన్ని కల్గిస్తున్నారని, దీని చూసి టిడిపి కార్యకర్తలు, నాయకులు మోసపోవద్దని, బ్రహ్మాండమైన మెజార్టీతో టిడిపి గెలుస్తుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.