టిడిపి లీగల్ టీమ్ ఫెయిల్ అయిందా…?
చంద్రబాబును జైలు నుంచి బయటకు తేవడంలో తెలుగుదేశం లీగల్ టీమ్ ఘోరంగా విఫలమైందనే వాదన ఆ పార్టీ వర్గాలతో పాటు, సామాన్య ప్రజల్లోనూ వ్యక్తం అవుతోంది. 14 రోజుల క్రితం అక్రమ కేసులో అరెస్టు అయిన చంద్రబాబును విడిపించడంలో టిడిపి లీగల్ టీమ్ అనుకున్నంతగా పనిచేయలేదని, తమ వాదనలతో న్యాయమూర్తులను ఆకట్టుకోలేకపోయారనే భావన కొందరిలో వ్యక్తం అవుతోంది. చంద్రబాబు తరుపున వాదనలు వినిపించిన సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూద్రా సరైన వ్యూహాలను రచించలేదనే వాదన ఉంది. ఆయన కేసును డిస్మిస్ చేయించడానికే ప్రాధాన్యత ఇచ్చారని, చంద్రబాబును జైలు నుంచి విడిపించేందుకు వాదనలు చేయలేదని, ముందుగా బెయిల్ పిటీషన్‌ను వేయకుండా క్వాష్ పిటీషన్ దాఖలు చేయడం ఇబ్బందులకు కారణమైందన్న వాదన ఉంది. అయితే..తనను బెయిల్‌పై బయటకు తేవద్దని, అక్రమకేసును కొట్టివేయించాలని చంద్రబాబు కోరడంతోనే బెయిల్ ను సిద్ధార్థ కోరలేదనే ప్రచారం ఉంది. అయితే..ఏసీబీ కోర్టులో జరిగిన పరిణామాలను చూసిన తరువాత అయినా హైకోర్టులో బెయిల్ కోసం పిటీషన్ వేయించి ఉండాల్సిందని, అలా కాకుండా అక్కడ కూడా క్వాష్ కోసం ప్రయత్నించడంతో అక్కడా ఎదురుదెబ్బ తగిలిందని, ఈ విషయాలను టిడిపి లీగల్‌సెల్ ముందుగా ఆలోచించలేదా అన్న ప్రశ్న ఆయా వర్గాల నుంచి వ్యక్తం అవుతోంది.
కోర్టుల్లో కాలం గడిచిపోతుండడంతో కార్యకర్తల్లో నిరాశ, నిర్వేదం వ్యక్తం అవుతోందని, చంద్రబాబు ఎన్ని రోజులు జైలులో ఉంటే అంతగా పార్టీ నష్టపోతుందని, ఈ విషయాన్ని వ్యూహకర్తలు పట్టించుకోవడం లేదనే భావన కొందరిలో వ్యక్తం అవుతోంది. సుధీర్ఘ న్యాయపోరాటం పార్టీకి నష్టం చేస్తుందని, ఆధారాలు లేని కేసులో వెంటనే బెయిల్ తెచ్చుకుని, మళ్లీ ఎప్పటిలాగానే చంద్రబాబు ప్రజల్లోకి వెళితే..పార్టీకి లాభం ఉంటుందని, అలా కాకుండా అధినేత జైలులో ఉండి, న్యాయపోరాటంలో పదే పదే ఎదురుదెబ్బలు తినడం క్యాడర్‌లో మానసిక స్థైర్యాన్ని కోల్పోయేలా చేస్తుందని, ఇప్పటికైనా చంద్రబాబు బెయిల్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, అరెస్టు కాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటే తరువాత సంగతి తరువాత చూసుకోవచ్చన్న అభిప్రాయం మరికొందరిలో వ్యక్తం అవుతోంది. చంద్రబాబుపై వచ్చిన అవినీతి ఆరోపణలను ప్రజలు నమ్మడం లేదని, అటువంటి సమయంలో బెయిల్ తీసుకుని బయటకు వచ్చి అధికారపార్టీని ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని, ఇప్పటికైనా టిడిపి లీగల్‌సెల్ తన వ్యూహాలను మార్చుకోవాలన్న అభిప్రాయం అన్ని వర్గాల్లోనూ వ్యక్తం అవుతోంది.