లేటెస్ట్

‘వైఎస్’ శిష్యులు ‘ష‌ర్మి’ల‌ను ఆదుకుంటారా...?

తెలంగాణ‌లో రాజ‌న్న‌రాజ్యం తెస్తాన‌ని, తానే కాబోయే ముఖ్య‌మంత్రిని అని బ‌హిరంగంగా చెప్పుకున్న వై.ఎస్ కుమార్తెకు ఆమె ఆశించిన స్థాయిలో ప్ర‌జ‌ల నుంచి స్పంద‌న రాక‌పోవ‌డంతో ఏమి చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. ఎన్ని ధ‌ర్నాలు చేసినా,సిఎం ‘కెసిఆర్’ ను, ఆయ‌న కుమారుడు ‘కెటిఆర్’ ను లక్ష్యంగా చేసుకున్నా తెలంగాణ ప్ర‌జ‌లు ఆమెను సీరియ‌స్ గా తీసుకోవ‌డం లేదు. పార్టీకి ప్ర‌జ‌ల్లో మైలేజ్ రాక‌పోవ‌డంతో ఖిన్న‌రాలైన ‘ష‌ర్మిల‌’ను ఓదార్చేందుకు, పార్టీకి ఊపు తెచ్చేందుకు ఆమె త‌ల్లి ‘విజ‌య‌మ్మ’ రంగంలోకి దిగార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. తెలంగాణ‌లో ‘ష‌ర్మిల’ పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాల‌నే దానిపై ఆమె’ వై.ఎస్.రాజ‌శేఖ‌ర్’ రెడ్డి శిష్యుల‌ను స‌ల‌హాలు, సూచ‌న‌లు అడుగుతున్న‌ట్లు స‌మాచారం. ఉమ్మ‌డి రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన ‘రాజ‌శేఖ‌ర్ రెడ్డి’కి ప‌లువురు శిష్యులు ఉన్నారు. ‘రాజ‌శేఖ‌ర్ రెడ్డి’కి అత్యంత స‌న్నిహితులైన వారిలో చాలా మంది ఆయ‌న మృతి త‌రువాత వారంతా కాంగ్రెస్ లోనే కొన‌సాగారు.కొంద‌రు జ‌గ‌న్ తో న‌డిచినా..’రాజ‌శేఖ‌ర్ రెడ్డి’కి ఆప్తులైన వారు మాత్రం కాంగ్రెస్ లో ఉన్న‌వారు ఉన్నారు..మ‌రికొంత మంది ఇత‌ర పార్టీలో చేర‌గా కొంద‌రు క్రియాశీల‌క రాజ‌కీయాలకు దూరంగా ఉంటూవ‌స్తున్నారు. అయితే ఇప్పుడు ‘ష‌ర్మిల’ పార్టీ కోసం ‘విజ‌య‌మ్మ’ వీరంద‌రితో స‌మావేశం ఏర్పాటు చేయ‌బోతున్నారు. 


సెప్టెంబ‌ర్ 2 వ తేదీన హైద‌రాబాద్ లో ఈ స‌మావేశం నిర్వ‌హిస్తున్నార‌ని తెలుస్తోంది. ‘వై.ఎస్. రాజ‌శేఖ‌ర్ రెడ్డి’ 12వ వ‌ర్థంతిని పుర‌స్క‌రించుకుని ఈ స‌మావేశాన్ని నిర్వ‌హించ‌బోతున్నారు. దీనికి వై.ఎస్ కు ఆత్మ‌గా పిలువ‌బ‌డే ‘కె.వి.పి.రామ‌చంద్ర‌రావు’తో పాటు మాజీ ఎంపి ‘ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్’, మాజీ పిసిసి అధ్యక్షుడు ‘డి శ్రీనివాస్’, మాజీ స్పీకర్ ‘కెఆర్ సురేష్ రెడ్డి’ని ‘విజ‌య‌మ్మ’ స్వ‌యంగా ఆహ్వానించారు. వీరు కాకుండా ఆంధ్రా, తెలంగాణ మంత్రివ‌ర్గంలో ఉన్న వై.ఎస్ ను అభిమానించే మంత్రుల‌ను కూడా ఆహ్వానించిన‌ట్లు తెలుస్తోంది. వీరంద‌రితో స‌మావేశం ఏర్పాటు చేసి, ‘ష‌ర్మిల’ పార్టీ ఎదుగుద‌ల‌కు ఏమి చేయాల‌నే దానిపై చ‌ర్చిస్తారంటున్నారు. ఆంధ్రాలో ‘వై.ఎస్ జ‌గ‌న్’ స‌క్సెస్ చేయ‌డానికి వీరంతా తెర వెనుక నుంచి ఎంతో కృషి చేశారు. అదే విధంగా తెలంగాణాలో కూడా ‘ష‌ర్మిల’ ఎదిగేందుకు ముఖ్య‌మంత్రి అయ్యేందుకు వీరి సేవ‌ల‌ను ఉప‌యోగించుకోవాల‌ని ఆమె కోరుకుంటున్నార‌ట‌. 2వ తేదీన ఏర్పాటు చేసే ఈ స‌మావేశంలో వీరంద‌రితో ‘విజ‌య‌మ్మ’ స్వయంగా చ‌ర్చిస్తార‌ని, గ‌తంలో ‘వై.ఎస్’ వారికి ఎలాంటి తోడ్పాటు అందించింది, వారి ఎదుగుద‌ల‌కు ఎలా స‌హ‌క‌రించిందీ గుర్తు చేస్తారంటున్నారు. ‘వై.ఎస్’ కు, ‘జ‌గ‌న్’ కు స‌హ‌క‌రించిన విధంగానే ‘ష‌ర్మిల‌’కుస‌హ‌క‌రించాల‌ని త‌ద్వారా తెలంగాణాలోనూ ‘రాజ‌న్న రాజ్యం’ ఏర్పాటు చేసుకుందామ‌ని ఆమె చెప్ప‌బోతున్నారంటున్నారు. మొత్తం మీద చాలా రోజుల త‌రువాత వైఎస్ శిష్యులు ఒక చోట చేర‌బోతున్నారు. వీరంతా ‘విజ‌య‌మ్మ’ మాట‌ల‌ను ఆల‌కించి ‘ష‌ర్మిల‌’కు స‌హ‌కారం అందిస్తారో లేదో చూడాల్సి ఉంది. కాగా వైకాపా గౌర‌వ అధ్య‌క్షురాలు ఏర్పాటు చేసే ఈ స‌మావేశానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి ‘వై.ఎస్.జ‌గ‌న్’ హాజ‌రు అవుతారా?  లేదో చూడాల్సి ఉంది. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ